మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) - శ్లోకం - 5


-

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

-

శ్లోకం - 5

యావద్విత్తోపార్జన సక్తః 

తావన్నిజ పరివారో రక్తః|

పశ్చాజ్జీవతి జర్జర దేహే

వార్తాం కోపి న పృచ్ఛతి గేహే||

-

శ్లోకం అర్ధం :

ధనమును సంపాదించుచున్నంత వరకే నీ బంధు మిత్ర పరివార జనము నీ యందు అనురాగము, ఆసక్తి చూపుదురు. 

ముసలితనమున నీ దేహము శిథిలమై శక్తిహీనమైనప్పుడు 

నీ ఇంట నిన్ను పలుకరించు వారు ఎవ్వరూ ఉండరు. 

-

తాత్పర్యము : 

నీవు పదవులలో ఉండి ధనము సంపాదించు సమయమున, నీ భార్యా బిడ్డలు నీపై అతి ప్రేమ కురిపించెదరు. నీ బంధువులందరు నిన్ను అతి మర్యాదగ చూతురు. సేవకులు, సహోద్యోగులు నిన్ను గౌరవింతురు. దానికి కారణము నీ గొప్ప కాదు, నీవల్ల వారికి జెరిగే ప్రయోజనమో, లేదా నీవల్ల వారికి హాని జెరుగకుండయుండు నటుల వారు అలా నటింతురు. 

ఒక్కసారి ఆ పదవి పోగానే, నీలో ధనార్జన శక్తి సన్నగిల్లగానే, నిన్ను ఎవరూ పట్టించుకొనరు. ఇంటా, బయటా నీకు గౌరవము లభించదు. నీకు వేళాకోళములు, హేళనలు, ఎగతాళులు, చులకనలు ఎదుర్కొనే దుస్థితి కలుగుతుంది. 

కనుక తెలివిగా ఇప్పుడే కనులు తెరిచి, ప్రేమ స్వరూపుడైన ఆ పరబ్రహ్మ ఆదరణకు పాత్రుడవగుటకు ప్రయత్నించుము. కరుణామూర్తి అయిన ఆ పరబ్రహ్మ అభిమానము చూరగొనవలెనన్న, ఈ వస్తు సంపదలపై మోహము విడనాడి, దేహ సంబంధులైన వ్యక్తులపై మమతను వీడి, మనసును మాధవునికి అర్పణ చేసుకొనుము.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!