" పోతన భాగవతము " లోని మధురిమలు – కాటుక కంటినీరు!


-

" పోతన భాగవతము " లోని మధురిమలు – కాటుక కంటినీరు!

కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో

కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో

హాటకగర్భురాణి! నిను నాకటికిం గొనిపోయి యల్ల క

ర్ణాట కిరాట కీచకులు కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!

-

          నీవు కంటికి పెట్టుకున్న కాటుక, కన్నీటికి కరిగి రవికపై పడేలా ఎందుకు ఏడుస్తావు, తల్లీ?

 ఆ మహా విష్ణువునకు ఇష్టమైన కోడలా! ఓ మా తల్లీ!

 బ్రహ్మదేవునికి సాక్షాత్తు ఇల్లాలా! 

నిన్నుతీసుకుపోయి అంగట్లో పెట్టినట్లు, ఆ కర్ణాట కిరాట కీచకులకు అమ్మివేయను. త్రికరణ శుద్ధిగా ఒట్టు వేస్తున్నాను. నన్ను నమ్ము సరస్వతీదేవి!

          ఆంధ్రమహాభాగవతాన్ని రాజుకి అంకితం యిమ్మని, బమ్మెర పోతనను అనేక రకాలుగా వత్తిడి చేస్తున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా. ఆ పైన వత్తిడి చేసేవారు సాక్షాత్తు శ్రీనాథ కవిసార్వభౌములు. పోతరాజు నలిగిపోతున్నాడు. 

అయినా శ్రీరామునికి తప్ప నరుల కెవ్వరికి అంకిత మివ్వను అంటున్నాడు. 

గంటం పట్టింది సంపాదించటానికి కాదు, నా నాగలి పెట్టేది మాకు చాలు అంటున్నాడు. అట్టి పరిస్థితులలో ఒకమారు దేవతా పీఠం వద్ద కలత మనసుతో వచ్చి కూర్చున్నాడు. సాక్షాత్తు తల్లి వాణి కన్నీరు కారుస్తూ ప్రత్యక్ష మైంది. 

చూసి తట్టుకోలేని బాధలో చెమర్చిన కన్నులతో పోతన్నగారి నోటివెంట ఈ పద్యం అలవోకగా జాలువారిందిట. ఆమె తృప్తిగా వెళ్ళింది. ఎలా అయితేనేమి ఈ పరమాద్భుతమైన చాటువు తెలుగువారికి దక్కింది.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!