మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 12.

-

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

శ్లోకం - 12.

-

దినయామిన్యౌ సాయం ప్రాతః 

శిశిరవసంతౌ పునరాయాతః|

కాలః క్రీడతి గచ్ఛత్యాయుః

తదపి న ముంచత్యాశావాయుః||

-

శ్లోకం అర్ధం : రాత్రింబవళ్ళు, ఉదయ సాయంకాలములు, 

శిశిర వసంతాది ఋతువులు ఒకదాని వెంబడి ఒకటి వచ్చుచు పోవుచుండును. 

ఈ విధముగా కాలము క్రీడించుచున్నది, ఆయువు క్షీణించుచున్నది. అయిననూ ఆశాపిశాచము మాత్రము నిన్ను వదలకయే ఉన్నది.

-

తాత్పర్యము :

మానవ జీవిత పరిమితి వంద సంవత్సరములు.

అందులో మన దురలవాట్ల వల్ల, రోగముల వల్ల, వ్యాధుల వల్ల, ఆపదల వల్ల ఆ జీవితకాలము ఎంతో తరగిపోవుచున్నది. అందులో సగభాగము మనము నిద్రలో గడుపుచున్నాము. తిండి, క్రీడలు, వినోదములకు చాలా భాగము వినియోగించు చున్నాము. 

ఆ మిగిలిన కొంత భాగమైనను భగవంతుని సేవకై వినియోగించక, పర దూషణలు, నిందలు, కామ క్రీడాది కార్యక్రమములకై వినియోగించు చున్నాము. ఈ విధంగా మన జీవితకాల మంతయు గడిచి పోవుచున్నది. 

స్వామి సేవ రేపు, మాపు అనుకొంటూ లేని పోని సాకులతో 

కాలయాపన చేయుచున్నాము. ఈ విధంగా గంటలు, రోజులు, పక్షములు, మాసములు, సంవత్సరములు గడిచి పోవుచున్నవే

కాని, భగవత్ ధ్యానానికి ఒక క్షణము వెచ్చించుట లేదు. ఈ విధంగా మనకు ఎన్నో జన్మలు గడిచినవి, గడచును కూడా! 

మానవ జన్మము బహు దుర్లభమైనది. అది చేజారిన మరల దొరుకుట కష్టము. కావున, ఉన్న సమయమునైనా భగవత్ చింతనలో గడిపి, జీవితము సఫలము చేసుకొనుము.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!