నిర్ఘాంతపోయిన" నేను రాసుకొన్న కథ...

-

"నిర్ఘాంతపోయిన" నేను రాసుకొన్న కథ...

-

అనగనగా

ఊ...అనగనగ

ఒక ఊరు

ఒక పేద్ద ఊరు

ఆ పేద్ద ఊరుకో పేద్ద రాజుగారు

ఆ రాజుగారికో అబ్బాయి

ఆ రోజటి సంప్రదాయం దేశాటన

వయసు వచ్చాక రాకుమారులందరు చేసే పనే

మన రాకుమారుడు ఇంకో రాజ్యానికి వెళ్ళాడు

అక్కడ ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు

మనవాడి రాజ్యంలో కన్నా చాలా సంతోషంగా ఉన్నారు

కారణమేమిటని శోధించాడు

రుచికరమైన భోజనమే ఆ సంతోషానికి కారణమని కనుగొన్నాడు

ఆ రుచి ఎక్కడినుంచి వస్తోందో తెలుసుకోవాలని ఒకరి ఇంట్లో తిష్ట వేసినాడు

ఆ ఇంటివారూ చాలా సౌమ్యులు

చాలా మంచివారు

ఆ ఇంటావిడ పేరు కమలమ్మ

ఇంటాయన పేరు రాఘవయ్య

ఆ రోజటి మధ్యాహ్నం కమలమ్మ గారు భోజనాలకు లెమ్మని విస్తళ్ళలో ఎన్నో రకాలు వడ్డించారు

అన్ని రకాలు చూడగానే నోటిలో ఊట మొదలయ్యింది

చక్కగా కళ్ళకింపుగా ఉన్న వాటిని చూస్తూంటే ఊటసొల్లు గంగలా ప్రవహిస్తోంది

దానికి తగ్గట్టు ఆవిడ కొసరి కొసరి వడ్డించటం, గోరుముద్దలు చేసి గోముగా పెట్టటం వల్ల కళ్ళ నీళ్ళొచ్చిసినాయ్ మనవాడికి

అంతా అయిపోయాక అడిగాడు అమ్మను, అమ్మా ఇవన్నీ నేనెప్పుడు తినలేదు ఈ రుచి అంతా ఎక్కడినుంచి వచ్చింది అని

కమలమ్మ గారు అన్నారు, నాయనా, ఇదంతా ఈ ఆకుకూర మహత్యం అని ఒక కట్ట చూపించింది

అలాటి ఆకులు, అలాటి కట్ట ఎన్నడు చూడలేదు ఆ అబ్బాయి

మీకెక్కడి నుంచి వచ్చింది ఈ ఆకుకూర అని అడిగినాడు

తెలియదు అబ్బాయి, మా తాతల తాతలలో ఒకాయన అన్నపూర్ణమ్మ తల్లిని ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఇచ్చిన ప్రసాదం ఇది అని వివరించింది

అట్లాగైతే అమ్మా దీనిని తీసుకెళ్ళి మా ఊళ్ళో కూడా పెంచి వంటలు చేసుకొని మా జనాలను కూడా సుఖసంతోషాలలో ముంచేస్తానన్నాడు అబ్బాయి

సరే నాయనా తీసుకుపోమని వంద గంపల ఆకులు, కట్టలు ఇచ్చింది

ఆ కుర్రవాడు తన రాజ్యానికి వెళ్ళిపోయినాడు

అందరికీ పంచి ఇచ్చి వంట చెయ్యండన్నాడు

ఆ రోజు వంటరాని ఇంటావిడ ఉన్న ఇంట్లో కూడా అందరూ సుష్టుగా తిన్నారు, ఆనందంలో మునిగిపోయారు

అది చూసి ఒక మంత్రిగారు అడిగారు రాకుమారుణ్ణి, అయ్యా దీని పేరేమి, దీని కథాకమామీషేమని

అబ్బాయికి కమలమ్మగారు ఆ ఆకుకూర పేరు చెప్పకపోవటంతో మనవాడే ఆవిడ తనకు తల్లిలా గోముగా పెట్టిన గోరుముద్దలు జ్ఞప్తికి తెచ్చుకొని ఇది "గోముకూర" అని నామకరణం చేసినాడు

ఆరోజటినుంచి ఆ కూర గోంగూరగా మన దేశంలో వర్ధిల్లిపోయింది

** రాకుమారుడు ఆ ఆకుకూర తెచ్చుకున్న ఊరు దేవరకోట. అనగా ప్రస్తుతమ్మ్ దివిసీమలో ఉన్న చల్లపల్లి. ఆ కమలమ్మ గారు మా అమ్మమ్మగారు

*** ఆవిడ చేసే రోటి గోంగూర పచ్చడి, రాచిప్ప గోంగూర పులుసు ఎంత అమృతతుల్యమో

*** మొన్న శనివారం మాయావిడ దేశీ బజారులో ప్రియా గోంగూర పచ్చడి బాటిలు తెచ్చుకోగా "నిర్ఘాంతపోయిన" నేను రాసుకొన్న కథ... 

-మాగంటి వంశీ మోహన్ !

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!