"అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి" ! (భక్తికి సంస్కృతానికి సంబంధం-వేటూరి.)

-




-

"అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి" !

(భక్తికి సంస్కృతానికి సంబంధం-వేటూరి.)

.

సప్తపది చిత్రంలో "అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి" అనే పాట. అందులో మూడు చరణాలలో ముగురమ్మలను వర్ణిస్తూ వేటూరి వ్రాసారు.

ఇది కూచిపూడి సంప్రదాయంలో వచ్చిన పాట. ఇది చిత్రంలో వినియోగించడం జరిగింది .

"కొన్ని శబ్దాలు చూస్తుంటే వేటూరి మాత్రమె చెయ్యగలరు అనిపిస్తోంది. ఉదాహరణకు శర్వార్ధగాత్రి, సర్వార్థ సంధాత్రి -- ఈ అందం, పైగా శిల్పరచన అంతా చూస్తుంటే వేటూరి గారిదే అనిపిస్తోంది. 

అలాగే మొదటి చరణంలో పార్వతి, రెండవ చరణంలో మహాలక్ష్మి, మూడవ చరణంలో సరస్వతి గురించి చెప్పి నాలుగవ చరణంలో సమన్వయం చేస్తూ తీసుకురావడంలో ముగురమ్మల మూలపుటమ్మ స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ చేసిన అద్భుతమైన రచన .

ఇది వేటూరి శైలే.

వేటూరి పండిత-పామర జనరంజకంగా పాటలు వ్రాస్తారు అని అందరికీ తెలిసిన విషయానికి మరొక రుజువు. 

.

శర్వార్ధగాత్రి అంటే శర్వుడి (శివుడి) శరీరంలో సగభాగం అని, 

సర్వార్థ సంధాత్రి అంటే అన్ని పనులనూ నేరవేర్చే శక్తి అని.

పార్వతీ దేవికి ఇది ఎంత అందమైన వర్ణన?

సరస్వతీ దేవిని వర్ణిస్తూ సరససాహిత్య, స్వరస సంగీత స్తనయుగళే అన్నారు. అంటే సంగీతం సాహిత్యం రెండు వక్షోజాలుగా కలిగింది అని చెప్తున్నారు. 

బిడ్డలకు కలిగే కళాపిపాసను తీర్చగలిగిన తల్లి ఆవిడే కదా, మరి. 

నాకు ఇంకా నచ్చినది శుక శౌనకాది వ్యాస వాల్మీకి ముని గణ పూజిత 

శుభచరణే అనడం.

అదొక్కటే కదా సంస్కృతంలో వ్రాసిన పాట అనుకుంటున్నారా? 

ఆలాపన చిత్రంలో ఆరు ఋతువులు అనే పాటలో రెండో చరణాన్ని 

గురించి మాట్లాడే అర్హత నాకు లేదు అని నేను ఇక్కడ వ్రాయట్లేదు అంతే. 

అది ఒక సారి విని చూడండి. మీకు పూర్తిగా అర్థమైతే నాకు చెప్పండి. 

.

మరొక చక్కని పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో

జై చిరంజీవా జగదేక వీర. చిన్న చిన్న పదాలతో చక్కగా సాగే భక్తీగీతం

.

వేటూరిలో ఉన్న ఒక విశేషం ఏమిటి అంటే -- మనం ఆయన్ని గురించి ఒక మాట

చెప్పగానే, దానికి వ్యతిరేకమైన మాట కూడా నిజమేనని గుర్తు చేస్తారు. 

ఇప్పుడే భక్తీ పాటలు అన్నానా? వెంటనే "నాయనా, భక్తికి సంస్కృతానికి సంబంధం ఏమిటి?" అన్నట్టు మరొక పాట గుర్తొచ్చింది. వినేవాళ్ళకు ఆశ్చర్యంగానో, వెటకారం గానో, అసభ్యంగానో అనిపించినా వేటూరి వ్రాసిన ఒక mass పాటలో మరొక అందమైన ప్రయోగం ఉంది.

ఇందువదన, కుందరదన, మందగమన, మధురవచన, సొగసులలన, గగనజఘునవే

చంద్రుడిలాంటి ముఖం కలదానా, 

మల్లెపూల వంటి పలువరుస కలిగిన దాన, 

నెమ్మదిగా నడిచేదానా 

(నెమ్మదిగా నడవడంలో అందం కూడా ఉంటుంది అని కవులు ఇలాగ అంటారు), 

చక్కగా మాట్లాడేదాన, అందమైన దాన అంటూ నాయికను పొగిడి

మళ్ళీ "ఆకాశం వాలే విశాలమైన వంటి కటిప్రదేశం కలిగినది" అంటూ

తమదైన శైలిలో కొంచెం సంస్కృతం సమాసాల-మసాలా కూడా దట్టించారు.

కవిత్వం అంటే అదే కాదా -- చక్కని భావాన్ని తీయని పదాలతో పండితులకు, పామరులకు నచ్చేలాగా చెప్పడం. వేటూరికి వచ్చింది, ఆయన మనకు ఇచ్చింది, మనకు నచ్చింది అదే కదా!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!