కఠోపనిషత్ – 4 (June 7)

కఠోపనిషత్ – 4 (June 7)
భగవద్గీత అనేక మోక్షమార్గాలను తెలిపినది. తీవ్రమైన మోక్షేచ్ఛతో సాధన ప్రారంభించిన మానవుడు మధ్యేమార్గంలో మృత్యువాత పడితే అతని సాధన గతి ఏమిటి? పునర్జన్మ అతని కర్మఫలంగా వస్తుంది. ఆ నూతన జన్మలోరాబోయే పరిస్థితులపై అతనికి నియంత్రణ ఉండదు. మోక్షమునకై ఇచ్ఛ ఉంటుందో, ఏస్థాయిలో ఉంటుందోకూడా తెలియదు. పూర్వజన్మ వాసనలు సంస్కారములరూపంలో ఉండవచ్చును. అందుచేత మృత్యువు పరానికి సంబంధించినంతవరకూ ప్రమాదకారియే.
ఉదాహరణకు సుబ్బారావు అనే వ్యక్తి మరణించాడు. కొన్ని సంవత్సరాల తరువాత అతని ఆత్మ ఇంకొక ఊరిలోని ఇంకొక కుటుంబంలో సురేశ్ గా పునర్జన్మ ఎత్తినదనుకోండి. ఇది ఆత్మకు దీర్ఘకాల ప్రయాణము. జీవులు మానవదేహములలో ఉండే కాలము కంటె దేహములో ఉండని కాలమే ఎక్కువ. అందుకే మానవ జన్మ దుర్లభము అంటారు. దేహములోలేని కాలము జీవునకు దుర్భరమైన దీనావస్థ. సుబ్బారావు దేహము ధరించిన జీవుని ప్రయాణం (అతని మరణం నుండి, సురేశ్ తల్లి గర్భంవరకూ) గురించి ఎవరు చెప్పగలరు? (యముడు తప్పక చెప్పగలడు. ఎందుకంటే యాతనాశరీరం ధరించిన ప్రేతాత్మ యమలోకంవెళ్ళి, అక్కడ యముని నిర్ణయంతో స్వర్గ, నరకవాసాల కాలము నిర్ణయింపబడుతుంది కనుక).
సుబ్బారావు పుణ్యపాపాలు సురేశ్ ప్రారబ్ధకర్మగా ఎలా పరిణమిస్తాయి? సుబ్బారావు దేహాన్ని వదలిన సూక్ష్మశరీరం ఎంతవరకు తన పూర్వజన్మస్మృతిని కలిగిఉంటుంది? ఆత్మ శాశ్వతమంటే నూతన దేహంలో ఆ జీవుని మొదటి దేహానికి సంబంధించిన అహంకార పూరిత వ్యక్తిత్వం కాదు కదా! ప్రతిజన్మలోనూ జీవాహంకారం వేరుగా ఉంటుంది. మృత్యుంజయత్వమంటే అర్థంఏమిటి? ముక్తి ఎవరికి? మొదటి జన్మలోని సుబ్బారావు అనే వ్యక్తికా? రెండో జన్మలోని సుబ్బారావు ఆత్మ ప్రవేశించిన సురేశ్ అనే వ్యక్తికా? మరణం సుబ్బారావు దేహానికైతే, సుబ్బారావు ఆత్మ, అతని జీవాహంకారంతో నిలిచి ఉంటుందా? జీవాహంకారం నశించినతరువాత అదే ఆత్మ ఇంకొక శరీరం ధరిస్తుందా? గర్భస్థ శిశువులో జీవాత్మ ఉంటుంది కాని అహంకారం ఉండదు. జననం, తరువాత నామకరణం తోనే అహంకారం పెరగడం ప్రారంభిస్తుంది. అంటే పుట్టినసమయం ఆధారంగా చెప్పే జాతకం ఆత్మకు కాదు, అహంకారానికి అన్నమాట. సుబ్బారావుకు తొలి జన్మలోకలిగిన మోక్షముపై ఇచ్ఛ, రెండవ జన్మయైన సురేశ్లో ఎంతవరకు నిలిచిఉంటుంది? సుబ్బారావు మరణం ఎక్కడైనా ఎప్పుడైనా సంభవించియుండవచ్చును. అతని మరణానుభవం, పునర్జన్మ గురించిన వివరాలు, సురేశ్ తో సహా ఇతరులు తెలుసుకోలేని అనుభవాలు. సుబ్బారావు దైహిక బంధాలు - భార్య, పిల్లలు, ధనం, గృహం, కీర్తి, మేధస్సు - అతని మరణంతో దేహముతోబాటుగా పోతాయి. అవి సురేశ్కు ఏవిధంగాను ఉపకరించవు. అతని పుణ్య పాపాలు కర్మ ఫలాలుగా సురేశ్ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అది అతని విధివ్రాత! సామాన్యునిగా దానిని అర్థంచేసుకోలేడు, అధిగమించలేడు. జ్యోతిష శాస్త్రం కొంతవరకు దీనిని గుర్తించే ప్రయత్నంచేస్తుంది. వాటి వలన అతని పరానికి ఏ విధమైన ఉపయోగము లేదు. సురేశ్ ఆధ్యాత్మికంగా ఏస్థితిలో ఉంటాడు? ప్రతి మరణం కర్మానుగుణంగా ఒక కొత్తవ్యక్తిని సృష్టిస్తుందా?
సద్గురు శివానంద మూర్తిగారు ఈ పరిస్థితిని పరమపద సోపాన పటము (వైకుంఠపాళి)లోని పాములు నిచ్చెనల ఆట తో (Old Hindu version of Snakes and Ladders) పోలుస్తారు. అల్ప సాధనలు చిన్న చిన్నపుణ్యాల నిచ్చెనలను ఎక్కిస్తే, మృత్యువు పెద్దపాముకు చిక్కినట్లు, కర్మానుసారముగా జీవుని స్థితిని ప్రారంభ దశకు (back to square one) తీసుకొని వస్తున్నది. జీవుడు మరల భిన్నమార్గాన్వేషణకు దిగుతున్నాడు. మరణము అల్ప సాధకుని సాధన సంపత్తిని హరించుచున్నది.
(ప్రయత్నించినా జీవుడు, సూక్ష్మ శరీరం, యాతనా శరీరం, ప్రేతాత్మ, ప్రారబ్ధకర్మ వంటి పారిభాషిక పదాలు వాడడం తప్పలేదు. వాటిని గురించి విడిగా మరోసారి)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!