Vvs Sarma కఠోపనిషత్ – 5 (June 8)

కఠోపనిషత్ – 5 (June 8)
వాజశ్రవసుడు అనే ఋషి ఉండేవాడు. ఆయనకు అరుణి (అరుణ మహర్షి కుమారుడు), ఔద్దాలకుడు (ఉద్దాలక మహర్షిచేత పెంచబడిన వాడు)అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆయన ఉత్తమలోకములనిచ్చే ఒక గొప్పయాగం (విశ్వజిద్యాగము) చేశాడు. ఆయాగంలో భాగంగా తనకున్న సంపద నంతా ( గోసంపద) దానం చేశాడు. ఆయన ధనాదుల త్యాగమే కాక యాగఫల త్యాగం కూడా చేశాడు. ఆయనకు ఒక కుమారుడు. చిన్నవాడు. పేరు నచికేతసుడు.
కుమారుడు అంటే ఎంత వయస్సు ఉంటుంది? వీటి సమాధానాలు ఉపనిషత్తులో ఉండవు. సందర్భోచితంగా మనం ఊహించుకోవాలి. అతడు అడిగిన ప్రశ్నలనుబట్టి, కుమార అన్న పద ప్రయోగమును పట్టి, అతనికి శ్రద్ధ ఆవహించినదన్న వాక్యాన్నిబట్టి అతడు కౌమారావస్థలో 14-15 సంవత్సరాల ప్రాయంలో ఉన్నాడని అనుకోవచ్చు. "తండ్రీ! ఇంత యజ్ఞంచేశావు? ఇన్ని దానాలు ఇచ్చావు, మరి నన్ను ఎవరికి ఇస్తావు?" అని తండ్రిని అడిగాడు. 9సంవత్సరాలకే ఉపనయనం జరిగి, మరో ఐదారు సంవత్సరాల వేదాధ్యయనం చేసిఉండవచ్చు. తద్వారా కలిగిన శ్రద్ధతో తండ్రిచేస్తున్న యాగం గురించిన ప్రశ్నలు వచ్చాయి. తండ్రి యజ్ఞఫలంగా ఉత్తమలోకాలకు తక్షణం వెళ్ళిపోతే తనగతి ఏమిటన్న భయం ఉండవచ్చు. ఎవరైనా ఋషికి తనను దానమిచ్చి తనకు జ్ఞాన మార్గమును చూపించ వచ్చు. ఈ ఆలోచనలతో వచ్చిన వివేకంతో ఆప్రశ్న అడిగినట్లు తోస్తుంది. ఇంత యజ్ఞంచేశాక తండ్రి భవిష్యత్తు ఏమిటి? తండ్రి వెంటనే ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడా? అప్పుడు తన భవిష్యత్తు ఏమిటి?
తరువాత మంత్రములో గోదానమును గురించిన ప్రశ్న వస్తుంది. "నీ గోధనమంతా దానం ఇచ్చావుకదా. దానిలో గడ్డితినలేనివి, నీరు త్రాగనివి, గర్భధారణచేయలేనివి, అంతిమకాలంలో ఉన్నవీ ఉన్నాయికదా. వాటిని దానంచేయడం వలన దోషం వస్తుందేమో?" ఇది కుమారునికి వచ్చిన అనుమానమో, ఆ మాటలు ప్రకాశముగా అన్నాడో, లేదో కూడా తెలియదు. తండ్రినుండి సమాధానంలేక పోవడం వలన "నన్ను ఎవరికిస్తావు? నన్ను ఎవరికి ఇస్తావు" అని రెండోసారి, మూడవ సారి కూడా నచికేతుడు అడుగుతాడు. "మృత్యవే త్వాదదామి ఇతి". "నిన్ను మృత్యువుకు ఇస్తాను" అన్నాడు తండ్రి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!