ఆది కవి.... వాల్మీకి.

ఆది కవి.... వాల్మీకి.
ఈ వ్యాసాన్ని కొన్ని కథలతో మొదలు పెడతాను. మనం ఆదికావ్యం అనుకునే రామాయణాన్ని గురించి, ఆదికవి అనుకునే వాల్మీకిని గురించి చాలామందికి తెలిసిన కథ ఒకటుంది. ఇప్పుడు వాల్మీకి రామాయణం అనే పేరుతో సంస్కృతంలో అచ్చయే రామాయణ పుస్తకాలు అన్నింటి లోను ఈ కథ వుంటుంది. ఈ రామాయణం రెండవసర్గలో వాల్మీకి తమసా నదిలో స్నానం చేయడానికి వెళ్తాడు. ఆయనతో పాటు ఆయన శిష్యుడు భరద్వాజుడు కూడా వెళ్తాడు. ప్రశాంతంగా ఉన్న ఆ ఉదయం ప్రశాంతమనస్కుడైన వాల్మీకి హాయిగా ఉన్న రెండుపక్షులను చూస్తాడు. అవి క్రౌంచపక్షులు. ఒకటి ఆడ, ఇంకొకటి మగ. ఆ పక్షులు రెండూ హాయిగా మైథునానందంలో మైమరచి వున్నాయి. ఆ సమయంలో ఒక బోయవాడు (నిషాదుడు) ఆ రెండింటిలో మగపక్షిని చంపుతాడు. చచ్చిపోతున్న మగపక్షిని చూసి ఆడపక్షి ఏడుస్తూ వుంటుంది. ఆ విషాద దృశ్యాన్ని చూసి అప్రయత్నంగా వాల్మీకి నోటి నుంచి శాపరూపమైన ఈవాక్యం1 వినిపిస్తుంది.

మా నిషాద ప్రతిష్టామ్ త్వమగమశ్శాశ్వతీస్సమాః
యత్క్రౌంచమిథునాదేక మవధీః కామమోహితమ్

ఆ మాటలు తన నోటి నుంచి వచ్చిన వెంటనే వాల్మీకి తనకు తానే ఆశ్చర్యపోయి “కిమిదం వ్యాహృతం మయా” (ఏమిటి నేనన్నాను?)2 అని చూసుకుంటాడు. ఆ తరువాత ఒక మంచి సాహిత్యవిమర్శకుడి లాగా తన వాక్యాలను తానే చర్చిస్తాడు. అందులో నాలుగు సమానమైన పంక్తులున్నాయి. ప్రతి పంక్తి లోను ఉన్న అక్షరాలు సమానంగా వున్నాయి. తీగలున్న యంత్రం మీద ఇది పాడడానికి వీలుగా వుంది — అని వివరించాక, ఇది శోకం లోంచి పుట్టింది కాబట్టి దీన్ని శ్లోకం అనడమే న్యాయం అని దీనికొక పేరు పెడతాడు.

ఆయన ఈ శ్లోకాన్ని చెప్పిన వెంటనే, పక్కనే వున్న భరద్వాజుడు దాన్ని అప్పటికప్పుడు కంఠస్థం చేసి రాగ, తాళబద్ధంగా పాడతాడు. రచన, విమర్శ, పఠన — ఈ మూడూ కలిసి దీనిని కావ్యం చేస్తాయి. ఇది మొదటి కావ్యం. ఈ కావ్యాన్ని చెప్పాడు కాబట్టి వాల్మీకి మొదటి కవి. ఈ కథ మీలో చాలా మందికి తెలుసు.
అయితే, వాల్మీకిని గురించిన కథ ఇది ఒకటే కాదు. ఇంకో కథ కూడా వుంది. ఆ కథ సంస్కృత సాహిత్య విమర్శరంగం లోకి ఎక్కలేదు. కానీ ఆనోట ఈనోట వచ్చిన ఈ కథ స్కాందపురాణంలో, ధర్మఖండంలో3 వుంది. తెలుగులో వాల్మీకి చరిత్ర4 రాసిన రఘునాథ నాయకుడు (రాజ్యకాలం 1600-1631) కూడా చెప్పాడు. కానీ అంతకన్నా ప్రచారంగా ఈ కథ నోటి మాటగా చాలా కాలంగా ఉంది. ఆ కథ ఇది.

వాల్మీకి మొదటిలో బందిపోటు దొంగ. దారులు కాసి వచ్చేవాళ్ళని, పోయేవాళ్ళని బెదిరించి, అవసరమైతే చంపి వాళ్ళ డబ్బు దోచుకునేవాడు. ఒక రోజున కొంతమంది బ్రాహ్మలు, కాశీకి వెళ్ళేవాళ్ళు, అతనికి కనిపించారు. అతను వాళ్ళని ఆపి, “మీ డబ్బంతా ఇవ్వండి, లేకపోతే చంపేస్తాను” అన్నాడు. వాళ్ళు అతన్ని నెమ్మదిగా మాటల్లోకి దింపి, “ఒక సంగతి చెప్పు. ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు?” అని అడిగారు. “నాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు. వాళ్ళని పోషించడం కోసం నేను చేసే వృత్తి ఇది,” అని చెప్పాడు అతను. “బాగుంది, నువ్వు ఈ పని చేయడంలో చాలా పాపాన్ని మూట కట్టుకుంటున్నావు. నువ్వు సంపాందించే డబ్బులో పాలు పంచుకునే నీ పెళ్ళాం పిల్లలు నీ పాపంలో కూడా పాలు పంచుకుంటారా?” అని అడిగారు ఆ బ్రాహ్మలు. ఈ ప్రశ్నకు సమాధానం తోచక ఆ దారిదొంగ నాకు తెలియదన్నాడు. “నువ్వు ఇంటికెళ్ళి కనుక్కురా. మేమిక్కడే వుంటాం,” అన్నారు వాళ్ళు. ఆ దారిదొంగ ఇంటికెళ్ళి పెళ్ళాం పిల్లల్ని అడిగాడు. “నేను మిమ్మల్ని పోషించడానికి దారులు కాసి మనుషుల్ని చంపి డబ్బు సంపాదిస్తున్నాను. అందువల్ల నాకు చాలా పాపం వొస్తోందని కొందరు బ్రాహ్మలు చెప్పారు. నా డబ్బులో పాలు పంచుకుంటున్న మీరు నా పాపంలో కూడా పాలు పంచుకుంటారా?”

వాళ్ళు దానికి సమాధానంగా, “నువ్వు మాకోసం డబ్బు సంపాదించడంలో ఏ పాపపుణ్యాలు మూట కట్టుకుంటున్నావో అది నీ పని. అందులో మాకేమీ వాటా లేదు. నీ పాపం నీదే, అది నువ్వే అనుభవించాలి,” అని అన్నారు. దిక్కు తోచని ఆ దొంగ తిన్నగా ఆ బ్రాహ్మల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి తను చేసిన పాపం నుంచి విముక్తుడవడానికి మార్గమేమిటని అడిగాడు. వాళ్ళు అతన్ని దయ తలిచి రామమంత్రం అతనికి ఉపదేశించ దలుచుకుని అయినా తామసుడు, శుద్ధమూర్ఖుడు అయిన అతనికి ఆ మంత్రాన్ని యథామార్గంలో ‘రామ’ అని చెప్పకుండా తిరగేసి ‘మరా’ అని చెప్పి ఆ మంత్రాన్ని ఒకచోట కూర్చుని నిష్టతో జపించమన్నారు. ఆ మూర్ఖుడు బండగా మఠం వేసుకుని ఒకచోట కదలకుండా కూర్చుని మరామరామరా5 అని జపిస్తూ వుంటే అది రామరామరామ అయ్యింది. అలా కూర్చున్న ఆ దొంగ మీద చెదలు పుట్టలు పెట్టాయి. అయినా అతను అలా జపిస్తూనే కూర్చున్నాడు. కొన్నాళ్ళకి రాముడు ప్రత్యక్షమై అతనికి మోక్షమిచ్చాడు. సంస్కృతంలో పుట్ట అంటే వల్మీకం. వల్మీకం లోంచి పుట్టాడు కాబట్టి ఆయన వాల్మీకి అయ్యాడు.

భారతదేశానికి ఇంగ్లీషువాళ్ళతో సంబంధం వచ్చిన తరువాత ఇలాంటి కథలు - తలాతోకా లేనివి, ఎప్పుడు ఎలా పుట్టాయో తెలియనివి - విజ్ఞానుల్ని చిరాకు పెట్టేవి. ఈ కొత్తవిజ్ఞానులు ఇలాంటివన్నీ కట్టుకథలనీ, చరిత్ర లేని జాతికి ఇలాంటి కథలే వుంటాయని వేళాకోళం చేయడం మొదలుపెట్టారు. ఇది ఇలా వుండగా భారతీయ విజ్ఞానులలోనే అలంకార శాస్త్రపండితులు కూడా ఈ కథల్ని పనిగట్టుకుని నిరాకరించక పోయినా కావాలని ఆదరించలేదు. అటు ఆలంకారికుల చేత, ఇటు ఆంగ్లేయుల చేత నిరాదరణకు గురయిన ఈ కథలు కొత్త చదువులు ముదురుతున్న కొద్దీ పాతపడి ఎవరికీ జ్ఞాపకం కూడా లేకుండా పోతున్నాయి. ఈ కథల్లో ఒక కాలానికి చెందనివాళ్ళు అని సాహిత్య చరిత్రకారులు నిర్ణయించిన కవులు కలిసి మాట్లాడుకుంటారు. అసలు ఏ కాలం లోనూ వున్నారని చెప్పడానికి వీలు లేని కవులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తారు. పైగా, వాళ్ళకు లోకాతీత శక్తులుంటాయి. ఒక్క మాటతో వాళ్ళు మహారాజుల్ని బిచ్చగాళ్ళుగా మార్చగలరు, బిచ్చగాళ్ళని మహారాజుల్ని చేయగలరు. అవసరమైతే దేవుణ్ణే ఎదురించగలరు. ఈ కథల్ని ఎలా అన్వయించాలో తెలియక తికమక పడ్డారు సాహిత్య చరిత్రకారులు.

వలసపాలన ద్వారా వచ్చిన పాశ్చాత్య విద్యల్లో ఒకటి సాహిత్య చరిత్ర6. ఏ కవి ఏ పుస్తకం ఏ కాలంలో రాశాడు అనేది నిర్ణయించడం ఈ సాహిత్య చరిత్రకి మొదటి అవసరం. ఈ కొత్త చరిత్రకారులు కొత్త ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. కాళిదాసు ఎప్పటివాడు? ఎంతకాలం బ్రతికాడు? ఈ వాల్మీకి, వ్యాసుడు నిజంగా రామాయణం, భారతం రాశారా? ఒక్క వ్యాసుడు అన్న వ్యక్తి అంటూ వుంటే వేదాల్ని విభజించి, మహాభారతాన్ని రాసి, పురాణాలన్నింటికీ కర్త అయి, ఆ తరవాత ఇంకా తోచక భాగవత పురాణాన్ని కూడా రాశాడంటారు కదా, అతను ఎంత కాలం బ్రతికి ఉండాలి? అది అలా వుంచి మీ కవులు ఒక్క పద్యంతో రాజుల్ని రాజ్యభ్రష్టులుగా ఎలా చేయగలిగారు? ఇలాంటి ప్రశ్నలు అడగటంతో సాంప్రదాయిక భారతీయ పండితులు ఒక పక్క తమ సంప్రదాయాన్ని రక్షించుకునే పని లోను, రెండో పక్క ఆ కొత్త చరిత్ర పద్ధతుల్ని నేర్చుకునే పని లోను పడి సాహిత్య చరిత్రకారులుగా పునర్జన్మ యెత్తారు. పాత శాసనాలని పరిశీలించడం, అవి ఆధారంగా రాజవంశాల కాలక్రమాల్ని నిర్ణయించడం, గ్రంథం లోనే వున్న అంతర్గత సాక్ష్యాల ఆధారంగా శైలీభేదాలని పట్టి కావ్యకర్తృత్వాలని నిర్ణయించడం — ఇలాంటి పని పందొమ్మిది-ఇరవై శతాబ్దాల సాహిత్య చరిత్ర కారులు చాలా మంది చేశారు. ఈ పద్ధతిలో నిర్మించిన తెలుగు సాహిత్య చరిత్రలో ఎన్ని విలువైన విషయాలు తెలిశాయో, అందుకోసం ఎంతమంది ఎంత పరిశ్రమ చేశారో తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ఈ పనిలో వాళ్ళకు తారసపడిన ఈ కథలు కాదనలేక తమ సాహిత్య చరిత్రలో చొప్పించిన వాళ్ళు కొందరు, నిర్దాక్షిణ్యంగా నిరాకరించిన వాళ్ళు కొందరు.

ఈ కథల్ని దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పరిశీలించి సాహిత్య చరిత్ర నిర్మాణానికి అతి నిశితమైన, పరమ ప్రామాణికమైన పదార్థానికి ఈ కథలు ఆధారమని చెప్పడం నా ఉద్దేశం. ఇవి నిజమైన సాహిత్య చరిత్రకి మూలభూతమైన దినుసులు అనీ, కవి అంటే ఎవరు, గ్రంథం అంటే ఏమిటి, పాఠకులు అంటే ఎవరు, ఈ మూడు పదార్థాలకి (అంటే, ఈ పదాల అర్థాలకి) వున్న సంబంధాలు ఎటువంటివి, ఈ పదార్థాలు, ఏ పరిస్థితుల్లో ఎలా మారాయి, ఆ మార్పులు చెప్పడమే సాహిత్య చరిత్ర చేయవలసిన పని అని నా ఉద్దేశం. అంతే కాని కాలక్రమంలో ఏ పుస్తకం ముందు వచ్చిందో, ఏ పుస్తకం తరువాత వచ్చిందో చెప్పుకుంటూ కూర్చోవడం సాహిత్య చరిత్ర కాదు. అలాంటి చరిత్ర మనకి లేకపోయినందుకు మనం విచారించక్కర్లేదు అని నా అభిప్రాయం.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!