దేముడున్నాడా? లేడా? ...

Courtesy ....D.V.Dinavahi Vekata Hanumantharao
దేముడున్నాడా? లేడా? ...
ఏ నాటినుంచో ఉన్న గొప్ప సందేహం.. నిజం చెప్పాలంటే
దేముడు కన్నా ముందే ఈ సందిగ్ధం పుట్టి, దేమునితో పాటు ఎదుగుతోందేమో.
"....సత్వరుడై యెందును లేడు లేడని..." రాక్షస రాజు హిరణ్యకశిపుడు చాలా స్పష్టంగా లేడు పొమ్మన్నాడు..
"కలండు కలండనువాడు కలడో లేడో" అని పురాణకాలంలోనే గజ రాజు మనలాగానే కొంచెం డౌటు పడ్డాడు...
"హరి సర్వాకృతులం గలం డనుచు.." భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు స్పష్టంగా చెప్పాడు...
అప్పటినుంచి ఇప్పటిదాకా లేడు అనేవారు కొందరైతే,
ఉన్నాడు అనేవారు మరికొందరు..
ఏదో లేడంటున్నారు గాని ఉన్నాడేమో; అనుకునేవారూ
ఆఁ.. ఉన్నాడంటారు గాని లేడేమో అని సందేహపడేవారూ ..
మన భాషలోచెప్పాలంటే... "గజ" సందేహులు కూడా బాగానే ఉన్నారు.
ఈ చివరి కేటగిరీ లోకి మనలో చాలామంది వచ్చేస్తాము కూడా..
ఎవరికి తగ్గ ఆర్గ్యుమెంట్స్ వాళ్లకి ఉన్నాయి..ఉంటాయి కూడా...
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో చూస్తూ ఉంటాము..
నియమ బద్ధంగా సూర్యోదయం.. అస్తమయం... పక్షాలననుసరించి చంద్రుడు పెరగడం .. తరగడం... పున్నమినాడు పూర్ణ కళలతో శోభించడం..
పున్నమి, అమావస్యలనాడు సముద్రం ఆటుపోటులు... మామిడి పూత తో కోకిలలు కుహు కుహు రావాలు చేయడం..
ఇవన్నీ ఇంత క్రమబద్ధంగా ఎలా జరుగుతున్నాయి.. ఎవరిదీ యాజమాన్యం...
ఇందులో గొప్పేముంది...నాచురల్ అంటారు కొందరు.
తెలియదుకాని ఏదో అతీత శక్తి అంటారు మరికొందరు..
ఆ అతీత శక్తికి "భగవంతుడు" అని పేరెట్టి కొలుస్తామంటారు కొందరు.
మా చిన్నతనంలో మాకు రేడియో ఒక వింత.. క్రొత్తగా మా ఇంటిలో పెట్టారు.. పెద్ద బ్యాటరీ మీద పనిజేసేది..
అలాగే టి.వి. మన ఊళ్లలో లేనప్పుడు, మద్రాసులో షాపు ముందు నించుని నోరెళ్లబెట్టుకుని చూడ్డం గుర్తుంది...
సైకిల్ రిక్షా మా ఊళ్లో తిరగడం మొదలెట్టడం నాకు తెలుసు.. ఎక్కితే అదో విచిత్రం...
మోటర్ సైకిల్ రిక్షా (ఆటో కాదండోయ్) మరో వింత..
మా మనవడికి చెప్తే నాన్ సెన్స్ తాతయ్యా.. నువ్వు మరీ ఎలిమెంటరీ అని కొట్టిపాడేస్తాడు..
తన అనుభవంతో స్టీమ్ కు శక్తి ఉంది అని జేమ్స్ వాట్ కనిపెట్టక ముందే స్టీమ్ కు శక్తి ఉంది.
శక్తి ఉండడం దాని ధర్మం..
ఒక లోహం తేలికగా ఉండడం దాని ధర్మం..
ఆ లోహం ఉపయోగించడంవలన విమానం ఎగురుతోంది...
నీకు ఆ ఆలోచన స్పురించిందంతే కాని అది లేనిది కాదు కదా ?
రేడియో, విమానం మరోటీ, మరోటీ మనం ఆవిష్కరించిన వింతలు ... ఇప్పుడు పాతబడిన వింతలు...
నిజానికి ఇవన్నీ కనిపెట్టినది మీరూ నేనూ కాదు,, మనలో ఒకరు..
అదిప్పుడు వింతగా చెప్తే నాన్ సెన్స్ అని మనం అంటాము.. అదీ మన విజ్ఞత..
"రేడియో తరంగాలు ఆకాశంలో వేలాది మైళ్లు ఎలా పయనిస్తాయి అని అలా కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు మార్కోనీని అడిగితే...ఈ తరంగాలు ఎలా పయనిస్తాయో శాస్త్రీయంగా చెప్పగలను .. కాని ఎందుకు అలా పయనిస్తాయి అంటే ఆ రహస్యం సృష్టించిన వానికే తెలియాలి... " అన్నాడట ..
అందుకని ఒక నిజం ఒప్పుకోవాలి.. ఎంతో తెలిసినవాడు.. తెలియనిది ఎంతో ఉంది అనుకుంటాడు..
కూసింత తెలిసిందనుకునేవాడు తనకు తెలియనిదేమీ లేదు అనుకుంటాడు..
మనం సృష్టించుకున్నవేవీ కొన్నాళ్ల తర్వాత వింతగా కనపడవు.. నిజమే కదా..
కాని రోజూ సూర్యోదయం చూస్తాము.. ఎప్పుడూ విసుగురాదు...చూస్తుంటే ఆకాశంలో ఎన్ని రంగులు.. ఎన్ని షేడ్స్.
శరత్కాలంలో నిండు పున్నమి చంద్రుడు.. ఆ నిర్మలమైన ఆకాశంలో అలా వెలిగిపోతుంటే.. ఎంత బాగుంటుంది..
"ఆఁ అదో గ్రహం అమెరికావాడు కాలు కూడా పెట్టాడు.." అన్నమాట ఆ ఆనందానుభవంలో గుర్తొస్తుందా ?
వర్షం పడగానే ఆరుద్ర పురుగులు పుట్టుకొస్తాయి.. వీపుమీద ఎర్రటి ముఖమల్ చర్మంతో.ఆ నేతగాడెవడు ?
చీకటి రాత్రులలో కాంతివంతం చేయడానికి ఎగిరే మిణుగురు పురుగులు కంటికెంత వెలుగు..?
వర్షపురాత్రుళ్లలో రోజుకో రకం పురుగులు అలా పుట్టి వెంటనే నశించిపోతాయి.. వేటికవే ప్రత్యేకం.. అవి ఎక్కడనుంచి వస్తాయి.. ఆ కాసేపటిలో ఎలా పుడ్తాయి..ఎవరు చెప్పగలరు..?
రోతపుట్టించే గొంగళీ పురుగునుంచి బయటికి వచ్చే అందమైన, కోమలమైన రంగురంగుల సీతా కోక చిలుకలు... ఒక సీతా కోక చిలుకకు మరోదానికీ పోలికే ఉండదు.. ఎవరు తయారుచేస్తున్నారు..
ఇలా చెప్పుకుంటూ పోతే..... అంతెక్కడ ?
ఒక్కసారి మనల్ని మనం చూసుకుందాం... లోపల ఎన్ని అరాంజ్ మెంట్స్ ? ఎముకలు, మజ్జ, మాంసం, రక్తం..
కాళ్లు మడతపడడానికి, చేతులు మడతపడడానికి .. మడత బందుల్లా పెట్టాడు.. గుండ్రంగా తిరగడానికి బంతి గిన్నె కీలు... వేళ్లు ఎక్కడికక్కడ ముడవబడడానికి...ఏర్పాటు.. అవి పని చేయడానికి కావలసిన కాల్షియమ్. కుషన్
అఫెక్ట్ కు మాంసం.. ఇంకా ఏవేవో ధాతువులు.. రక్తం అందీయడానికి నరాలు.. మంచి రక్తానికి చెడ్డరక్తానికి సిరలు ధమనులు.. గుండెకు రక్త ప్రసరణకు అనుకూలంగా లోపలికి ముడుచుకునే తలుపులు, బయటికి తెరచుకునే తలుపులు.. తిన్నది అరగడానికి కావలసిన ఎంజిమ్స్.. రక్తం గడ్డ కుండా ఏర్పాటు.. చూడ్డానికి కన్ను, వినడానికి చెవి... మీరు చెప్పినా చెప్పకపోయినా మీ ప్రమేయం లేకుండా కొట్టుకునే గుండె.. ఆలోచిస్తే ఎంత వింత...? ఎప్పుడు దంతాలుండాలో, ఎప్పుడు పాల దంతాలు పోయి మంచి దంతాలు రావాలో...ఎప్పుడు అవి ఊడాలో అన్నీ చక్కగా ఏర్పాటు చేసాడు.. రక్తం బయటికి పడకుండా, ఎముకలు కనపడకుండా చర్మంతో దీనికో ప్యాకింగ్...చర్మానికి ఆ అతుకు ఎక్కడ వేసాడో ఎలా వేసాడో ... ఏమన్నా తెలుసా...
మన ఈ ఎదిగిన దేహానికి ఆరంభం ఎక్కడంటే.. తల్లిగర్భంలోకి ప్రవేశించిన ఒకే ఒక చుక్క..కదా... ఆ చుక్క తనంత తాను ఎదుగుతూ... ఎప్పుడు ఏంకావాలో సమకూర్చుకుంటూ... దాని పని అది చేసుకుంటు మనం నడిచేటట్టుగా చేస్తోందంటే ఎంత ఆశ్చర్యం...ఆ పరంధాముడు అలా చేయించే రిమోట్ తన దగ్గర పెట్టుకున్నాడు.. తెల్లారి లేస్తే సుగంధాలీనే సబ్బులతోటీ షాంపూలతోటీ స్నానాలు చేస్తాము.. అరంగుళం దళసరిని పౌడర్లు మెత్తుకుంటాం.. వళ్లంతా సెంటులు పూసుకుంటాం.. అలా షోకులు చేసుకునే ఆ చర్మం క్రిందేముందండీ.. ముఖం భాగంలో కళ్లకు రెండు కన్నాలు.. అటూ ఇటూ చెవులస్థలంలో రెండు కన్నాలు.. ముక్కుకి, నోటికి కన్నాలు.. మిగతా ఎముకల పంజరం.. లోతుల్లోకి వెళ్తే కనిపించే పాంచభౌతిక శరీరము... కనిపించని ఎముకలగూడు... చీమూ, నెత్తురూ.. కాని ఇవి ఏమీ తెలియనీయకుండా అందమైన చర్మంతో చక్కగా ప్యాక్ చేసి జన్మదిన కానుకగా మీకందించాడు.. అందుకున్నాము ... మామూలు గిఫ్ట్ ఇస్తేనే ఓఁ వందనాలు చేసేస్తాము కదా, ఇలాంటి అపురూప కానుక అందించిన వానికి కృతజ్ఞతలు చెప్పనక్కరలేదా మరి ? చెప్పాలి అంటే ఎక్కడకెళ్లాలి.. ఎక్కడకీ అక్కరలేదు...ఇదంతా చేస్తున్న ఒక అవ్యక్త స్వరూపం ఉంది అన్న ఎఱుకతో.......తెరచిచూసే ప్రయత్నం చేయకుండా ఆ గిఫ్ట్ ప్యాక్ ను కాపాడుకుంటూ ఈశ్వర విభూతితో ఉన్న ప్రాణికోటిని సేవిస్తే సరిపోతుంది..
ఎప్పటిదాకా అలా చెయ్యాలి అంటే ....... ఈ ప్యాక్ పంచభూతాలలో కలసి ఆయనను చేరేదాకా.....
ఆఁ ఇది నాచురల్, దీనికీ ఇంత సీనుందా అంటారా మీరనుకునే ఆ నేచర్ కే నమస్కరిద్దాము, అప్పుడైనా అలా మీరు చెప్పిన కృతజ్ఞత చేరవలసిన చోటికి చేరుతుంది.. నాచురల్ కదా..!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!