వ్యసనాలు వ్యక్తి అదుపులో ఉండాలి. !

-

వ్యసనాలు వ్యక్తి అదుపులో ఉండాలి !

.

వ్యసనాల అదుపులో వ్యక్తి ఉండకూడదు అని అంటారు. వ్యసనము అని ఒకదానికి పేరు పెట్టారు అంటే అది వ్యక్తిని కబళించి తనకు బానిస చేసుకునేది అని అర్థం. పూర్వం సప్త వ్యసనాలు చెప్పారు. అయితే వాటిలో ప్రధానమైన వర్గీరకణ ఉంది.

వీటిలో అత్యంత ప్రమాదకరమైనది సురాపానం. మిగిలినవి కూడా వ్యసనాలే అయినా అవి ఒక వ్యక్తి మాత్రమే కొనసాగించే వ్యసనాలు కాదు. 

ఉదాహరణకు పేకాట - ఇది ఒక్కడే చేయలేడు. అలాగే స్త్రీ లోలత, వేట, మాంసభక్షణం ఇలాంటి వ్యసనాలు ఒక్కడే చేయలేడు. కనుక సహజంగానే వీటిని అరికట్టటం చాలా తేలిక. 

కానీ మద్యసేవనం ఇలాంటిది కాదు. దీనికి ఇతరులతో పనిలేదు. ఏ వ్యక్తికి ఆవ్యక్తి ఆ వ్యసనాన్ని కొనసాగించగలడు. ఇదే ప్రమాదమైంది.

ఇక రెండో ప్రమాదం ఏమిటంటే మిగిలిన వ్యసనాల నుంచీ బయటపడడానికి ఉన్నన్ని అవకాశాలు సురాపానాది మాదకద్రవ్యాల సేవనాల్లో ఉండదు. అంటే జర్దా వంటి పొగాకు ఉత్పత్తులు, మద్యం, నల్లమందు, మాదకద్రవ్యాలు వంటివి అన్నమాట. వీటికి బలి అయితే శరీరంలోని అతి ముఖ్యమైన నాడీ మండలం దెబ్బతింటుంది. దాంతో శరీరం మీద అదుపు కోల్పోతాడు. ఎప్పుడైతే శరీరం మాదకద్రవ్యాలకు వశమైందో దాని నుంచీ బయటకు రావడం దాదాపు అసాధ్యం. దీనితో పోలిస్తే మిగిలిన వ్యసనాలనుంచీ తేలిగ్గా బయటపడవచ్చు. కనుక అత్యంత ప్రమాదకరమైంది, వదిలించుకోవడం సాధ్యం కానిది మాదకద్రవ్యాల సేవనం.

ఇది గమనించ దగిన అంశం.

నేను సిగరెట్లు మానేశాక ఒక వ్యక్తి కలిశాడు. ‘‘నువ్వు సిగరెట్లు మానేశావు అని అన్నారు. నిజమేనా? సిగరెట్లు తాగడం మానేయడంలో మగతనంలేదు. తాగాలి మానేయాలి. అదే మగతనం‘‘ అన్నాడు.

ఇటువంటి వాళ్ళు అత్యంత ప్రమాదకారులు.

నాతో ఈ మాటలు అన్నవ్యక్తి బీడీలు తాగడం నుంచీ గుండెకు స్టంటు వేయించుకోవాల్సిన అవసరం వరకూ అన్నీ నాకు తెలుసు. అతను సేవించేవాడు. బీడీ, సిగరెట్, గుట్కా, ఖైనీ, జర్దా, ఇలా బ్రాండు మార్చి మార్చి నేటికీ సేవిస్తూనే ఉన్నాడు. వాళ్ళావిడ గరిట తిరగేస్తూనే ఉంది. అతను ఏదైతే మగతనం అనుకుంటున్నాడో అదే తన బలహీనత అని అతనికి తెలియదు. అతను అలవాటు చేసుకునే ప్రతీ కొత్త వ్యసనం కొద్ది కాలం తరువాత మానివేయడం తిరిగి మొదలు పెడతాను అని తనను తాను చేసుకుంటున్న మోసమే. అంటే మానేసిన వ్యవధి కూడా తిరిగి మొదలు పెట్టే బుజ్జగింపు వ్యవధి అన్నమాట. 

ఇది మానసిక వ్యభిచారం తో సమానం. ఇటువంటి వారి సలహాలు చాలా ప్రమాదకరమైంది. వీరు చెప్పేది ఎన్నటికీ విశ్వసించదగినది కాదు. నాడీ మండలాల మీద పనిచేసే మాదకద్రవ్యాలను నిర్దాక్షిణ్యంగా మానివేయాల్సిందే. వాటిని మన అదుపులో ఉంచుకుంటాను అని అనుకోవడం వెర్రితనం.

మత్తుపదార్థాలు ఒక్కసారికూడా ప్రయత్నించకుండా ఉండడమే ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రథమ రక్ష. ఇది గుర్తుంచుకోండి. అవి సేవించే వారు ఎంతటి ఆత్మీయులైనా అవి మానే వరకూ వారికి దూరంగా ఉంటామని నిర్మొహమాటంగా చెప్పండి. ముఖ్యంగా ఒకసారి దీని నుంచీ బయట పడిన వారు మరింత కఠినంగా ఆ వ్యసనపరులకు దూరంగా ఉండాలి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!