కృష్ణకుమారి (నటీమణి)

కృష్ణకుమారి (నటీమణి)

కృష్ణకుమారి పాత తరం తెలుగు సినిమా కథానాయిక. ఈమె పశ్చిమ బెంగాల్ లో 1936 మార్చి 6న జన్మించారు. షావుకారు జానకి ఈమెకు పెద్దక్క. ఈమె సుమారు 110 పైగా తెలుగు సినిమాలలో నటించింది.కృష్ణకుమారి బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్‌ను పెండ్లాడింది.

ఈమె పశ్చిమ బెంగాల్ లోని నౌహతిలో జన్మించింది. నాన్నగారి ఉద్యోగరీత్యా తరచుగా బదిలీల మూలంగా ఈమె విద్యాభ్యాసం రాజమండ్రి, చెన్నై, అస్సాం, కలకత్తా మొదలైన ప్రదేశాలలో జరిగింది. మెట్రిక్ అస్సాంలో పూర్తయిన తర్వాత మద్రాసు చేరిన వీరి కుటుంబం అక్కడే సినీ అవకాశాలు రావడం జరిగింది. ఒకసారి ఆమె తల్లితో సహా స్వప్నసుందరి సినిమా చూడడానికి వెళితే అక్కడకి సౌందరరాజన్ గారి అమ్మాయి భూమాదేవి కూడా వచ్చింది. సినిమా హాల్లో కృష్ణకుమారిని చూసిన ఆమె నవ్వితే నవరత్నాలు సినిమా కొసం అమాయకంగా కనిపించే కథానాయిక కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. తర్వాత రోజే వారు కృష్ణకుమారి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆమెకు ఆ పాత్రనిచ్చారు. అలా తెలుగు సినిమా తెరకు 1951లో నిర్మించిన ‘నవ్వితే నవరత్నాలు’ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. తర్వాత 1953లో తాతినేని ప్రకాశరావు యన్.ఎ.టి.వారి పిచ్చి పుల్లయ్య లో కథానాయిక వేషం వేయించారు. అందులో మంచి నటన ప్రదర్శించిన కృష్ణకుమారికి పినిశెట్టిగారి పల్లె పడుచు బంగారు పాప వంటి మంచి చిత్రాలతో పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది.

తరువాత ఇలవేల్పు, జయ విజయ, అభిమానం, దేవాంతకుడు మొదలైన చిత్రాలలో వివిధ కథానాయకుల సరసన నటించినా, తన నటనకు గుర్తింపుతెచ్చిన చిత్రాలు కె.ప్రత్యగాత్మగారి భార్యాభర్తలు (1961) మరియు కులగోత్రాలు (1962). భార్యాభర్తలులో అభిమానం గల టీచరు శారదగా ఆమె చూపిన నటన ముఖ్యంగా శోభనం గదిలో భర్త సమీపించినప్పుడు చూపిన అసహనం, ఆ తరువాత వేడుకలో పాల్గొని 'ఏమని పాడిదనో యీ వేళ' అన్న వీణ పాట పాడినప్పుడు చూపిన భావాలు శ్రీశ్రీ పాట భావానికి చక్కని రూపాన్నిచ్చాయి. క్లిష్టమైన పాత్రకు న్యాయం చేసి పరిశ్రమ చేత ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నారు. 1963లో లక్షాధికారి, బందిపోటు ఎదురీత కానిస్టేబుల్ కూతురు చిత్రాల్లో వైవిద్యం ఉన్న పాత్రలు వేశారు. ప్రభుత్వ బహుమతి పొందిన జగపతీ పిక్చర్స్ వారి అంతస్థులు లో నాయికగా నటించారు. 1967-68 మధ్యకాలంలో ఉమ్మడి కుటుంబం, భువనసుందరి కథ, రహస్యం, చిక్కడు దొరకడు, స్త్రీ జన్మ వంటి చిత్రాలలో వైవిద్యమున్న పాత్రలు పోషించారు. వరకట్నం లో నాయికగా గ్లామరస్ పాత్ర తర్వాత చిత్రాలు తగ్గి 1970 దశాబ్దంలో కొన్ని చిత్రాలలో నటించగలిగారు.

మొత్తంగా సుమారు రెండు దశాబ్దాల నటజీవితంలో ఈమె సుమారు 110 సినిమాలలో నటించింది. వీనిలో ఎక్కువగా తెలుగు సినిమాలైతే, 15 కన్నడ చిత్రాలు మరియు కొన్ని తమిళ భాషా చిత్రాలు. ఈమె ఆనాటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు కృష్ణంరాజు జగ్గయ్య , హరనాథ్, అందరు మహానటులతోను నటించి మెప్పించింది. ఈమెకు చిన్నప్పటినుండి భానుమతి అంటే భలే ఇష్టం. అందువలన ఆమెతో కలిసి కులగోత్రాలు, పుణ్యవతి సినిమాల్లో నటించినప్పుడు ఎంతో థ్రిల్ ఫీలయ్యారు. మహానటి సావిత్రి ఈమెను స్వంత చెల్లెల్లా చూసుకొనేది. ఈమెది ఒక రకంగా ప్రేమ వివాహము. ఈమె భర్త అజయ్ మోహన్ వ్యాపారవేత్త. అతని కుటుంబం వారు రాజస్థానీయులు. స్నేహితుల ద్వారా పరిచయమై అది 1969లో వివాహబంధంగా మారింది. వ్యాపారరీత్యా భర్త బెంగుళూరులో ఉండగా ఈమె కూడా మద్రాసు వీడి బెంగుళూరులో మకాం పెట్టారు. కొంతకాలం విరామం తర్వాత అత్తమామల ప్రొత్సాహంతో తిరిగి నటించడం మొదలుపెట్టింది.

వీరికి ఒక అమ్మాయి - దీపిక. వీరి అల్లుడు విక్రం మైయా మరియు మనవడు పవన్.

ఈమెకు మూడుసార్లు జాతీయ అవార్డులు, రాష్ట్రస్థాయిలో నంది అవార్డులు వచ్చాయి. ఈమె కాంచనమాల, సావిత్రి, ఎన్టీయార్ అవార్డులు గెలుచుకున్నది. బ్రిటన్ లోని బర్మింగ్ హాం సంస్థ వారి “లైఫ్ టైం అచీవ్ మెంట్ “అవార్డు పోందినది.

బెంగుళూరులో వీరికి ఐదెకరాల ఎస్టేటు ఉన్నది. ప్రశాంత వాతావరణం, చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలోని అందమైన ఇంట్లో ఈమె జీవితాన్ని సుఖంగా గడుపుతున్నది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!