పోతనగారి ....పద్య రత్నాలు....

పోతనగారి ....పద్య రత్నాలు....

1. అమ్మల గన్నయమ్మ

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె

ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా

యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.

2. అమ్మా మన్నుదినంగ

అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో? 

నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; నన్నీవుగొట్టంగ వీ

రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం

ధమ్మాఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే.

3. అలవైకుంఠపురంబులో

అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబు దా

పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో

త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి

హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై.

4. ఇంతింతై

ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై

నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై

నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై

నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

ప్రాస - అంత

5. ఇందుగలడందు

ఇందు గలఁ డందు లేఁ డని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెం దెందు వెదకి చూచిన

నందందే కలఁడు దానవాగ్రణి! వింటే.

ప్రాస - అంద

6. ఎవ్వనిచే జనించు

ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై; 

యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం

బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైనవాఁ

డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

7. పలికెడిది

పలికెడిది భాగవత మఁట, 

పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ

బలికిన భవహర మగునఁట, 

పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?

మందార మకరంద

8. మందారమకరందమాధుర్యమునఁ దేలు;

          మధుపంబు బోవునే మదనములకు? 

నిర్మల మందాకినీవీచికలఁ దూఁగు;

          రాయంచ జనునె తరంగిణులకు? 

లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు;

          కోయిల చేరునే కుటజములకుఁ? 

బూర్ణేందుచంద్రికా స్ఫురితచకోరక;

          మరుగునే సాంద్రనీహారములకు?

నంబుజోదర దివ్యపాదారవింద

చింతనామృతపానవిశేషమత్త

చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు? 

వినుతగుణశీల! మాటలు వేయునేల?

9. మ్రింగెడి వాడు

మ్రింగెడి వాఁడు విభుం డని 

మ్రింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్

మ్రింగు మనె సర్వమంగళ

మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో?

(ప్రాస - అంగ)

10. లావొక్కింతయులేదు

లావొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్; 

నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపంద గున్ దీనునిన్; 

రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

11. శ్రీకృష్ణా యదుభూషణా

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా! 

లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా

నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా! 

నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

12. సిరికింజెప్పడు

సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే

పరివారంబునుఁ జీరఁ' డభ్రగపతిం బన్నింపఁ' డాకర్ణికాం

తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో

పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.

 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!