'కృషీవలుడే ఈశ్వరుడు"!

'కృషీవలుడే ఈశ్వరుడు"!

.

కృషీవలుడనగానే మనకు ప్రధానంగా దువ్వూరి రామిరెడ్డిగారి 'కృషీవలుడు' పద్యకావ్యం, ఏటుకూరి వెంకట నరసయ్యగారి క్షేత్రలక్ష్మి (పద్యకావ్యం), తుమ్మల సీతారామమూర్తిగారి పరిగపంట మున్నగు ఖండకావ్య సంపుటాలు గుర్తుకు వస్తాయి.

ఇంకా అనేకులు అనేక కవితా ప్రక్రియా రూపాల ద్వారా రైతుకు అక్షర పట్ట్భాషేకం చేశారు. దువ్వూరి రామిరెడ్డిగారు తమ 'కృషీవలుడు' పద్యకావ్యంలో ఒకచోట..

'సైరికా! నీవు భారతక్ష్మాతలాత్మ గౌరవ పవిత్రమూర్తివి- శూరమణివి, ధారుణీపతి పాలన దండమెపుడు నీహలంబు కన్నను ప్రార్థనీయమగునె?' అన్నారు.

అంటే రైతును భారతదేశాత్మ స్వరూడవు, గౌరవ పావనమూర్తివి - వీరమణివి - అని అన్నారు. అంతేకాదు నీ హలం కన్నా రాజు యొక్క పాలన దండం ఎప్పుడూ తక్కువే. 

నీ నాగలియే ప్రార్థింప యోగ్యమైనదని, రాజు కంటే రైతు గొప్పవాడని చాటిచెప్పారు.

కానీ- ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీగారు- దువ్వూరి రామిరెడ్డిగారి ప్రేరణతోనే ఒక్క అడుగు ముందుకు వేసి - కాకతీయ రాజుల చరిత్రలోని కొందరి జీవిత ప్రధాన ఘట్టాలనే ఇతివృత్తాలుగా తీసుకొని రచించిన 'కీర్తితోరణము' పద్యకావ్యంలో ఒక రాజు పరిపాలనలో 

రైతు ఈశ్వరుని వలే ప్రకాశిస్తున్నాడన్న భావం స్ఫురించేలా ఈ పద్యం రచించారు. 

.

'జలధారన్ దలదాల్చి తోలయిన వస్త్రంబున్ బచారించి, 

పా ముల సావాసముతో మెలంగి, 

యొడలన్ బూదెల్లనుంబ్రామి, యె ద్దుల త్రోవన్ జని,

చేతితో పలుగునన్ దోతెంచువాడై కృషీ వలుడే రుూశ్వరుడయ్య!"

పైగా రైతుకీ, శివునికీ అభేదాన్ని చెప్పారు. శివుని నెత్తిన గంగా జలధార ఉంది.

వర్షంలో తడిసే రైతు నెత్తిన ఎప్పుడూ జలధార ఉన్నట్లే. 

శివుడు పులితోలు లేదా గజచర్మం ధరిస్తాడు. రైతు ఎప్పుడూ తోళ్లయిన అంటే శ్రమ వల్ల బాగా నలిగిపోయిన (తోళ్లు గోదావరి మాండలికం) వస్త్రాలను ధరిస్తాడు.

శివుడు సర్పాలను ఆభరణాలుగా ధరిస్తాడు. రైతు ఎప్పుడూ పంట పొలాల్లో పాములతోనే సహవాసం చేస్తాడు. శివుడు ఒంటిపై బూడిద రాసుకుంటాడు.

రైతు-శ్రమించడం వల్ల అతని ఒళ్లు ఎప్పుడూ మట్టిగొట్టుకునే ఉంటుంది. 

శివుడు వృషభ వాహనుడు. రైతు ఎప్పుడూ ఎద్దుల త్రోవతోనే మడి దున్నుతాడు.

ఆ సందర్భంలో రైతు చేతిలోని పలుగు శివుని చేతిలో త్రిశూలం వంటిదే. శివుని త్రిశూలం లోకరక్షణ చేస్తున్నట్లే రైతు చేతిలోని పలుగు లోకానికి ఇంత అన్నం పెట్టి రక్షిస్తోంది.

కాబట్టి కృషీవలుడే ఈశ్వరుడని అంటున్నారు ఇంద్రగంటి వారు.

అయితే- పై పద్యంలో 'ఎద్దులత్రోవన్' అన్న బహువచన ప్రయోగం రైతుకి 

సరిపోతుంది. ఎద్దులను పొలాన్ని దున్నడానికి వాడతాడు కనుక. మరి శివునికి ఒక ఎద్దే గదా వాహనం. 'ల'కారం పద్యంలో ప్రాసకాబట్టి వాడారంటే సరిపోదు.

ఇక్కడ 'ఎద్దుల' అని బహువచనాన్ని వాడడం వల్ల శివుడు పశుపతి అని చెప్పినట్లయింది. ఇంతకూ కృషీవలుడే ఈశ్వరుడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!