కలయో ! వైష్ణవ మాయయో ?

కలయో ! వైష్ణవ మాయయో ?

.

కలయో ! వైష్ణవ మాయయో ! యితర సంకల్పార్థమో ! సత్యమో

తలపన్నేరక యున్నదాననో ! యశోదాదేవి గానో ! పర

స్థలమో ! బాలకుండెంత ! యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర

జ్వలమై యుండుట కేమి హేతువో ! మహాశ్చర్యంబు చింతింపగన్"

.

భాగవతంలో భగవంతుడు యశోదాదేవికి విశ్వరూపాన్ని చూపించిన ఘట్టం . 

పసిబాలుని నోటిలో సప్త సముద్రాలు , ఎత్తైన కొండలు , మహారణ్యాలు , సూర్య చంద్రులు , భూగోళం , సకల నక్షత్రాలు కనిపించాయి . బ్రహ్మాండాన్ని కనులతో చూచిన ఆ తల్లికి ఒక్కసారిగా మతిపోయింది . ” ఇది కలా ! నిజమా ! అసలు నేను యశోదా దేవినేనా . ఇది మా యిల్లేనా ? విష్ణుమాయా ? సత్యమేనా ? అసలు నా బుధ్ధి పనిజేస్తోందా ? 

చూడడానికి పసి బాలుడు . నోరు తెరిస్తే విశ్వం కనిపిస్తోంది . ఇంతకంటే వింత ఏదైనా ఉంటుందా ? . అలోచించిన కొలదీ ఆశ్చర్యం వేస్తున్నది . అని ఆమె మనసు పరి పరి విధాల ఆలోచించింది . నా భ్రమ తొలగడానికి అన్ని లోకాలకూ అధిపతి అయిన ఆ విష్ణుమూర్తినే శరణు కోరుతాను ” అని అనుకొని భగవంతుని శరణు కోరింది మాత . కోరిన మరుక్షణం మాయ కరిగి పోయింది . సర్వాత్ముడు పసిబాలుడుగా కనిపించాడు . క్షణకాలం కింద తను ఏమి చూసిందో మరిచిపోయింది .

మన నిజ జీవితంలో కూడా కనిపించే వింతలు తక్కువేమీ కాదు .

ఇది నిజమా ? కలా అనే సందేహం కలగడం సహజం . ఇక తెలియని విషయాలను గురించి అలోచిస్తే వాటికి అంతేలేదు . ఉదాహరణకు తలెత్తి పైకి చూడండి . అకాశం ఎక్కడ అంతమవుతుందో ఊహించగలరా ? అది అంతమయిన పిదప ఉండేదేమిటి . అంతులేని చీకటేనా ? ఏమీ లేని స్థితేనా ? అసలు ఏమీ లేకపోవడమంటే ఏమిటి ? నిజంగా ఇవి సమాధానం లేని ప్రశ్నలు . ఇటువంటి ప్రశ్నలు వందలు ?కావు వేలు , వేవేలు , లక్షలు ,అంతులేనన్ని . మన ఊహ కందవు . ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి . సమాధానాలు దొరకవు . ఎక్కువ ప్రయత్నం చేయక మునుపే భగవన్మాయా ప్రభావంలో పడి సత్యం తెలుసుకొకుండానే రోజువారీ జీవితంలో మునిగి పోతాము . విశ్వరూపం కనిపిస్తునే ఉంటుంది కానీ ఎందుకలా వుందో మనకు తెలియదు . ఇదే భగన్మాయ అని నా ఊహ .

Vinjamuri Venkata Apparao's photo.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!