చంద్రుని కోసం చకోరము !

చంద్రుని కోసం చకోరము !

.

దేనికోసమైనా,ఎవరి కోసమైనా ఎదురుచూస్తున్నారంటే 

చకోరపక్షి తో పోలుస్తారు.. 

ఆ చకోరము ఎప్పుడూ వెన్నెలకు ఎదురుచూస్తూ వుంటుందట..

వెన్నెలను మాత్రమే తిని జీవిస్తుందట. అందుకే దాన్ని 'వెన్నెలపులుగు', 

'వెన్నెల పిట్ట'అంటుంటారు. ఈ వూహాపక్షుల గురించి 

మన ప్రాచీన సాహిత్యము లో చాలా చోట్ల మన కవులు 

ప్రస్తావించారు,కుటుంబానికి ఓ చకోర కుటుంబానికి చెందిన వర్ణన.

.

వెన్నెల గుంజు నంజుకొని, వెన్నెల ప్రోవు భుజించి, నాలిక 

న్వెన్నెలల గుజ్జు జాలు గొని, వెన్నెల తేటల ద్రావి, వేడుకన్

వెన్నెల కొను జుఱ్ఱుకొని వీధులయందు జకోరదంపతుల్ 

మిన్నులుముట్టి, వెన్నెలలు మేపుచు బిల్లలుదాము నాడగన్!

.

(ధూర్జటి 'శ్రీకాళహస్తి మాహాత్మ్యము' లోనిదీ పద్యము)

.

మెత్తగా గుజ్జులాగా వున్న వెన్నెలను నంజుకొని,కాస్త గట్టిగా వున్న వెన్నెలను కొరుక్కుతిన్నాయి ఆ జంట చకోరాలు.

కొంచెము మెత్తటి వెన్నెలనేమో పచ్చడిలాగా 

నాలుకతో రుచి చూసి తృప్తి పడ్డాయి.పచ్చడికంటే పల్చగావున్న 

వెన్నెలను జుర్రుకున్నాయి. తేటగావున్న వెన్నెలను త్రాగాయి.

తృప్తిగా తాము తింటూ, తమ పిల్లలకు కూడా మేపుతూ. 

ఆకాశవీధిలో ఆడుకుంటున్నాయి.యిదీ భావం.

.

దీన్ని చదివేవాళ్ళు మనస్సులూ

ఆ చకోర కుటుంబము తో పాటు వెళ్ళిపోయి ఆ వెన్నెల రుచులను ఆస్వాదిస్తాయి.

వెన్నెల రోజుల తర్వాత పాపం ఆ చకోరాలన్నీ పస్తులుండాలి గదా! 

అనే విషయం చురుక్కుమని పిస్తుంది.

అల్పాక్షరాలతో అనల్పార్ధాన్ని సాధించడమంటే యిదే.అన్నట్టు 

ఈ పద్యం 'ఉత్పలమాల' అంటే కలువపువ్వులదండ మరి ఆ కలువలు వికసించేది వెన్నెల రాత్రులలోనే గదా! యిది ధూర్జటి చూపిన ఛందో ఔచిత్యం..

.

(సేకరణ :-యు.దుర్గాదేవి, తెలుగు వెలుగు మాసపత్రిక సౌజన్యముతో )

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!