సిరుల సంక్రాంతి.! .

సిరుల సంక్రాంతి.! .

రచన:శ్రీమతి ఆర్. దమయంతిగా......

.

సంక్రాంతి అంటే- ఎలాంటి నిర్వచనాలు తెలీని రోజులవి.

ఒకటే తెలుసు. సంబరం. ఏ పండగలోను ఇన్నేసి సరదాలు వుండవని సంబరం.

ఇల్లిల్లూ పచ్చని తోరణమై, వీధులన్ని జన సందోహమై, హృదయాలన్ని ఒక చోట చేరి సంతోషాల్ని కలబోసుకునే ఒకే ఒక్క ఉత్సవం. ఒకే ఒక్క పండగ వైభవం.

సంక్రాంతి అంటే-

సందళ్ళ పుట్ట.

సరదాల గుట్ట.

జ్ఞాపకాల తుట్టె.

పుష్యం చలి పక్కదుప్పటి తీయనీదు. నిద్ర బద్ధకం కళ్ళు తెరవనీదు. బడికెళ్ళాలి కానీ లేవబుధ్ధి కాదు. అలాంటి లేత బాల్యం, ఎలా లేచి కూర్చునేదో తెల్లారుఝామునే! 

.“అమ్ములూ.. గొబ్బెమ్మలూ” అమ్మ పిలిచేది. పెరట్లోకి దూకి చూస్తే మంచుకి తడిసి మందారలు మొగ్గలయ్యేవి. రెక్కలు ముడుచుకు బజ్జున్న గులాబీలు, పసుపైన ముళ్ళగోరింటలు, వంగరంగు డిసెంబరాలు. ఉహు! ఇవి కాదుగా నాక్కావల్సినవి. చారడంత చామంతులు, అరచేయంత గుమ్మడి పూలు. పక్క మొగ్గలు తుణగకుండా, చిగురుటాకులు తుంచకుండా కోయాలని అమ్మ చెప్పేది. బంతి మడి దగ్గర ఆగిన అడుగులు కదిలేవా ఒక పట్టాన!? కళ్ళు తిప్పుకోనీయని రంగులుండేవి. ఎన్ని రంగులనీ…

గడపచ్చని ముద్ద బంతి,

కనకాంబరపు రెక్క బంతి

కాషాయంలొ పెద్ద బంతి

నిమ్మ పండులా మెరుస్తూ మరో బంతి

బొడిపె బంతి కారం బంతి కాగడా బంతి

.

సంక్రాంతి మూడు రోజుల పండగ కాదు. ఒక మాసం పాటు హడావిడి చేసే పండగ. డిసెంబర్ నుంచే సన్నాహాలు మొదలైపోయేవి. గోడలకి సున్నాలు తలుపులకి రంగులు గడపలకు లక్కలు నల్ల నాప రాళ్ళ మీద వార్నిష్ ముగ్గులు అటక మీద వంట సామన్లు దింపడాలు కొత్త దుస్తుల ఎంపికలు రోజూ దేవునికి ప్రసాదాలు తులసి కోటకి పూజలు మధ్యాన్నాలు పెద్ద పెద్ద పిండి వంటలు ఇంటి ఆడపడచులకు వుత్తరాలు వారానికి ముందే ఇంటికొచ్చిన చుట్టాలు మేనత్త పరిహాసాలు బాబాయి చేదోడు వాదోడు పనులు…

సాయం కాలాలు సందె గొబ్బెమ్మలుంచి ఆటలు పాటలు.

‘పువ్వు పువ్వు పూసిందంట, ఏమి పువ్వు పూసిందంట?

రాజ వారి తోటలో మల్లె పూవు పూసిందంట’

‘గొబ్బీయల్లో గొబ్బీయల్లో

సుబ్బి గొబ్బెమ్మ సిరులనీయవె

చేమంతి పూవంటి చెల్లెలి నీయవే

తామర పూవంటి తమ్ముణ్నీయవే

మొగలి పూవంటి మొగుణ్నీయవే’

ఇప్పటికీ గుర్తున్న ఎన్ని పాటలో. ఎంత కళ అయిన పండగని! పెళ్ళిలా ఉండేది.

గంగిరెద్దులాటలు, వాడు వాయించే సన్నాయిలు, బుడబుక్కలోడి వొంటి మీద మచ్చలు, అర్థం కాని హరిదాసు కీర్తనలు, చేతిలో చిడతల చప్పుళ్ళూ – అన్నీ ప్రపంచపు వింతలే. పండగ ప్రతి సవ్వడి ఒక కొత్త స్వరంలా వినిపించేది. భోగిపళ్ళ పేరంటాలు, గలగల రాలి పడుతూ రాగి నాణేలు, బొమ్మలకొలువులు, పన్నీటి సువాసనలు, వెలుగుతూ దీపాలు, పుణ్యస్త్రీలు పట్టే హారతులు, గుళ్ళో గోదాదేవి కల్యాణాలు, ఇంట్లోకి వినిపిస్తూ మేళతాళాలు, వూరంతా శుభకార్యం జరుగుతున్నట్టు, ఇల్లొక పెళ్ళి వారి విడిదైనట్టుండేది.

Comments


  1. బొమ్మలకొలువులు, పన్నీటి సువాసనలు, పుణ్యస్త్రీలు పట్టే హారతులు, గుళ్ళో గోదాదేవి కల్యాణాలు, ఇంట్లోకి వినిపిస్తూ మేళతాళాలు,

    ఏ తావుకి పోయాయో ఇవన్నీ !

    ప్రస్తుతానికి టీ వీ బాక్సు డమ డమాలే మిగిలే ఇంట్లో ఈనాటి సంక్రాంతి కి !

    జిలేబి

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!