అహం బ్రహ్మాస్మి’!

అహం బ్రహ్మాస్మి’!

ఈ వేదాంత మహావాక్యంలోని బ్రహ్మ, పరబ్రహ్మ. 

శివుడికున్న మూడోనేత్రం(జ్ఞాననేత్రం) తనకూ వుంది కాబట్టి మానవుడు తాను పరబ్రహ్మ స్వరూపుణ్నని గుర్తించగలడు. . 

శివుడు ఆత్మ స్వరూపుడు . అందువల్ల శివుడి లక్షణాలనే ఆత్మ లక్షణాలుగా గుర్తించవచ్చు.

శివుడికి లింగభేదం లేదు. తనలో అటువంటి భేదాన్ని సృష్టించబోయిన మన్మధుడిని దహించాడు. కాముడిని జయించాడు.

శివుడికి స్వపరబేధం లేదు. ఆయన అందర్నీ ఒక్కలాగే చూస్తాడు .రాక్షసులైనా వారు చేసిన తపస్సు ఫలిస్తే, కోరింది ఇస్తాడు .

శివుడు అమృతాన్ని విషాన్ని వేరుగా చూడడు . సత్ప్రయోజనం కోసం అవసరమైతే విషం పుచ్చుకుంటాడు.

ఈశ్వరుడు సంసారాన్ని, సన్యాసాన్ని విడగొట్టడు.

సన్యాసిగా మన్మధుడిని కాల్చి బూడిద చేసినవాడే ,పార్వతిని వివాహమాడి సంసారి అయ్యాడు. మన్మధుడిని మళ్ళీ బ్రతికించాడు. 

ఈ భిన్న తత్వాల వెనక ఉన్న ఏకత్వమే అర్థనారీశ్వర తత్వం . 

ఈ తత్వాన్నే సిరివెన్నల సీతారామ శాస్త్రి గారు, ‘సంసార సాగరం నాదే ,సన్యాసం శూన్యం నావేలే’ అని తన ‘జగమంత కుటుంబం’పాటలో వ్యక్తం చేసారు

శివుడు జననాన్ని,మరణాన్ని వేరుగా చూడడు . కాబట్టే ఆయనకు జననం లేదు. స్వయంభువు . మరణం లేదు. మృత్యుంజయుడు .

శివుడికి నామరూపాలకు అతీతుడు . 

అందుకే ఆయన లింగరూపంలో వున్నాడు .

శివుడికి మూడోకన్ను(జ్ఞాననేత్రం) ఉంది.అందువల్ల ఆయనకు తన్ను గూర్చిన జ్ఞానం(ఆత్మజ్ఞానం) ఉంది .

శివపార్వతుల వివాహ ఘట్టాన్ని పరిశీలిస్తే, మన్మధుడు,పార్వతి కలిసి శివుడికి తపోభంగం కలిగించి,శివుడి ఆగ్రహానికి గురై ,మన్మధుడు ప్రాణాల్ని ,పార్వతి శివుడి విశ్వాసాన్ని కోల్పోయారు.శివుడే ఆత్మ కాబట్టి శివుడి విశ్వాసాన్ని కోల్పోవడమంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడమే. పైన చెప్పిన ఆత్మ లక్షణాలపై విశ్వాసాన్ని కలిగి ఉండడమే ఆత్మ విశ్వాసంతో ఉండడం. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన పార్వతి అందుకోసం తపస్సు చేసింది . ఆత్మవిశ్వాసం కోసం ప్రయత్నించడం ఒక తపస్సు . తపస్సు ద్వారా పార్వతి ఆత్మ(శివుడి)విశ్వాసాన్ని తిరిగి పొందింది.తపస్సులో శివుడి లక్షణాలను అంటే ఆత్మ లక్షణాలను ఆమె గుర్తించి శివుడి సాక్షాత్కారం అంటే ఆత్మసాక్షాత్కారం పొందింది . శివపార్వతులు ఒక్కటయ్యారు . శివుడి శరీరం పార్వతి(ప్రకృతి)ఐతే ,పార్వతి ఆత్మ శివుడు(పురుషుడు). 

శివపార్వతుల,ప్రకృతిపురుషుల,దేహాత్మల ఐక్యరూపమే వ్యక్తి . అందువల్ల దేహాభిమానంతో సంసారంలో ఉన్నా,ఆత్మాభిమానంతో సన్యాసంలో ఉన్నా,దేహాత్మలను ఒకటిగా చూస్తూ వాటి మధ్య ఐక్యత సాధించడం ముఖ్యం .ఐక్యత లోపిస్తే ‘వ్యక్తి’త్వం లోపిస్తుంది . అర్ధనారీశ్వర తత్వంలో వ్యక్తిత్వం ఉన్నది . 

శివపార్వతులిద్దరూ తపస్సు ద్వారానే ఒక్కటయ్యారు . తొలిచూపు ప్రేమలో (love at first sight ) శివుడికి నమ్మకం లేదు. అందుకే మొదట మన్మధుని జోక్యాన్ని, పార్వతిని తిరస్కరించాడు . తపస్సు ద్వారా ఒకరి విశ్వాసాన్ని మరొకరు చూరగొన్న తర్వాతనే వారు వివాహం చేసుకుని అదిదంపతులయ్యారు. నేటి ప్రేమలో ఈ తపస్సు ,విశ్వాసం లోపించి, మన్మధుని జోక్యం ఉంటోందని , కొన్ని రాజకీయ పార్టీలు ‘ప్రేమికుల రోజు’ ను బహిష్కరిస్తున్నాయి . 

శివుడు తన దేహాన్ని (ప్రకృతిని) ఆలిగా చేసుకున్నాడు .

శివపార్వతుల (దేహత్మల) కలయికే వ్యక్తి . 

ఆ వ్యక్తి విష్ణుమూర్తి అనుకుంటే , విష్ణువుకు నిశ్చితరూపం లేదు.

ఆయన ఆకాశంలో పక్షిగా,నీటిలో చేపగా, ఇలా పరిస్థితిని బట్టి అవతారాన్ని మారుస్తూ తన అస్తిత్వాన్ని నిలుపుకుంటున్నాడు. అలా ,మానవునితో సహా అన్ని జీవులూ ఆయన అవతారాలే అయినపుడు నేను ఎవరిని?. మానవుణ్ణా! మాధవుణ్ణా!.

మానవుణ్ణి అనుకుంటే నేనొక రూపానికి నామానికి పరిమితుణ్నవుతున్నాను. ఇది బంధం. మాధవుణ్ని అనుకుంటే నేను అపరిమితుణ్ని. అన్ని రూపాలు నావే. 

ఇది స్వేఛ్చ. 

అన్నిరూపాలు నావే నంటూ సిరివెన్నల సీతారామ శాస్త్రి గారు,

జగమంతకుటుంబం పాటలో 

“కవినై ,కవితనై ,భార్యనై భర్తనై ,రవినై శశినై ,దివమై నిశినై ,నాతో నేను సహగమిస్తూ …” అంటూ తన అపరిమితత్వాన్ని,స్వేచ్ఛను వ్యక్తం చేసారు 

. ఆ పాటలోనే ఒంటరితనాన్ని,ఏకాకిజీవితాన్ని(ఏకాంతాన్ని) ప్రస్తావించారు .

అన్ని రూపాల్లో ఉన్నది నేనే అయినప్పుడు ఉన్నది నేనొక్కడినే .అందువల్ల నేను ఒంటరిని . ఏకాకిని.అన్ని రూపాలూ నావే కనుక నాది జగమంత కుటుంబం .

అంతా నేనే అయినపుడు,ఇతరులను హింసించడమంటే, 

నన్ను నేను హింసించుకోవడమే అవుతుంది.

.

సృష్టి చేయాలంటే సృజనాత్మక శక్తి (బ్రహ్మ) కావాలి . విష్ణువు లోనే బ్రహ్మ ఉన్నాడు. ఆయనలోంచే పుట్టాడు(వ్యక్తం అయ్యాడు). అందువల్ల విష్ణువు తన్ను తాను పునఃసృష్టిoచుకుంటూ పరిస్థితిని బట్టి అవతారాన్ని మారుస్తున్నాడు . 

ఇపుడు , “నేనెవరు?”, అని మానవుడు ప్రశ్నించుకుంటే,

దేహత్మలు ఉన్నందున అతడు శివుడా ?

మానవరూపంలో ఉన్న విష్ణువా ?

తనను తాను పునఃసృస్టించుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించగలడు కాబట్టి బ్రహ్మా?

త్రిమూర్తులు ముగ్గురు లేరు . ముగ్గురూ ఒక్కరిలోనే ఉన్నారు . ఆయనే పరబ్రహ్మ . బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరబ్రహ్మ స్వరూపాలు .

ఫై ముగ్గురూ మానవుని ఆశ్రయించుకొని వున్నారు కాబట్టి నేను(అహం) ఎవరు ?

శివుడే 

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!