ఆశ/నిరాశ.!

ఆశ/నిరాశ.!

ప్రతివారు తమ తాహతుకు తగినవాటికి ఆశపడటం తప్పుకాదు.

పంట వేసిన రైతు ఫలసాయం కోసం, పెళ్ళయిన పడుచు బిడ్డ కోసం, 

బాగా పరీక్షలు రాసిన విద్యార్ధి మంచి ఫలితం కోసం, పెళ్ళి చూపులలో చూసొచ్చిన అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోవాలని పెళ్ళికొడుకు, ఆశపడటం తప్పుకాదు. 

అదేమిటి! అబ్బాయి కదా ఒప్పుకోవలసినది అనద్దు, ఆ రోజులు పోయాయి, 

ఇప్పటి రోజుల్లో అమ్మాయి ఇష్టపడితేనే పెళ్ళి, లేకపోతే హళ్ళికి హళ్ళి సున్నకి సున్నా, అదీ నేటి పరిస్థితి. మొన్ననొక పెళ్ళి సంబంధం చూశాము, అమ్మాయి ఒక పట్నంలో పని చేస్తూఉంది, అబ్బాయి మరొక పెద్ద పట్నం లో పని చేస్తున్నాడు, అన్నీ నచ్చేయి కాని అమ్మాయి అంత దూరం వెళ్ళి కాపరం చెయ్యను, అని కచ్చితంగా చెప్పేసింది, మరి ఇప్పుడు డిమాండు అమ్మాయిలదా? అబ్బాయిలదా?. పెళ్ళి కొడుకులు అమ్మాయిల ముందు క్యూ కడుతున్నారు. రేపో నేడో, అమ్మాయిలు కన్యాశుల్కం అడిగినా అశ్చర్యపోనక్కర లేదు.ఈ పోకడలు వెర్రి తలలేస్తున్నాయి.

వరకట్నమెంత దురాచారమో కన్యాశుల్కం కూడా అంతే దురాచారం.

దారి తప్పేం.

ఆశ పడిన ఫలితం దక్కనపుడు నిరాశ పడటం సర్వ సహజం. దురాశ, పేరాశలకి ఫలితం ఎప్పుడూ నిరాశే. ఆ ఫలితంగా వచ్చే నిరాశకి మందు లేదు. నైజ గుణానికి లొట్టకంటికి మందులేదని నానుడి కదా. ఇల్లా పేరాశ,దురాశలకి పోతే మిగిలేదెప్పుడూ నిరాశే. సహజమైన, ధర్మమైన కోరిక నెరవేరనపుడు కూడా నిరాశ జనిస్తుంది, సహజం. నిరాశ నుంచి దుఃఖం పుడుతుంది, నిరాశను, దుఃఖాన్ని కూడా అనుభవించాల్సిందే. జీవితంలో అన్నీ అనుభవించాలి, తప్పదు. సంతోషం, విచారం, కోపం, ఆశ, నిరాశ ఇలా అన్నీ అనుభవించక తప్పదు. ఐతే నిరాశ లో పడి కొట్టుకుపో కూడదు. కష్టము, సుఖమూ, ఏదీ నిలిచి ఉండిపోదు. ఎప్పుడూ సుఖమే ఉండదు, నిరాశలో కూరుకుపోరాదు.

ఒక్కొకప్పుడు అన్నీ సవ్యంగా ఉన్నా ఫలితం వ్యతిరేకంగా ఉంటుంది. అదే విధి వైపరీత్యం అంటే. దానినేమీ చెయ్యలేము. అప్పుడనుకోవలసినది, ఈ వ్యతిరేక ఫలితం కూడా మన మంచికోసమే జరిగిఉండచ్చు, మనకి తెలియని ఆపద గడవబెట్టడానికి, భగవంతుడు చేసిన ఏర్పాటిది అనుకుంటే మానవుడు ముందుకు సాగగలడు. లేకపోతే నిరాశ, దుఃఖాలలో కూరుకుపోయి, మరి తేరుకోలేడు. కష్టం కలిగినపుడు నిర్వేదం కలుగుతుంది, ఈ నిర్వేదం నుంచి జీవితానుభవం కలిగిన పెద్దలు ముందు బయట పడి, పిన్నలకు ధైర్యం చెప్పాలి.మార్గదర్శనం చేయాలి.

లంకలో ఉండగా తనను వెతుకుతూ వచ్చిన హనుమతో సీతమ్మ ఇలా అంటుంది,

ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే,

రజ్జ్యేవ పురుషం బద్ధా కృతాంతః పరికర్షతి……. రామాయణం. సుందరకాండ. ౩౭వ సర్గ…౩

అనగా సమృద్ధిగా ఐశ్వర్యము కలిగినపుడేగాని, దారుణమగు కష్టము కలిగిన సమయముననేగాని, పురుషుడెంత మాత్రము స్వతంత్రుడు కాడు. దైవము వానిని త్రాటితో కట్టినట్లు పట్టి ఈడ్చుకుపోవును.

చెప్పటం తేలిక, ఆచరణే కష్టం, కష్టంలో ఉన్నపుడే, మనిషి గుణం తెలిసేది, ధైర్యం,నమ్మిక, ఆశ, కావాలి. చెప్పడం కాదు ఆచరించాలి,ఆచరించి చూపాలి, అప్పుడే పెద్దరికానికి విలువ, ఫలితం, కావలసినవారికి ధైర్యం చెప్పాలి, కష్టం గట్టెక్కాలి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!