ఎర్రచీమలు!

ఎర్రచీమలు!

(కృష్ణమూర్తి గారు తన బాల్యంలో చీమలను దీక్షగా గమనించేవారట. చీమలపై ఆయన వ్రాసిన ఓ పేరా స్ఫూర్తిగా) 

నిలువున్న నిన్నటి చపాతీలు తిందామని చూద్దును కదా, అందులో ఎర్రచీమలు.

చీమ! జాగ్రత్తగా గమనిస్తే ఎంత చక్కటి ఆకారం! రెండు అండాకారాలు - ఒకటి ఎర్రనిదీ, మరొకటి నల్లనిదీనూ. వాటిని దారంలా కలుపుతూ సన్నటి నడుము. అటూ ఇటూ హడావుడిగా పరుగెడుతూ ఉన్నాయి. ఇటు వైపు వెళ్ళే చీమకు అట్నుంచి వచ్చే చీమ అడ్డుపడితే, ఓ లిప్తపాటు తలను తాకించి, ఏదో సందేశాన్నందిస్తూంది. కొన్ని చీమలు కలిసికట్టుగా చేరి, ఓ పెద్ద ముక్కను లాగుతున్నాయి. ఆ చీమలబారు ఎక్కడి నుంచీ మొదలవుతుందో చూద్దామని పరికిస్తూ వెళితే, గోడవారగా పక్కగదిలోకి, అలా గది చివర్న ఓ చిన్న పుట్టలోనికి దారి తీసింది. అందులో సగం బారును లెక్కపెడితే, ఉజ్జాయింపుగా 450 చీమలున్నాయి. ఇటు వెళుతున్నవి, తిరిగి వస్తున్నవీ కలిపి. అంటే, దాదాపు వేయి చీమలు ఆహార సేకరణ అనే ఆ మహా యజ్ఞంలో పాలుపంచుకుంటున్నాయి!

భగవంతుని సృష్టిలో అన్నీ అద్భుతాలే. ఉహూ.. ఆ వాక్యం బావోలేదు. సృష్టిలోని అణువణువులోనూ భగవంతుడు తానై రూపాంతరం చెందాడేమో. ఠాగూర్ అనుకుంటాను గుర్తు లేదు. చూడగలిగితే భిన్నత్వం అణువణువులోనూ ఉందంటాడు. ఓ చెట్టులో ఏ రెండు ఆకులను ఆకులను చూచినా, ఆ ఆకులపైని మెఱుపులోనో, ఆ ఆకుల తాలూకు ఈనెలలోనో, ఆ ఆకు ఆకారంలోనో ఏదోక భిన్నత్వం కనిపిస్తుంది(ట). ఓ చెట్టులోని ఆకుకు, మరో ఆకుకూ మధ్య కూడా వ్యత్యాసం స్పష్టంగా చూడవచ్చట, కనులు తెరిచి పరికిస్తే.

ఓ చెట్టులోని ఆకులను అలా చూస్తూనే లెక్కెట్టటం అనే విద్య ఒకటుండేదట, పూర్వకాలంలో. నలదమయంతుల కథలోని నలమహారాజుకు ఈ విద్య తెలుసట. ఈ విద్య పేరు అశ్వ హృదయం అనో, అశ్వహృదయంలో ఈ గణనం కూడా ఓ అంగమనో చిన్నప్పుడెప్పుడో మాష్టారు చెప్పిన గుర్తు. (ఈ నా జ్ఞాపకం పొరబాటు కూడా అయి ఉండవచ్చు. అయితే ఈ రకమైన విద్య మాత్రం ఏదో ఉన్నట్టు చెప్పారన్నది బాగా గుర్తుంది).

చీమల గురించి ఏదో ఆలోచనలో పడి ఎక్కడికో వెళ్ళాను. కనిపిస్తున్న ఇన్ని చీమలలో కూడా ఒకచీమకూ, మరో చీమకూ మధ్య వ్యత్యాసం ఉందా? అదెలా తెలుసుకోవచ్చో? అయినా ఏ ఎమ్బీయేలూ, మేనేజిమెంటులు చదవకుండానే వీటికి, ఇలా తమ ఆహారాన్ని వర్షాకాలం కోసం దాచుకోవాలని ఎలా తెలిసిందో? ఒక మి.మీ. లో అర్ధ భాగం కూడా లేని వాటి తలలలో, ఈ ఆలోచన ఎలా వచ్చిందో? లేకపోతే, మెదడుతో సంబంధం లేని మరో అద్భుత యంత్రాంగం ఏదో ఈ జీవప్రపంచంలో ఉండి ఉండాలి. నేర్చుకోవాలన్న తపన అవసరమే కానీ, మనకు నేర్పడానికి భగవంతుడు అణిమాది రూపాల నుంచి, బ్రహ్మాండమంతటా తానే అయిన మహిమాత్మక రూపం వరకూ ఎదుట కనిపిస్తూ ఆశ్చర్యానందాద్భుతాలకూ ఎప్పుడూ గురి చేస్తూనే ఉంటాడు. మహిమాన్వితమైన ఆ తేజో రూపం గురించి ఏం మాట్లాడగలుగుతాం? కైమోడ్చి శిరసు వంచటం తప్ప?

నల్ల చీమలను (నల్ల గండు చీమలు కాదు. చిన్నవి) ఎట్టి పరిస్థితిలోనూ చంపరాదని మా అమ్మ చిన్నప్పుడు మాకు విధించిన ఆంక్ష! అవి వినాయకుడి చీమలట. వాటికి చక్కెర కూడా పెట్టేది మా అమ్మ.

సత్యజిత్ రే రాసిన ఓ కథ ఉంది. శాశ్మల్ అనే ఓ ఆసామీ, తన సెలవు రోజును గడపడం కోసం, ఒక్కడే కలకత్తాకు దూరంగా అడవిలో ఓ రిసార్టుకెళతాడు. అక్కడ అడవికి మధ్య, చౌకీదారును పంపేసి, గదిలో నిద్రకుపక్రమిస్తాడు. అప్పుడు ఆ రాత్రి - తను చిన్నప్పట్నించీ చంపిన ప్రాణులన్నీ ఒక్కొక్కటిగా ఆ గదిలో కనబడ్డం ఆరంభిస్తాయి. వాటిలో ఓ చీమలబారు కూడా. అతను తన స్కూలు రోజుల్లో ఓ పైకి వెళుతున్న చీమలబారును, కాగితానికి చివర నిప్పంటించి, ఆ నిప్పుతో ఆ చీమల దండుకు మంటెడతాడు. ఆ చీమల బారు, తన కారు కింద పడ్డ కుక్క, తమ బంధువులింట ఎవరికీ హాని తలపెట్టకుండా, దైవంలా అందరూ పూజించబడుతూ, తనచేత కర్రతో కొట్టి చంపబడ్డ పాము, ఓ పక్షి, పిల్లి....ఇలా... ఆ కథ చివరికేమవుతుందో మాత్రం ఇప్పటికి సస్పెన్స్!

అంతరిక్షమూ, పాలపుంతలూ, గ్రహాలు, నక్షత్రాలు ఆదిగా గల ఈ బ్రహ్మాండంలో మనిషి అస్తిత్వం కూడా పిపీలిక పరిమాణమే కాదూ!

చీమలదండు గురించి ఆలోచిస్తూ, వాటికి పెట్టిన ప్రసాదం వదిలేసి, ఏదో అలా మింగి, కొత్త సంవత్సరం ఏ టపా రాద్దామా అని ఈ టపా రాస్తున్నాను. ఆ చపాతీల పాత్రకు కాస్త దూరంగా సాయంత్రం వెలిగించిన సంధ్యాదీపం ఇంకా వెలుగుతూంది దివ్యంగా.

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!