గీతలు-రాతలు .!

గీతలు-రాతలు .!

.

(పద్మార్పిత మదిలో భావాలు.)


గీతలకేం తెలుసని చేస్తాయి గీతోపదేశాలు!!

అరచేతి గీతలుచూసి అఖండ సౌభాగ్యమని

అర్థంకాక అలికిన గీతల్ని అహా ఓహో అని

హస్తరేఖలతో జీవితాన్ని ఏం అంచనా వేస్తావు

చేతుల్లేక జీవిచడంలేదాంటే వెర్రిముఖం వేసేవు


గజిబిజిగీతలకేం ఎరుక గాడితప్పిన గమ్యాలు!!

నుదుటిపై గీతల్లో భవిష్యత్తు అంతా భవ్యమని

ఆకతాయిగా తిరిగి అదే అందిన ఆనందం అని

కష్టాల్లో కలిసిరాదని నుదుటిరాతనే నింధించేవు

ప్రయత్నం ఏం చేయకనే ఫలితాలని ఆశించేవు


సరళరేఖలకేం తెలుసని సహజీవన విధానాలు!!

నేలపై నిలువు అడ్డంగా గీతలేగీసి సరిహద్దులని

స్వార్ధసంస్కరణల చిందులనే విజయమనుకుని

విరిగిన మనసులకు మాటల లేపనమే పూసేవు

అద్దమంటి మదిని గీతకనబడకుండా అతకలేవు


గాట్లుచేసే గీతలకేం ఎరుక గాయాల సలపరాలు!!

పట్టింపు పగలతో శరీరంపై గాటుగీతలేసి శిక్షలని

రక్తం స్రవిస్తుంటే రంగొకటే అయినా మనం వేరని

ఆవేశంతో ఆలోచించకనే తృటిలో పరిష్కరించేవు

ఎన్నటికీ ఊపిరాగిపోని గీతలేవీ నీవు గీయలేవు


బంధాల మధ్య గీతలకి లేవు సంబంధ విలువలు!!

అనురాగాల తులాభారమేసి ఆపలేవు అడ్డుగోడని

పైకంతో వారధి కట్టి కాంచలేవు మమతల కోవెలని

అనుబంధమే తెగితే ముళ్ళు లేకుండా అతకలేవు

అంతరంగపు అడ్డుగోడలతో అందరిలో ఒంటరి నీవు


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!