కార్తీక పురాణం 9వ రోజు!

-

కార్తీక పురాణం 9వ రోజు!

-

అజామిళుని పూర్వ జన్మ వృత్తాంతము:
జనకుడు వశిష్ఠులవారితో మునిశ్రేష్ఠా! ఈ అజామిళుడు ఎవడు? పూర్వజన్మలో ఎట్టిపాపములు చేసియుండెను? ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకువెళ్ళిన తర్వాత ఏమి జరిగెనో వివరించమని ప్రార్థించెను. అంత ఆ మునిశ్రేష్ఠుడు జనకమహారాజుతో ఇట్లు పలికెను.
జనకా! అజామిళునిని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకువెళ్ళిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభూ! తమ ఆజ్ఞ ప్రకారం అజామిళుడుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుడిని విమానమెక్కించుకొని వైకుంఠమునకు తీసుకొనిపోయిరి. మేము చేయునది లేక చాలా విచారిస్తూ వచ్చాము అని భయపడుతూ చెప్పిరి.
'ఔరా! ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇలా జరగలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి యుండవచ్చును' అని యమధర్మరాజు తన దివ్యదృష్టితో అజామిళుని పూర్వ జన్మ వృత్తాంతమును తెలుసుకొని 'ఓహో! అదియా సంగతి! తన అవసాన కాలమున 'నారాయణా' అని వైకుంఠవాసుని నామస్మరణ చేసినందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలిసిగానీ, తెలియకగాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక, అజామిళునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా!' అని అనుకొనెను.
అజామిళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగానుండెను. అతడు అపురూపమైన అందం చేతను, సిరిసంపదల చేతను, బలము చేతను గర్విష్టియై, వ్యభిచారియై శివారాధన చేయక, శివాలయము యొక్క ధనమును అపహరించుచూ, శివాలయమలో ధూపదీప నైవేద్యాలను పెట్టక, దుష్టసహవాసములను చేస్తూ తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో సంబంధము పెట్టుకొనెను. ఆమె కూడా అందమైనదగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియూ, చూడనటుల ప్రవర్తించుచూ భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు.
ఒకనాడు పొరుగూరికి వెళ్ళి యాచన చేసి పెద్దమూటతో బియ్యము, కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి ఈ రోజు నేను ఎంతో అలసిపోయాను, నాకు ఈ రోజు ఆకలి ఎక్కువగా ఉన్నది. త్వరగా వంటచేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులకామె చీదరించుకొనుచూ నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళు కూడా ఇవ్వక, అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనస్సు కలదై భర్తను తూలనాడడం వల్ల భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదెను. అంత ఆమె భర్త నుండి చేతికర్రను లాక్కొని భర్తను రెండింతలుగా కొట్టి బైటకు తోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలచి దేశాటనకు వెళ్ళిపోయెను.
భర్త ఇంటినుండి వెళ్ళిపోయెను కదా అని సంతోషించిన ఆమె ఆ రాత్రి బాగా అలంకరించుకొని వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి 'ఓయీ నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు' రమ్మని కోరెను. అంత ఆ చాకలి 'తల్లీ! నీవు బ్రాహ్మణ పడతివి. నేను నీచకులస్తుడను. చాకలి వాడునూ. మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు. నేనిట్టి పాపపుపని చేయజాలను' అని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలి వాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కలసి తన కామవాంచ తీర్చమని పరిపరివిధముల బ్రతిమాలి ఆ రాత్రంతయూ అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి 'అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టితిని? అగ్ని సాక్షికా పెండ్లాడిన భర్తను ఇంటినుండి వెడలగొట్టి, క్షణికమైన కామవాంఛలకు లోనై మహాపరాధము చేసితిని' అని పశ్చాత్తాపమొంది ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపెను.
కొన్ని రోజులు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా అతనిపాదములపై బడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి
నుండి ఆమె మంచి నడవడికవల్ల భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంత కాలమునకు ఏదియో వ్యాది సంక్రమించి దినదినమూ క్షీణించుట చేత మరణించెను. అతడు రౌరవాది నరక కూపమన పడి నానాబాధలు అనుభవించి మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై, కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసినందువలన ఏడు జన్మముల పాపములు నశించుటచేత అజామిళుడై పుట్టెను. ఇప్పటికి తన అవసాన కాలమున 'నారాయణా' అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠముకు పోయెను.
బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. ఆమె యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాసి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. దాంతో మాలవాడా శిశువుని తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవుచూ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిళుడు ప్రేమించెను. అదీ వారి పూర్వజన్మ వృతాంతము అని తెలిపెను.
నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటివారైననూ మోక్షమును పొందగలరు. కాన కార్తీక మాసమందు వ్రతములు, పురాణశ్రవణములు చేసివారు ఇహ, పర సుఖములను పొందగలరు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!