పోతన లో తాను!

పోతన లో తాను!

(సౌజన్యము: "గబ్బిట దుర్గా ప్రసాద్")

-

-సహజ కవి పోతనామాత్యుడు తనను తాను ఆవిష్కరించుకుంటున్నట్లుగా ఈ రచన సాగుతుంది. ఇందులో "నేను" అని అంటే పోతన గారే అని తెలుసుకోవాలి. ఆయన లోని కవిత్వ సంపద, వినయం, భగవద్భక్తీ, అలంకార వైభవం అన్నీ ఆయన మాటలతో వింటున్నట్లు వుంటుంది. సమాదరిస్తారని ఆశిస్తున్నాను. — -మీ దుర్గా ప్రసాద్.

-

శ్రీకైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర

క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో

ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా

నాకంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.

-

ఈ పద్యంలో. నా రచనా లక్ష్యం "శ్రీ కైవల్యపదమే"; భవబంధరాహిత్యమే; జన్మసాఫల్యం, కైవల్యం వల్లనే కదా సాధ్యం? అదే నేను కోరుకొన్న పరమపదం. . . నా ఆకాంక్ష, మొదటినుంచీ, చివరిదాకా, "కైవల్యమే" ఈ భాగవతజన్మ వల్ల నాకు పునర్జన్మ లేదు అని భావించి, శ్రీహరిని సంభావించాను. 

"తెలుగు సాహిత్యం ఉన్నంత కాలము, పోతన గారు బ్రతికే వుంటారు, ఆయన మరణించరు కనుక. పోతరాజు గారికి పునర్జన్మ లేదు" అన్నారొక మహానుభావుడు. ఇది నాపై వారికి గల అపూర్వ అనురాగానికి మచ్చు తునక.

-

అవును - ఇదంతా నేను వ్రాశానా? నా చేత, ఆ పరమాత్మ పలికించిన పలుకులివి. అవి నావి కావు. ఆయనవే. మీ పొగడ్తల పొగడపూల దండలన్నీ, ఆ చిన్ని నాయనకే.

-

పలికెడిది భాగవత మఁట, 

పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ

బలికిన భవహర మగునఁట, 

పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?

-

అన్న గారు తిక్క యజ్వ గారికి "హరిహరనాథులు" కలలో కన్పించి, "భారత రచనా ప్రయత్నం భవ్య పురుషార్ధ, తరు పక్వఫలమని, దానిని తనకు కృతి ఇమ్మనీ" సెలవిచ్చారు. సోమయాజి గారి మనః ప్రవృత్తి అప్పటికే "ఎల్లలు లేని భక్తి సరిత్తు". భారత రచనా విధానం వారి దృష్టిలో ఆరాధనా భావం. మరి నా అదృష్టమేమో?

-

ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్

తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో

తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా

జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.

-

నా ముందు తరం కవీశ్వరుల దృష్టిలో కాని, నా సమకాలీన కవిపుంగవుల కంట గాని భాగవత మహాగ్రంథం పడకుండటం, నా అదృష్టమే కదా! అందుచేతనే "శ్రీ మన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలం" కనబరచాను.

భాగవతం స్థూల దృష్టికి శ్రీకృష్ణ లీలాపేటిక. విష్ణుభక్తుల కథా వాటిక. మధ్య మధ్య ఎన్నో విప్పలేని వేదాంత గ్రంథులు వున్న మహా గ్రంథం. అందుకే నాకు అప్పుడు అనిపించింది. -

-

చేతులారంగ శివునిఁ బూజింపఁడేని,

నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని,

దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ, 

గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.

-

అనటంలో పరమాత్మను మనం చూడటం లోనే భేదం వుంది కాని, ఆయన ఎప్పుడూ ఒక్కడే అన్నది సత్యం కాదా? కనుక నాకు శివ, కేశవ భేదం లేదు. ఆ ఇద్దరు అభిన్నులే అని నా ధృఢ విశ్వాసం.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!