వీక్ ఎండ్ సినిమా !

-

విశాలి పేరి గారి వీక్ ఎండ్ సినిమా !

-

ఇంట్లో ఎవరూ లేరు, బయట చల్లని గాలి, చిన్న తుంపర.. ఆహా ఇలాంటి టమ్ లో మంచి కాఫీ కప్పు తో అందమైన సినిమా చూస్తే ఎలా ఉంటుంది.. అలాంటి ఆలోచన రాగానే వంటింట్లోకి వెళ్ళి ఒక కప్పు కాఫీ తో హాల్ లోకి వచ్చి టి.వి ఆన్ చేసాను.

పడవలో మాధవి ( అదేనండి 70-80 దశకంలో సినిమాని ఏలేసిన అమ్మాయి), పక్కన ఒక బుడ్డోడు ఇంకా సినిమా పేర్లు పడుతున్నాయి... ఏదో 70 - 80 లో వచ్చిన సినిమా చూద్దాము అనుకున్నాను ....

భక్తప్రహ్లాద సినిమాలో కశ్యపుడు " విధి బలీయమైనది " అని అన్నప్పుడు ఏంటో అనుకున్నా. విధి బలీయమైనది.. మనము బలహీనులమే అని గ్రహించడానికి ఒక్కొక్కరికి ఒక్కో సంధర్భం లో జ్ఞానోదయం అవుతుంది.

సూక్షంగా సినిమా :

మాధవికి కి పెళ్ళి అవుతూ ఉండగా పెళ్ళి కొడుకు కరంటు షాకు తో చనిపోతాడు, అందరూ మాధవిని తిడుతోంటే పక్కన ఉన్న ఒక బుడ్డోడు ఆవిడ మెళ్లో ఆ తాళి కట్టేస్తాడు.

ఇద్దరూ వేరే ఊరికి వెళ్లి అక్కడే ఒక ఇంట్లో ఉంటారు. ఆవిడ ఒక రాధగా , ఆ బుడ్డోడు ఒక కృష్ణుడిగా ఊహించేసుకొని ఆరాదించెస్తూ ( ఆక్రోషించేస్తూ )పాటలు కూడా పాడేసుకుంటుంది. ఆ బుడ్డోడు పెద్దైయ్యాక రాజేంద్ర ప్రసాద్. కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ మాధవి ఒక డాక్టర్ దగ్గర నర్స్ గా చేస్తుంది . ఆ డాక్టర్( శరత్ బాబు ) ఈవిడని ఇష్టపడతాడు. కానీ ఈవిడ తనకి పెళ్లైపోయిందని ఆ త్యాగరాజు ని రిజక్ట్ చేస్తుంది. అదేంటో శరత్ బాబు ప్రతీ సినిమాలోనూ త్యాగరాజే అవుతాడు (త్యాగాలు చేస్తూ).

అలా అలా సాగీ కథ చివర్లో నిజం చెప్పి మాధవి చచ్చి పోతుంది (అదేదో మొదట్లో చస్తే ఆరభం కాదిది అంతం అని సినిమా టైతిలు పెట్టేయచ్చు కదా).

ఒక కంటి తుడుపు చర్యా ఏమిటంటే, ఒక పాట... ఈ పాట నేను చిన్నప్పుడు రేడియో లో విన్నాను.. ఆ టైం లో నాకు చాలా నచ్చిన పాట అది " రాధా కృష్ణయ్య ఇటు రా రా కృష్ణయ్య " పాట సాహితీ పరం గా బాగుంది కానీ చూడటానికే చాలా ఛండాలంగా ఉంది.

ఆ పిల్లాడిని చూసి మాధవికీ కలిగే ఆరాధన చాలా వికారం గా ఉంటుంది.

ఈ సినిమా అయ్యేటప్పటికి పిల్లలు బయటనుండి తిరిగి వచ్చారు, రాగానే " ఏంటీ ఒంట్లో బాలేదా జ్వరం వచ్చిందా ? అలా ఉన్నావేంటి " అని అడిగారు.

కాబట్టి ఎవరూ ఈ సినిమా ఎప్పుడైన ఎక్కడైనా పొరపాటున ఫ్రీ గా వస్తోంది కదా అని మాత్రం చూడకండి. చేతిలో రిమోట్ ఉండగా మార్చలేకపోయావా? అనేగా మీ ప్రశ్న... మారిస్తే విధి బలీయమెందుకౌతుంది..

దేవుడా రక్షించు నా సినీ అభిమానులని

పగబట్టిన దర్శకుల నుండి...

పొగరెక్కిన ప్రోడ్యూసర్ల నుండి...

పైత్యమెక్కిన హీరోయిన్ల నుండి...

పిచ్చెక్కిన రచయితలనుండి...

ముదిరిపోయిన బాలనటుల నుండి...

ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదా... మూడు ముళ్ల బంధం.

ఇంతటి తో శెలవు తీసుకుంటున్నాను, మళ్ళీ విధివక్రించి ఏవైనా చెత్త సినిమాలు చూస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!