ధర్మరాజు గర్వ భంగం!

ధర్మరాజు గర్వ భంగం!

.

పేద సాదల పట్ల ధర్మరాజుకు దయ, కరుణలు అపారం. అర్హులైన వారికి ఆయన విరివిగా దానాలు చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి ధర్మరాజులో తన దాతృత్వం పట్ల, తన దయా స్వభావం పట్ల కించిత్తు గర్వం పొడసూపింది. ధర్మరాజు మనస్సులో గర్వం జాడ మాత్రం కానరావడం శ్రీకృష్ణుడు గమనించాడు. వెంటనే ధర్మరాజుకు ఒక గుణపాఠం నేర్పి అతడిలో అప్పుడప్పుడే మొలకెత్తుతున్న గర్వాన్ని అడుగంటా తొలగించాలని శ్రీకృష్ణుడు నిశ్చయించాడు.

మామూలుగా ఇద్దరు ఎక్కడకో పోతున్నట్లు ధర్మరాజును తోడ్కొని శ్రీకష్ణుడు ఒకరోజు బయలుదేరాడు. ఆ సమయంలో పాతాళ లోకాన్ని మహాబలి పరిపాలిస్తున్నాడు. సాటిలేని రీతిలో మహాబలి దాన ధర్మాలు చేయడం ఆయనలోని విశేష గుణం. ఆయన దాతృత్వం లోక విదితం.

శ్రీకృష్ణుడు ధర్మరాజును పాతాళలోకానికి తోడ్కొని వచ్చాడు. ఇద్దరూ పాతాళలోక ముఖ్యపట్టణంలో అనేక వీధుల గుండా మెల్లగా నడిచి వెళ్లసాగారు.

ఇంతలో ధర్మరాజుకు దాహం వేసింది. శ్రీకృష్ణుడు ధర్మరాజు ఎదురుగా ఉన్న ఒక ఇంటికి వెళ్లారు. ధర్మరాజు తాగడానికి నీళ్లు ఇవ్వమని ఆ ఇంట్లో అడిగాడు. ఆ ఇంటి గృహిణి ఒక బంగారు చెంబులో మంచినీరు తెచ్చి ధర్మరాజుకు ఇచ్చింది. శ్రీకృష్ణుడు జరుగుతున్నదంతా చిరునవ్వులు చిందిస్తూ చూడసాగాడు.

ధర్మరాజు నీరు తాగి దాహం తీర్చుకుని ఆ ఇంటి గృహిణితో, “కృతజ్ఞత తల్లీ! ఇది బంగారు చెంబులా ఉందే! దీన్ని తీసుకుపోయి పదిలమైన చోట ఉంచండి” అంటూ, చెంబును తిరిగి ఇవ్వబోయాడు.

అందుకు జవాబుగా ఆ గృహిణి “అయ్యా! ఒకసారి ఇచ్చింది, అది బంగారు చెంబు అయినప్పటికీ తిరిగి పుచ్చుకొనే అలవాటు మా రాజ్యంలో లేదు. అది బంగారుదైనప్పటికీ విసిరి వేస్తామేగానీ మళ్లీ ఉపయోగించే ఆనవాయితీ లేదు” అని చెప్పింది.

ఆమె చెప్పిన మాట వినగానే ఆ రాజ్య ప్రజల సిరి సమృద్ధిని, వారి జీవన ప్రమాణ ఔన్నత్యాన్ని అవగతం చేసుకొన్న ధర్మరాజు విస్తుపోయాడు. 

.

ఆ తరువాత అక్కణ్నుంచి బయలుదేరి శ్రీకృష్ణుడు, ధర్మరాజు మహాబలి అంతఃపురానికి వెళ్లారు.

అక్కడ మహాబలితో “ రాజా! ఈరోజు ధర్మరాజును మీ రాజ్యానికి తీసుకుని వచ్చాను. ఈయన దాన ధర్మాలు చేయడంలో ఎంతో ఖ్యాతి గడించాడు. నిత్యం ఐదువందల మందికి అన్నదానం చేస్తున్నాడు” అని చెప్పి, ధర్మరాజును శ్రీకృష్ణుడు పరిచయం చేశాడు. 

.

శ్రీకృష్ణుని పరిచయ వాక్యాలను వినీ వినగానే మహాబలి తన రెండు చెవులను అరచేతులతో మూసుకుని. “వద్దు, వద్దు, నాతో చెప్పకండి! అటువంటి ఒక వ్యక్తిని గురించి వినడానికి నేను సిద్ధంగా లేదు. ఇక్కడ నా రాజ్యంలో నా నుండి దానం పుచ్చుకోవడానికి నేను ఎంతో ప్రయత్నించినప్పటికీ కనీసం ఒక్కరు కూడా లభించలేదు. ఇక్కడ దానం పుచ్చుకొని జీవించాలనే దుస్థితిలో ఒక్కరు కూడా లేరు. మీరో ధర్మరాజు నిత్యం ఐదువందల మందికి దానం చేస్తున్నాడని చెబుతున్నారు. అలా అయితే ఆయన రాజ్యంలో ఐదు వందలమంది పేదలు ఉన్నరన్నది ఖచ్చితంగా తెలుస్తోంది. దీని నుండే ఆయన ఎంత ‘గొప్పగా’ రాజ్యపాలన చేస్తున్నాడో తెలియవస్తోంది! అలాంటి రాజ్యపాలన దక్షత కొరవడిన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి నాకు కించిత్తు కూడా ఆసక్తి లేదు!’ అన్నాడు గంభీరంగా. 

.

మహాబలి మాటలు విన్న ధర్మరాజు సిగ్గుతో తలదించుకున్నాడు. ఈ విధంగా ధర్మరాజు మనస్సులో గర్వం జాడమాత్రంగా తలెత్తినప్పుడే శ్రీకృష్ణుడు దాన్ని రూపుమాపి ఆయనను అనుగ్రహించాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!