విలక్షణ గాయనీమణి...అద్భుత నటీమణి పద్మభూషణ్ భానుమతి!

విలక్షణ గాయనీమణి...అద్భుత నటీమణి పద్మభూషణ్ భానుమతి!

.

భానుమతిగారి గొంతులో అదో రకం అందం వుంటుంది. 

ఆమె పాట వింటూ వుంటే మనసు స్వర్గ సీమలో పావురంలా ఎటో వెళ్ళిపోతుంది. ఎంత మంది సింగర్స్ వచ్చినా ఆమెలా పాడేవారు ఇంత వరకు ఎవరూ లేరంటే అది అతిశయోక్తి కాదు. 

తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ వెండితెర అద్భుతంలా అనిపించే చిత్రం...'మల్లీశ్వరి'. ఆ చిత్రరాజంలో ప్రతీ పాటా మనసును దోచేస్తుంది. ముఖ్యంగా దేవులపల్లివారి కలం నుంచి జాలువారిన మనసున మల్లెల పాట కలకాలం గుర్తుండి పోతుంది. భానుమతి గారి గాత్రంలో తొణికిసలాడిన మాధుర్యం...అభినయంలో ఆమె ప్రదర్శించిన అద్వితీయ ప్రతిభ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

.


అజరామరం 'లైలా మజ్ను'ల ప్రేమకథ.

మనసు చేసే పెను మాయ పేరే ప్రేమ. ఒక్కసారి ప్రేమలో పడితే మనసు మరో ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ప్రేమకు సంబంధించి బోలెడు కథలున్నాయి. వాటిల్లో గుండెకు గాలం వేసే కథలు కొన్నే వున్నాయి. అలాంటి కథల్లో అజరామరంగా నిలిచిపోయిన ప్రేమకథ...'లైలా మజ్ను'ల ప్రేమకథ. ఈ కథను సినిమాగా కూడా తీశారు. 


.అక్కినేని 'మజ్ను'గా, భానుమతి 'లైలా'గా అపూర్వ నట విన్యాసం ప్రదర్శించిన ఆ చిత్రంలో...పల్లవించే పాటలు ఎన్నో వున్నాయి. వాటిల్లోంచి ఏ పాటనైనా ప్రత్యేకంగా చేప్పుకోవాలంటే మనం ఈ పాటనే చెప్పుకోవాలి.

.


దాదాపు 200కి పైగా చిత్రాలలో నటించి నటిగా, దర్శకురాలిగా, గాయనిగా తనదైన ముద్రను వేశారు. ఏ పాత్ర పోసించినా తనదైన విలక్షణత స్పష్టంగా కనిపించేలా చూసేవారు. పాటల సంగతైతే ఇక చెప్పనే అక్కర్లేదు. ఏ పాటసారి అయినా సరే ఆమె బాటసారి సినిమా పాటతో తన ప్రయాణం మొదలెట్టాల్సిందే. భానుమతిగారి గొంతులో ఓ కమాండ్ వుంటుంది. ఆమె ఏదైనా చెప్పాలనుకుంటే డొంక తిరుగుడు లేకుండా సూటిగా మాట్లాడేస్తారు. అందుకే ఆమె మాటలు తూటాల్లా పేలుతాయంటారు అందరూ. ఇక దుమ్ము రేపే పాట ఏదైనా పాడాల్సి వస్తే.. ఇక ఆ పాట రేపే దుమ్ము అంతా ఇంతా కాదు.

.


మళ్లీ మళ్లీ వినాలిపించే పాటలు...

భానుమతిగారి వాయిస్ కొన్ని పాటలకు వాల్కొనోలా వేడి సెగలు చిమ్మితే...మరి కొన్ని పాటలకు మల్లెపూల పరిమళం మనసుకు హత్తేస్తుంది. విప్రనారాయణ చిత్రంలో ఆమె ఆలపించిన సావిరహే పాట ఎన్ని సార్లు విన్నా ... మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. భానుమతిగారి వల్లే సూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్నో వున్నాయి. 

అందులో 'మంగమ్మగారి మనవడు' చిత్రం ఒకటి. ఆ చిత్రంలో మంగమ్మ పాత్రలో భానుమతిగారు అద్భుతంగా నటించారు. ఆ పాత్ర పోషణలో తనదైన విశిష్టతను ప్రదర్శించిన ఆమె ఆ చిత్రంలో ఓ అందమైన పాటను కూడా పాడారు. శ్రీ సూర్య నారాయణణుడికి మేలుకొలుపు గీతంలా అనిపించే ఆ పాటలో భానుమతిగారి చమక్కులు ఎన్నో మనల్ని అలరిస్తాయి.

.


ఇంగ్లీష్ పాట పాడిన భానుమతి..

భానుమతిగారి పాటల్లో తెలుగు తెల్లవారి వెలుగులా దర్శనమిస్తుంది. ఎటువంటి ఉచ్ఛారణా దోషాలు లేకుండా పాటలు పాడి ఆమె తన ప్రత్యేకత చాటుకున్నారు. 'తోడు నీడా' చిత్రంలో భానుమతిగారు ఓ ఇంగ్లీష్ పాట పాడారు. తెలుగు పాటను ఎంత అందంగా పాడతారో...అంతే అందంగా ఆ ఆంగ్ల పాటను కూడా పాడి భానుమతిగారు తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. తెలుగు సినిమా ...తెలుగు పాట ఉన్నంత వరకు.. భానుమతి మన మనసుల్లో పదిలంగా వుంటారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!