నందో రాజా భవిష్యతి ' !


నందో రాజా భవిష్యతి ' అంటే ?

(సేకరణ)

.

చాలామంది ఈ శ్లోక పాదాన్ని వాడుతూ ఉంటారు. కానీ ఏ సందర్భం లో ఉపయోగించాలో, అసలు ఈ శ్లోకం ఎలా పుట్టిందో, దాని అర్ధం ఏమిటో, పూర్తి శ్లోకం ఏమిటో ఇప్పుడు వారికి కూడా తెలియక పోవచ్చు.

ఇదొక పురాణ కథ.

.

ఉత్తుంగ భుజుడు అనే రాజుకు నందుడు అనే కొడుకు ఉన్నాడు. అయితే, యితడు పుట్టిన తరువాత రాజు గారు కామావేశుడై, మరొక అందమైన వేశ్యను తెచ్చుకుని ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. భార్యా కొడుకు ను నిర్లక్ష్యం చేసాడు. వీరికి కనీసం డబ్బు, ఆహారం కూడా అందించకుండా నిరంతరం వేశ్య తోనే కాలం గడుపుతూ, ఆమెకు బోలెడంత ధనం ఇస్తున్నాడు.

రాజుగారి భార్య, కొడుకు చేతిలో చిల్లిగవ్వ లేక పేదవారుగా రాజమందిరం లోనే గడుపుతున్నారు. ఒకరోజు ఒక నగల వర్తకుడు మేలిమి ముత్యాల నగలు అమ్ముతూ రాజమందిరానికి వచ్చాడు. ఈమె ఆ నగలవంక ఆశగా చూసింది. కానీ కొనడానికి డబ్బు లేదు. ఆ విషయం గ్రహించి ఆమె పనిమనిషి ఒక సలహా ఇచ్చింది. అప్పటి భాష సంస్కృతం కాబట్టి ఆమె సలహా సంస్కృతం లో ఇచ్చింది.

"ఉత్తుంగ భుజనా శోవా

దేశకాల గతోపివా 

వేశ్యా వణి గ్వినా శోవా

నందో రాజా భవిష్యతి"

దీని అర్ధం ఏమిటంటే;;;;

"మహారాణీ, ముందు ఆ హారం కొనుక్కోండి. నెల రోజులు ఆగి డబ్బు పుచ్చుకోమని వర్తకుడికి చెప్పండి. తరువాత సంగతి తరువాత చూసుకోవచ్చు. ఈలోగా రాజు చనిపోవచ్చు. లేదా వర్తకుడు చనిపోవచ్చు.. మన నందుడు మహారాజు కావచ్చు...ఏమి చెప్పగలము?" అని.

ఆ తరువాత ఏమైంది అనేది ఇక్కడ అప్రస్తుతం.

***

పై కథ ద్వారా మనం నేర్చుకోవలసినది ఏమిటి?

సంపాదన నెలకు ఇరవై వేలు కూడా ఉండదు. అయినా సరే పదివేలు పెట్టి త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుంటారు. అప్పులు చేసి కార్లు కొంటారు. పెద్ద పెద్ద హోటల్స్ కు వెళ్తుంటారు. ఎందుకు? వీరికి భవిష్యత్తు మీద గొప్ప ఊహాగానాలు ఉంటాయి. టీవీల్లో, పేపర్స్ లో వారఫలాలు చూసుకుంటూ, ఈ వారం ధన సిద్ధి అని చెప్తే, నిజంగానే ఈ వారం లో డబ్బు వస్తుందేమో అని ముందుగానే అప్పులు చేసి అవసరం లేని వస్తువులు కూడా కొంటారు. కారు కొందాం అని భార్య అంటుంది. మన ఆదాయానికి కారు వద్దు అంటాడు మగడు. "ఏమో? ఎవరు చూసారు? రేపు మీకు ప్రమోషన్ రావచ్చు, జీతం పెరగొచ్చు, అప్పుడు ఈ అప్పు చిటికె లో తీర్చొచ్చు. అయినా అనుభవించడానికి మనకు యోగం ఉండాలి కదా" అని మూతి విరుస్తుంది ఇల్లాలు. అప్పుడు అతడు "నందో రాజా భవిష్యతి" అనుకుంటూ కారు కొంటాడు.

ఒకవేళ మనం వెనుకాడినా, మన బంధువులు, స్నేహితులు మనలను రెచ్చగొడతారు. రేపు అప్పులపాలై, కోర్టుకు వెళ్తే, ఒక్కరు కూడా మనకు ఆసరాగా రారు. కనుక బుధజనులు ఈ సత్యాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, మబ్బుల్లో నీళ్లు చూసి ముంతలు ఒలకపోసుకోకుండా అప్రమత్తులై ఉండాలి.

చివరకు ఆ ప్రమోషన్ రావచ్చు, రాకపోవొచ్చు, జీతం పెరగొచ్చు, పెరగక పోవచ్చు...ప్రమోషన్ వచ్చి, జీతం పెరిగితే ఫరవాలేదు. ఒకవేళ రాకపోతే? ఈ అప్పు ఎలా తీర్చాలి? ఇలాంటి సందిగ్ధ పరిస్థితి ఎదుర్కునే వారు ఈ శ్లోకానికి నిదర్శనాలుగా మిగిలిపోతారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!