దేవకి బిడ్డనువిడువవేడుట-మాయమింటనుండిపలుకుట! (పోతన తెలుగు భాగవతం -దశమ స్కంధము)

దేవకి బిడ్డనువిడువవేడుట-మాయమింటనుండిపలుకుట!

(పోతన తెలుగు భాగవతం -దశమ స్కంధము)

.

అక్కడ మథురలో, కారాగారంలో పసిపిల్ల కేరుకేరుమని ఏడ్చింది. ఆ శబ్దం విన్న కావలివారి విష్ణుమాయ వీడిపోడంతో వెంటనే మేల్కొన్నారు. లోపలికి తొంగి చూసారు. వెంటనే కంసుడి దగ్గరకు పరుగెట్టు కెళ్ళి, "దేవకి ప్రసవించింది. తొందరగా ర"మ్మని పిలిచారు. 

అతడు గాబరాగా మంచం దిగాడు. పసిపాపని చంపేద్దామని దగ్గర కెళ్లాడు.

.

అప్పుడు, చెల్లి దేవకి అన్న కంసుడికి అడ్డం వచ్చి ఇలా అంది.

-ఉ.

"అన్న! శమింపుమన్న! తగ దల్లుఁడు గాఁ డిది మేనగోడ లౌ

మన్నన జేయు మన్న! విను మానినిఁ జంపుట రాచపాడి గా

దన్న! సుకీర్తివై మనఁగ దన్న! మహాత్ములు పోవు త్రోవఁ బో

వన్న! భవత్సహోదరిఁ గదన్న! నినున్ శరణంబు వేడెదన్.

భావము:

"ఓ అన్నా కంసా! శాంతించవయ్యా! ఇది నిన్ను సంహరించే మేనల్లుడు అయ్యే మగపిల్లవాడు కాదు. ఈమె ఆడపిల్ల నీకు మేనకోడ లవుతుంది. ముద్దు జేయుమయ్యా! ఆడవారిని చంపుట క్షత్రియమర్యాదలకు తగిన పని కాదు కదయ్యా! కోపాన్ని చల్లార్చుకొని మహాత్ములు నడచే దారిలో నడువవయ్యా! మంచి కీర్తిమంతుడవుగా జీవించవయ్యా! నేను నీ సోదరి నయ్య! నిన్ను శరణు వేడుతున్నానయ్యా! ఈ పిల్లను వదిలెయ్యవయ్యా!

.

-క.

కట్టా; యార్గురు కొడుకులఁ

బట్టి వధించితివి; యాఁడుఁబడుచిది; కోడల్; 

నెట్టన చంపఁగ వలెనే? 

కట్టిఁడివి గదన్న! యన్న! కరుణింపఁ గదే.

భావము:

అయ్యో! ఇప్పటికే పసిబిడ్డలైన ఆరుగురు కొడుకుల్ని చంపేశావు కదయ్యా! ఇదేమో ఆడపిల్ల కదా, నీ మేనకోడలు కదా ఎందుకని చంపాలయ్యా? అన్నా! మరీ దయలేని వాడవైపోయావయ్యా! కరుణ చూపి వదిలిపెట్టవయ్యా!

-క.

పుత్రుడు నీ బ్రతుకునకును

శత్రుండని వింటిగాన సమయింపఁ దగున్; 

పుత్రులకు నోచ నైతిని

పుత్రీదానంబు జేసి పుణ్యముఁ గనవే.

భావము:

నా కొడుకు నీ ప్రాణానికి శత్రువు అని విన్నావు. అందుకు చంపేవు. సరే! నేను కొడుకుల్ని ఎలాగూ నోచుకోలేదు. కనీసం ఈ కూతుర్నైనా నాకు వదలిపెట్టి పుణ్యంకట్టకోరాదా?

.

ఆడపిల్ల కదా రక్షించుకోవచ్చు అని దేవకీదేవి భ్రాంతి పడి, విలపిస్తూ, పలవరిస్తూ పిల్లని ఎత్తుకొని గుండెలకు హత్తుకొని, జారిపోతున్న పైట సర్దుకొంటు, పాప చెక్కిలికి తన చెక్కిలి చేర్చి, పైటకొంగుతో చటుక్కున పిల్లని కప్పింది. పసిపిల్లేమో గట్టిగా ఏడిచింది. 

వాడప్పుడు రెచ్చిపోయి సిగ్గు, లజ్జ వదిలేసి చెల్లెల్ని తిట్టాడు. కన్నుమిన్ను కానని కావరంతో చిన్నారిపాప కాళ్ళు పట్టుకొని లాగాడు. పాప కెవ్వుమని ఏడ్చింది. అయినా లెక్కచేయక నేల మీదకి విసిరి కొట్టాడు. 

కాని పాప నేలమీద పడలేదు. రివ్వున ఆకాశానికి ఎగిరింది. ఆమె దేవతాపుష్పాల సువాసనలతో ఘుమఘుమలాడిపోతోంది. మణిమయ హారాలు మొదలైన ఆభరణాలతో మనోహరంగా ఉంది.

గద, శంఖం, చక్రం, పద్మం, బాణం, ధనుస్సు, ఖడ్గం, శూలం అనే ఎనిమిది ఆయుధాలు ఎనిమిది చేతులలో చక్కగా ధరించి ఉంది.

విమానాల్లో ఆకాశ మార్గంలో పయనించే సిద్దులు, చారణులు, కిన్నరలు, గంధర్వులు, గరుడులు మొదలైన దేవ గణాలు ఆమెకు కానుకలు సమర్పించి స్తోత్రాలు చేస్తున్నారు. అప్సరసలు నాట్యాలు చేస్తున్నారు. ఆ మాయాదేవి వారిని మెచ్చుకుంటూ, ఆకాశంలో కనబడి, కంసుడిని కర్కశంగా ఇలా హెచ్చరించింది.

-ఉ.

"తెంపరివై పొరిం బొరిని దేవకిబిడ్డలఁ జిన్నికుఱ్ఱలం

జంపితి వింకనైన నుపశాంతి వహింపక ఱాలమీఁద నొ

ప్పింపితి విస్సిరో! యిదియు బీరమె? నా సరసన్ జనించి నిన్

జంపెడు వీరుఁ డొక్క దెస సత్కృతి నొందెడువాడు దుర్మతీ!"

భావము:

"దుర్మార్గుడా! తెంపరితనంతో దేవకీదేవి బిడ్డలను వరసపెట్టి ఆరుగురిని వధించావు. అంతటితో శాంతించక పసిబిడ్డను ఆడపిల్లను నన్ను విసిరి కొట్టావు; ఛీ!ఛీ! ఇదేనా నీ వీరత్వం? నిన్ను చంపే మహా వీరుడు ఒకడు నాతో పాటే పుట్టి మరో చోట గొప్ప గౌరవాలు పొందుతున్నాడులే."

భావము:

ఇలా హెచ్చరించి అదృశ్యమైంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!