సినీకవుల్లో రాజర్షి !

సినీకవుల్లో రాజర్షి !


.

సినారె (1931జూలై 29-2017 జూన్12)

‘రాస్తూ రాస్తూ పోతాను సిరాయింకే వరకు

పోతూ పోతూ రాస్తాను వపువు వాడే వరకు’

అంటూ ‘ఇంటి పేరు చైతన్యం’ అనే కవితా సంపుటిలో తన సంకల్పాన్ని ప్రకటించిన డా.సి.నారాయణరెడ్డి ఆయన వయసుతో సమానమైన సంఖ్యగల గ్రంథాలను రచించారు. తన పుట్టిన రోజున ఏటా ఒక కావ్యాన్ని సాహిత్య జగత్తుకు కానుకగా అందిస్తూ తన మాటను నిలుపుకున్నారు. సి.నా.రె తన ఇతర కావ్యాలతో పాటు ఆయన ‘సినీ పాటో బయోగ్రఫీ’ని కూడా ‘పాటలో ఏముంది? నా మాటలో ఏముంది?’ అనే మకుటంతో రెండు సంపుటాలుగా ప్రచురించారు. విద్యారంగంలో అనేక అత్యున్నత పదవులలో కొనసాగుతూ సమాంతరంగా సినీరంగంలో కూడా ప్రముఖ స్థానం వహించిన సి.నా.రె సినీ గేయ రచన తనకు ఆనుషంగికమని వివిధ సందర్భాలలో చెప్పినా, నిజానికి సి.నా.రెకి జనసామాన్యంలో వచ్చిన ప్రచారానికి కారణం జనరంజకమైన ఆయన సినీ గేయాలే!

తెలుగు సాహిత్యంలో గేయరచన వందలయేళ్లుగా వున్నా గేయ కథాకావ్యాలు రచించి వాటి ద్వారా సినీ ప్రముఖుల దృష్టినాకర్షించిన ఏకైక కవి సి.నారాయణరెడ్డి మాత్రమే! సినీ రంగంలో ప్రవేశిస్తే సింహద్వారం ద్వారానే ప్రవేశించాలనే పూనికగల నారాయణరెడ్డి ఎన్‌.టి.ఆర్‌ ఆహ్వానం మేరకు ‘గులేబకావళి కథ’ (1962) చిత్రానికి అన్ని పాటలను రాసి మొదటి చిత్రంతోనే ‘సింగిల్‌కార్డ్‌’ క్రెడిట్‌ను పొందారు. అది అదృష్టం కాదు. అర్హతేనని ఆ చిత్రగీతాలకొచ్చిన ప్రాచుర్యం నిరూపించింది. అయితే చాలా మంది అభిప్రాయపడుతున్నట్టు ‘గులేబకావళి కథ’ చిత్రం కోసం ఆయన రాసిన మొదటి సినిమా పాట..

‘నన్ను దోచుకొందువటే వన్నెల దొరసానీ...’ కాదు! ‘కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై...’ అనేది! ఇది ఆయన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పిన మాట.

తెలగు సినిమా పాటల పల్లకీని నేటి వరకు మోస్తున్న బోయీలలో ప్రముఖులుగా పేర్కొన దగిన పన్నెండుగురిలో ఒకరైన సి.నా.రె సినీ గేయచరిత్రలో మూడవ తరానికి చెందిన కవి. ‘పాటలోనే నాదు ప్రాణాలు కలవ’న్న సి.నా.రె సినీ గేయసాహిత్యంలో ప్రత్యేకస్థానం పొందడానికి మూడు అంశాలు దోహదం చేశాయి. ఆయన డిగ్రీ వరకు ఉర్దూ మీడియంలో చదువుకోవడం వల్ల పట్టుబడిన ఉర్దూ గజళ్ల నడకలు, హిందీ పాటల బాణీలు సినీగేయరచనలో విలక్షణతకు, వైవిధ్యానికి దోహదం చేశాయి. పుట్టి పెరిగిన తెలంగాణలోని వేములవాడ ప్రాంతంలోని హరికథలు, పల్లెపాటలు, వీధిభాగోతాలు ఆయన సంగీతజ్ఞానాన్ని తట్టిలేపి సినిమాల్లో తెలంగాణా మాండలిక గీతాల్ని రాయించాయి. అధ్యాపక వృత్తిలో అలవడిన ప్రాచీనకావ్య పరిజ్ఞానం, పదసంపద, అలంకార ప్రియత్వం ఆయన కలం నుంచి రసరమ్య గీతాలు వెలువడేలా చేశాయి. ఈ అంశాలను సోదాహరణంగా పరిశీలిద్దాం.

బార్‌ బార్‌ దేఖో, హజార్‌ బార్‌ దేఖో

ఎంత వారు గాని వేదాంతులైన గాని

వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్‌ కైపులో...(భలే తమ్ముడు)

యారి మేరీ జిందగీ, యారి మేరీ జిందగీ

స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం (నిప్పులాంటి మనిషి)

ఇలాంటి ఎన్నో పాటలను హిందీ బాణీలననుసరిస్తూ, తెలుగు నుడికారాన్ని కాపాడుతూ అసిధారావ్రతంలా రచించారు సి.నా.రె. తెలుగులో ‘కవాలీ’లను, ‘జావళీ’లను కూడా కలకాలం గుర్తుండిపోయేలా రాయగలగడానికి కూడా హిందీ, ఉర్దూ భాషల మీద ఆయనకున్న పట్టే కారణం.

‘ఎంతటి రసికుడవో తెలిసెరా

నీవెంతటి రసికుడవో తెలిసెరా’ (ముత్యాలముగ్గు)

‘సరిసరీ, వగలు తెలిసెర గడసరీ

చిగురు సొగసులు నీవే లేరా’ (భక్తతుకారాం)

వంటి అద్భుతమైన జావళీలు సి.నా.రెను చిరకాలం స్మరింపచేస్తాయి. చిన్నతనం నుంచి తనను ఆకట్టుకున్న తెలంగాణ పలుకుబళ్లను పాటలలో పొదిగి సి.నా.రె తన మాండలికం మీద ప్రత్యేకాభిమానాన్ని చాటుకున్నారు.

‘గోగులు పూచె గోగులు కాచె

ఓ లచ్చ గుమ్మడి’ (ముత్యాలముగ్గు)

‘చిగురేసె మొగ్గేసే సొగసంతా పూతపూసె

చెయ్యైనా వెయ్యావేమి? ఓ బాపు దొర

చెయ్యైనా వెయ్యవేమి? (ఆలుమగలు)

‘ఓ ముత్యాలరెమ్మ, మురిపాల కొమ్మ’ (ఒసేయ్‌ రాములమ్మ)

ఇలా మాండలిక గీతాల రచనతో పాటు, ‘అమ్మక చెల్ల’, ‘ఛాంగురే’, ‘మగరేడు’, ‘మచ్చెకంటి’, ‘మజ్జారే’ మొదలైన ప్రాచీన పదాలను ‘పిండి వెన్నెల’, ‘పూల రుతువు’, ‘మల్లెలవాడ’, ‘నీలికన్నుల నీడలు’ వంటి అందమైన పదబంధాలను కూర్చి సినిమా భాషకు కొత్త సొగసలు అద్దిన ఘనత సి.నా.రె దే!

సముద్రాల ద్వయం, మల్లాది మొదలైన మొదటి తరం సినీకవులు సంస్కృత సమాసాలను పౌరాణిక చిత్రగేయాలలో గుప్పించి ఒప్పించగా సి.నా.రె సాంఘిక చిత్రాలలో కూడా అలాంటి ప్రయోగాలను చేసి జనాన్ని మెప్పించారు.

చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన

కర కంకణములు గలగలలాడగ (చెల్లెలి కాపురం)

శివరంజనీ నవరాగిణీ...(తూర్పు పడమర)

సంగీత సాహిత్య సమలంకృతే (స్వాతికిరణం-పూర్తిగా సంస్కృతంలో)

వంశీకృష్ణా యదు వంశీకృష్ణా...(వంశవృక్షం)

వంటివి సి.నా.రె శబ్దాధికారానికి మచ్చుతునకలు. తెలుగు సినీరంగంలో ఎక్కువ మంది సంగీత దర్శకులతో పనిచేసిన ఘనత తనకే దక్కుతుందని సి.నా.రె స్వయంగా చెప్పుకొన్నారు. సంగీత సాహిత్యాలలో అపరిమితమైన పరిజ్ఞానం గల సి.నా.రెను సినీ వాగ్గేయకారుడనడం అతిశయోక్తి కాదు.

వటపత్రశాయికి వరహాలలాలి (స్వాతిముత్యం)

ముద్దుల మా బాబు నిద్దురోతున్నాడు (జీవనజ్యోతి)

వస్తాడు నారాజు ఈరోజు (అల్లూరి సీతారామరాజు)

వంటివి ఆయన పదలాలిత్యానికి, భావసౌకుమార్యానికి ఉదాహరణలు. సి.నా.రెకు సుదీర్ఘమైన అధ్యాపకవృత్తివల్ల అలవడిన అలంకార ప్రీతి ఆయన సినిమా పాటల్లోనూ కనిపిస్తుంది. అర్థాలంకారాలలో ఉత్తరాలంకారం (ప్రశ్న-సమాధానాలు), శబ్దాలంకారరాలలో అంత్యానుప్రాస ఆయనకు అమితమైన ఇష్టమనడానికి ఉదాహరణలు కోకొల్లలు. సినీగేయరచనలో కవికి సంపూర్ణ స్వేచ్ఛ లేకపోయినా అవకాశాలు లభించినపుడు సామాజిక బాధ్యతను విస్మరించని కొద్దిమంది కవులలో సి.నా.రె ఒకరు.

చదువురాని వాడవనీ దిగులు చెందకు (ఆత్మబంధువు)

గోరంతదీపం కొండంత వెలుగు (గోరంతదీపం)

పుట్టిన రోజు పండగే అందరికి (జీవనతరంగాలు)

వంటి సూక్తులు, హితోక్తులు...

వందేమాతరగీతం వరస మారుతున్నది (వందేమాతరం)

నా దేశం భగవద్గీత అగ్ని పునీత సీత (బంగారుమనిషి)

వంటి ఆర్తగీతాలు...సి.నా.రె సామాజిక స్పృహకు నిదర్శనాలు.

అవార్డులు, రివార్డుల పట్ల సి.నా.రె నిరాసక్తతకు నిదర్శనం ఆయన ఎన్నో ప్రభుత్వ పదవులను నిర్వహించి కూడా సినీ పాటలకు రెండేసార్లు నంది పురస్కారాలను అందుకోవడం, జాతీయ పురస్కారాలను ఆశించకపోవడం. భావానికి తేనెలు, భాషకు పరిమళాలు అద్ది తెలుగు సినిమా పాటను స్వరరాగ పదయోగ సమభూషితంగా తీర్చిదిద్దిన రాజర్షి సి.నారాయణరెడ్డి ముద్ర తెలుగు సినిమా పాట చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు. ఆయన మూర్తి, కీర్తి ఎంతటి రాజస విరాజమానాలో, ఆయన పాట, బాట అంతటి రసరమ్య సమన్వితాలు.

.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!