కవుల రైలు-రచన: దేవరకొండ బాలగంగాధర తిలక్

తిలక్ కథలు!- - - -(సేకరణ)

కవుల రైలు-రచన: దేవరకొండ బాలగంగాధర తిలక్

-

తెలుగుదేశం కవులతో నిండి మూడవతరగతి రైలు పెట్టె లాగ క్రిక్కిరిసిపోయింది. “ఇంక జాగా లేదు” అని కేకలేస్తున్నా వినిపించుకోక చవకగా అమ్మే టిక్కెట్లు కొనుక్కొని కొత్త కవులు తోసుకు లోపలి కెగబడుతున్నారు. కొందరు ఫుట్‌బోర్డుల మీద నిలబడీ, కొందరు కమ్మీలు పట్టుకుని వేలాడుతున్నారు.

-

ఒకావిడ మేలిముసుగు వేసుకుని వచ్చింది. సుతారంగా అందంగా వుంది. కళ్ళల్లో అపూర్వమైన వెలుగు. ఎర్రని పెదవుల్లో తియ్యని సిగ్గు వొంపులు. వెన్నెలనీ, ఉషఃకాంతినీ, మల్లెపువ్వుల్నీ, మంచిగంధాన్నీ, రత్నాలనీ కలబోసి మనమీద జల్లినట్లు అనిపిస్తుంది ఆవిడను చూస్తే.. అక్కడ దగ్గరలో నిలుచుంటే…

-

ఆవిడ నిస్పృహగా చూసింది రైలుపెట్టె కేసి. లోపలి బొగ్గు పులుసు గాలీ, చుట్టపొగా వాగుడూ కలసి పెట్టెలోంచి బయటకి దుర్భరంగా వ్యాపిస్తున్నాయి.

-

“ఇక్కడ చోటులేదు దయచేయవమ్మా. నువ్వు కూడానా మా ఖర్మ” వగలొలకబోసుకుంటూ అన్నాడొక చుట్ట ఆసామీ కాండ్రించి ఉమ్మివేస్తూ. ఆయన కవి శార్దూల బిరుదాంకితుడు. అప్పకవీయం అడ్డంగా బట్టీ వేశాడు.

-

“నో ప్లేస్ మేడం వెరీసారీ” అంటూ కన్ను గీటాడొక నవయువకుడు గాగుల్సు తీసి, సెకండ్‌హాండ్ బీడీ నోట్లో ఉంచుకునే.

-

కొందరు వెకిలిగా నవ్వారు. కొందరు దగ్గారు. మరికొందరు ఈలలు వేశారు. పాపం ఆవిడ వెనక్కి తిరిగి జాలిగా వెళ్ళిపోయింది. రైలు కదిలిపోయింది. స్టేషన్‌మేష్టర్ వచ్చి ఆమెను చూచి “పాపం చోటు లేదా అమ్మా, నీ పేరు?” అని అడిగాడు.

“కవిత” అందా సుందరి.

=

కవుల రైలు గమ్యం తెలీకుండా వడివడిగా వెళ్ళిపోతోంది.

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!