జగన్మోహిని అమృతము పంచుట !

జగన్మోహిని అమృతము పంచుట !

( జాఱించు; జా ఱించి, లొలయించు; నొలయించి, . . అంటూ పూర్వపాదాంత పదాన్ని గ్రహించి, ఉత్తరపాదం ఆరంభించడం ప్రయోగిస్తూ, ముక్తపదగ్రస్త అలంకారాన్ని అత్యద్భుతంగా మథురాతి మథురంగా ప్రయోగించిన మన పోతన్న గారికి శతకోటి పాదాభివందనాలు.)

-

-సీ.

'పాలిండ్లపై నున్న పయ్యెద జాఱించు; 

జాఱించి మెల్లన చక్క నొత్తు

దళ్కు దళ్కను గండఫలకంబు లొలయించు; 

నొలయించి కెంగేల నుజ్జగించుఁ

గటు మెఱుంగులు వాఱు కడకన్ను లల్లార్చు; 

నల్లార్చి ఱెప్పల నండఁ గొలుపు

సవరని దరహాస చంద్రికఁ జిలికించుఁ; 

జిలకించి కెమ్మోవిఁ జిక్కుపఱచు-

-తే.

'దళిత ధమ్మిల్ల కుసుమ గంధమ్ము నెఱపుఁ

గంకణాది ఝణంకృతుల్ గడలు కొలుపు

నొడలి కాంతులు పట్టులే కులుకఁ బాఱు

సన్నవలిపంపుఁ బయ్యెద చౌకళింప.!

భావము:

పైటకొంగును వక్షోజాలపైనుండి జార్చి, మెల్లగా సర్దుకుంటోంది. 

తళతళ మెరుస్తున్న చెక్కిళ్ళను చేతిపై చేర్చి మరల వదిలివేస్తోంది. జిగేలుమని మెరుస్తున్న కడగంటి చూపులను ప్రసరించి, మళ్ళీ కనురెప్పలు మూస్తోంది. అందంగా చిరునవ్వులు చిలకరించి, ఎర్రని పెదవుని మెలిపెడుతోంది, కొప్పులోని వికసించిన పూలపరిమళాలు వ్యాపింపజేసి, కంకణాదులను మ్రోగేలా చేస్తోంది. నిలకడ లేకుండా మెలగుతూ నెమ్మేని కాంతులను పొంగిపొరలేలా చేస్తూ, పల్చగా ఉన్న తెల్లని పైటను ఆడిస్తోంది. 

కాంతులను పొంగిపొరలేలా చేస్తూ , పల్చగా ఉన్న తెల్లని పైటను ఆడిస్తోంది. 

జాఱించు; జా ఱించి, లొలయించు; నొలయించి, . . అంటూ

పూర్వపాదాంత పదాన్ని గ్రహించి, ఉత్తరపాదం ఆరంభించడం ప్రయోగిస్తూ, ముక్తపదగ్రస్త అలంకారాన్ని అత్యద్భుతంగా మథురాతి మథురంగా ప్రయోగించిన మా పోతన్న గారికి శతకోటి పాదాభివందనాలు . . .

ఇలా ఆ మాయలమారి జవరాలు, జగత్తుని మోహింపజేసే దేవతలాగ ఒప్పి ఉండి, తన అందమైన ముఖ సుగంధానికి ఆకర్షితమై ముసురుతున్న తుమ్మెదలను అదలిస్తూ, మురిసిపోతూ, చిగురాకుల పొదల వెంట సంచరిస్తున్న ఆమెను అసుర వీరులు చూసి, మోహంలో పడిపోయి, ఆమెతో ఇలా అనసాగారు. . . . . .

-

“ఓ కమలాల వంటి కన్నులున్న కోమలాంగీ! చక్కదనాల జవరాలా! ఓ వన్నెలాడీ! ఏమి లావణ్యం! ఏమి మాధుర్యం! ఎక్కడి నుండి వచ్చావు? ఏమి కావాలి? నీ పేరేమిటి? గంధర్వ, సిద్ధ, దేవత, రాక్షస, చారణ, మానవ కన్యలలో ఎవరి యందూ నీ అంత అందచందాలు లేవు. నీ మిక్కిలి ప్రియమైన మనసుకీ, అవయవాలకూ నిండుదనం సమకూర్చిన బ్రహ్మదేవుడు నిన్ను ప్రీతితో సృష్టించాడు కాబోలు! మేము కశ్యపుని సంతతి వారము, దేవతలకు సోదరులము. ఎదురులేని పౌరుషం కలవారము. ఒకే ప్రయోజనాన్ని ఆశించి శ్రమించి సంపాదించిన ఈ పదార్థాన్ని పంచుకోడంలో జ్ఞాతులమైన మాలో మాకు పంపకాలు కుదరటం లేదు. నువ్వు పంచు అనిరి .

-

ఆ మాయా మోహిని చూపులకు కరిగిపోయిన రాక్షసులు “ఈ మగువ మనకూ, దేవతలకూ తేడాలేకుండా పంచిపెడతాను అని పూనుకుంది కదా. అలా చేయకుండా మాట తప్పుతుందా. లేదు అలా తప్పదు. కానీ, మనం సాహసించి రమ్మని పిలిస్తే బదులు పలకదేమో! తిరిగి చూడదేమో! స్తనద్వయం మీద పైట కప్పేసుకుంటుందేమో! మరోమాట కలిపితే కంగారుపడి వెనకడుగు వేస్తుందేమో! మన యందు అలుగుతుందేమో! మన మీద చూపుతున్న విశ్వాసం చెడుతుందేమో!” అనుకుంటూ, జంకుతూ గొంకుతూ, ఊరకే ఉండిపోయారు తప్పించి “సుందరీ! తొందరగా తీసుకురా!” అని పిలవలేకపోయారు.

.

రాహువు దేవతలలో రహస్యంగా కలిసిపోయి దేవతల రూపు ధరించి అమృతం తాగుతుండగా సూర్యచంద్రులు చూసారు. చూసి మోహినికి సైగలు చేసారు. వెంటనే విష్ణువు చక్రాయుధంతో రాహువు తల ఖండించాడు. అమృతం ఆనటం వలన, రాహువు తల నిర్జీవం కాలేదు. అమరత్వం పొందింది. మొండెం నేలపై కూలిపోయింది.

.

అలా అమరత్వం పొందిన రాహువు శిరస్సును బ్రహ్మదేవుడు గౌరవించి గ్రహంగా చేసి ఆకాశంలో నిలబెట్టాడు. రాహుగ్రహం ఆ పగను వదలకుండా, అమావాస్య, పూర్ణిమలలో సూర్య చంద్రులను నేటికీ పట్టుకుంటోంది.

.

విష్ణు మూర్తి ఒక్క చుక్క కూడా రాక్షసులకు మిగల్చకుండా, అమృతమంతా దేవతకు బాహాటంగా పోసి, మోహినీ రూపాన్ని వదలిపెట్టి నిజాకారాన్ని ధరించాడు. ఇదంతా చూస్తున్న రాక్షస వీరులు దుఃఖించారు.

.

దేవతలూ, రాక్షసులూ సరిసమానమైన సంకల్పమూ, శక్తీ, బలమూ, తెలివీ, ధనమూ, ఆత్మగౌరవమూ ఉన్నవారే. కానీ ఇద్దరికి రెండు రకాలైన ఫలితాలు అందాయి. దేవతలు శుభాలను పొందారు. విష్ణువును ఆశ్రయించని కారణంచేత రాక్షసులు శుభాలను పొందకుండా అనేక దుఃఖాలపాలయ్యారు. అవును, విష్ణువును శరణు వేడని వారు శుభాలు పొందలేరు కదా!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!