ప్రముఖుల గురించి రమణగారి మాటల్లో!! -


-

ప్రముఖుల గురించి రమణగారి మాటల్లో!!

-

అమరావతి కథల గురించి చెప్తూ...

'అమరావతి కథలు ప్రేమతో, భక్తితో, ఆవేశంతో సత్యంగారి హృదయం లోంచి ఉప్పొంగాయి. జలపాతంలా ఉరికాయి. బాలకృష్ణవేణిలా పరిగెత్తాయి. స్వామి కోవెల దగ్గర కృష్ణలా భయభక్తులతో తలవంచుకుని నడిచాయి' అన్నారు.

సాలూరి రాజేశ్వరరావుగారి గురించి....

'నిఘంటువులో 'శ్రావ్యసంగీతం' అనే మాటకి అర్థం రాయటానికి మాటలు వెతికి చేర్చేబదులు రాజేశ్వరరావు అని టూకీగా రాస్తే చాలు'.

యెస్.వి.రంగారావు గురించి....

'వెండితెరకి రాకుంటే రంగారావు ఏం చేసేవాడు? ఎప్పుడో అప్పుడు ఝామ్మని వచ్చేసేవాడు, అందుకు సందేహమేమిటి'!

కె.వి.రెడ్డి గురించి.....

కృతకమైన సాంఘికం కన్నా సహజమైన జానపదం లక్షరెట్లు మెరుగు. కె.వి. దగ్గర ఉంటే పది లక్షలు మెరుగు. దైవమిచ్చిన జానపదానికి మకుటంలేని రాజు కె.వి.

భానుమతి గురించి.....

'చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షర క్రమాన పేర్లు ఎన్నికచేస్తే 'బి' శీర్హిక కింద బహుముఖ ప్రఙ్ఞావతి భానుమతి పేరు చేరుతుంది'

-

ముళ్ళపూడి వారు రచయితల మీద వేసిన జోకు:

'నా కొత్త నవల మీద పత్రికలో విమర్శ వేయించండి' అంటూ రచయిత ఒక పుస్తకం అందించాడు. పుస్తకం బాగా నలిగి చిరిగిపోయింది.

'పబ్లిషర్ నాకు ఒక్కటే కాపీ ఇచ్చాడండీ, మా అబ్బాయి దాన్ని నలిపి చింపేశాడు, మరోలా అనుకోకండి,' అన్నాడు రచయిత.

'అయితే ఇంకా విమర్శ ఎందుకు? మీ అబ్బాయి అభిప్రాయం తెలుస్తూనే ఉందిగా' అన్నాడు సంపాదకుడు.

-

బుడుగుతో టీచరు చెప్పింది.

“నువ్వొక బిల్ గేట్స్ అంత ధనవంతుడివి అనుకో. అనుకుని నీ జీవిత చరిత్ర రాయి”

బుడుగు ఉలుకూ పలుకూ లేకుండా కూచోవడం చూసి ఎందుకు రాయడం లేదని అడిగింది.

“నా సెక్రెటరీ కోసం చూస్తున్నాను” బుడుగు జవాబు చెప్పాడు.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!