సాటిలేని వేదాంతి - గార్గి!!

-

సాటిలేని వేదాంతి - గార్గి!!

-

వేదకాలం నుంచీ కూడా భరతవర్షం మీద ఆడవారంటే పక్షపాత ధోరణి ఉందంటూ చాలామంది ఆరోపిస్తుంటారు. కానీ ఆడవారి పట్ల వివక్ష కొత్తగా పుట్టుకువచ్చిందే కానీ వేదకాలంలో ఇలాంటి ధోరణులు లేవన్నది ధార్మికుల మాట. అందుకు ఉదాహరణగా గార్గి పేరు ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. వేదాలు స్త్రీలు అభ్యసించకూడదనీ, అసలు వినకూడదనీ ఎలాంటి నిబంధనా లేదనీ... అందుకు గార్గి జీవితమే సాక్ష్యమనీ చెబుతుంటారు.

గార్గి, వచక్నుడు అనే రుషి కుమార్తె. వచక్నుడు సకలశాస్త్ర పారంగతుడు. వేదాధ్యయన తత్పరుడు. ఆయన ఇంట్లో పెరుగుతున్న గార్గికి సహజంగానే వేదాలంటే మక్కువ ఏర్పడింది. వాటిని అభ్యసించేందుకు పురుషులతో సమానంగా ఉపనయం చేసుకుంది. ఒకో శాస్త్రాన్నే ఔపోసన పట్టసాగింది. వాటిలో నిష్ణాతురాలై ఏకంగా ‘బ్రహ్మవాదిని’ అన్న బిరుదుని సాధించింది.

గార్గి గురించిన ప్రస్తావన బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందులో జనకుని సభలో యాజ్ఞవల్య్క రుషిని ఆమె ముప్పుతిప్పలు పెట్టిన విధం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. జనకుడు బ్రహ్మ జ్ఞానంలో సాటిలేని వ్యక్తికి వేయి గోవులను బహుమతిగా ఇస్తాననీ, ఆ గోవుల కొమ్ములన్నింటికీ కూడా బంగారు తాపడం చేయిస్తాననీ చాటింపు వేస్తాడు. ఆ మాటని విని చాలామంది రుషులు జనకుని కొలువుకి చేరుకుంటారు. వారితో పాటుగా మహా జ్ఞాని అయిన యాజ్ఞావల్క్యుడు కూడా చేరుకుంటాడు. యాజ్ఞావల్క్యుని మేధస్సు ముందు ఎవరూ సాటి నిలవలేకపోతారు.

ఇక యాజ్ఞావల్క్యునికి తిరుగులేదు అనుకుంటున్న దశలో, గార్గి తన ప్రశ్నల పరంపరను ఆరంభిస్తుంది. ఒక దశలో ఆ ప్రశ్నలకు తట్టుకోలేని యాజ్ఞావల్క్యుడు ‘‘బ్రహ్మ గురించి మరింత లోతుగా ప్రశ్నించడం మంచిది కాదు! అలా చేస్తే నీ తల పగిలిపోగలదు,’’ అని హెచ్చరిస్తాడు. అప్పటితో శాంతిస్తుంది గార్గి. ఒకరకంగా ఇది ఆమె విజయమనే చెప్పుకోవచ్చు. అంటే బ్రహ్మజ్ఞానంలో పురుషులను సైతం ఆమె ఓడించిందన్నమాట!

జనకుని కొలువులోని నవరత్నాలలో ఒకరైన గార్గి, ఆజన్మబ్రహ్మచారిణిగా ఉండిపోయిందని అంటారు. మరికొన్ని చోట్ల మాత్రం ఆమె లోకరీతిని అనుసరించి గృహస్థ ధర్మాన్ని నెరవేర్చేందుకు శృంగవంతుడు అనే మునిని వివాహం చేసుకుందని కనిపిస్తుంది. అయితే ఆ వివాహం కేవలం ఆచారం కోసమే కాబట్టి, పెళ్లి చేసుకున్న మర్నాడే సన్యాసదీక్షను స్వీకరిస్తాననే షరతు మీద వివాహం చేసుకుందట. ఆ షరుతని అనుసరిస్తూ నిజంగానే పెళ్లయిన రెండో రోజు సన్యాసినిగా మారిపోయింది. అటుతర్వాత తీవ్రమైన తపస్సులో మునిగి, తాన నేర్చుకున్న బ్రహ్మవిద్య లోతులను ప్రత్యక్షంగా అనుభవించింది. రుగ్వేదంలోని కొన్ని రుక్కులకు కూడా గార్గి ద్రష్ట అని చెబుతారు.

రుగ్వేదకాలం నాటి వేదాంతుల జీవితాల గురించి మనకి తెలిసింది చాలా తక్కువ. అలా గార్గి గురించి కూడా చాలా తక్కువ సమాచారమే లభిస్తోంది. అయితేనేం! మగవారికి దీటుగా తనదైన ముద్ర వేసుకున్న వేదాంతిగా ఆమె హైందవ ధర్మంలో నిలిచిపోయింది.

--

మహాతల్లి గార్గి వేదకాలం నాటిదైనందున ఇంతకన్నా ఎక్కువ వివరాలు దొరకడం లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.

--

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!