అమ్మా! మన్ను దినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో? /పోతన గారి పద్యం.....బాపుగారి చిత్రం...కామేశ్వర రావు భైరవభట్ల గారి విశ్లేషణ.

పోతన గారి పద్యం.....బాపుగారి చిత్రం...కామేశ్వర రావు భైరవభట్ల గారి విశ్లేషణ.
.
అమ్మా! మన్ను దినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో?
నమ్మం జూడకు వీరి మాటలు మది;న్నన్నీవు కొట్టంగ వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీ యాస్య గం
ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.
.
.కృష్ణుడు మన్నుతిన్నాడని బలరాముడు యశోదకి ఫిర్యాదు చేస్తాడు. అప్పుడావిడ కృష్ణుణ్ణి పట్టుకొని ఎందుకలా చేసావని నిలదీస్తుంది. ఈ సందర్భంలో బాలకృష్ణుడేమంటాడు?

నాహం భక్షితవాన్ అంబ
సర్వే మిథ్యాభిశంసినః
యది సత్య-గిరస్ తర్హి
సమక్షం పశ్య మె ముఖం
"నేను తినలేదమ్మా. అంతా నా మీద తప్పుడు నేరం మోపుతున్నారు. అది నిజమని నువ్వనుకుంటే, నువ్వే, నీ కళ్ళతో నా నోరు చూడు."
ఇదీ సంస్కృతంలో వ్యాసులవారు చెప్పించిన మాటలు. ఈ మాటలని తెలుగు పద్యంలో పెట్టాలి. మామూలు కవులైతే ఏ తేటగీతి పద్యమో తీసుకొని సులువుగా నడిపించేస్తారు. పోతన మామూలు కవి కాదు కదా! పోతన కృష్ణుడు తెలుగు కృష్ణుడు, కాస్త చిలిపి గడుసు కృష్ణుడు. "అమ్మా, మన్ను తినడానికి నేనేమైనా చిన్నపిల్లాడినా!" అని మొదలుపెట్టాడు! ఒక చిన్న పిల్లవాడు "నేనేమైనా చిన్నపిల్లాడిననుకుంటున్నారా?" అని అంటే ఎంత మురిసిపోతాం!
ఆకొంటినో - ఆకలితో ఉన్నానా, అచ్చ తెలుగు మాట. "కొట్టంగ" ఇదీ అంతే. "దండింపుమీ" అనలేదు, "దండింపవే" అన్నాడు. అది పిల్లాడికి తల్లి దగ్గరున్న చనువుని ధ్వనిస్తుంది. చివరిన "మదీయాస్య గంధమ్మాఘ్రాణము సేసి" అన్నాడు.
మదీయ - నా, ఆస్యము - నోరు, గంధము - వాసన, ఆఘ్రాణము సేసి - వాసన చూసి
ఇంత పెద్ద సమాసం మరి చిన్నికృష్ణుని నోటి నుండి రావడం సమంజసమేనా? ఎలాటి నోరది? మొత్తం విశ్వాన్నంతటినీ అందులో చూపించబోతున్నాడు! దానికిది సూచన. యశోదని సిద్ధం చేయడానికి. అసలు యశోదకీ విశ్వరూప సందర్శనం ఎందుకు? అదే కృష్ణుని అవతార లక్షణం. రామావతారానికీ కృష్ణావతారానికీ ఉన్న తేడా. రాముడికి తను అవతారపురుషుడినన్న జ్ఞానం పూర్తిగా లేదు, ఉన్నా మనకి కనిపించదు, ఇతరులకీ తెలియదు. కృష్ణుడికా జ్ఞానం ఉంది. ఇతరులకది కలిగించడానికి అతను వెనుకాడడు. తన మీద కంసుడు రాక్షసులని పంపించడం మొదలుపెట్టాడు, తాను ఎదుర్కొంటున్నాడు. ఇదంతా యశోద తట్టుకోలేదు, తల్లిగా. నందుడికి కృష్ణావతారం గురించి వినికిడివల్ల కొంత తెలుసు. యశోదకి తెలీదు, తెలిసినా నమ్మక పోవొచ్చు. అందుకే స్వయంగా చూపించాడు. అయితే మళ్ళీ ఆమెకి మఱపు కలిగించాడు! లేదంటే ఆవిడ తల్లిగా తనని సాకలేదు కదా! అంతరాంతరాల్లో ఆ జ్ఞానం ఉంటుంది, అది చాలు.
ఇంతకీ ఆ పెద్ద సమాసం ప్రాస కోసం వేసాడు అని అనుకోడానికి ఆస్కారం లేకపోలేదు. అయినా అది ఎంతవరకూ అక్కడ అతికిందనేది ముఖ్యం. ఒకోసారి యతి ప్రాసలు పద్యానికిలాటి ప్రత్యేకతను, అధిక శోభను కలగించే ప్రయోగాలని స్ఫురింపచేస్తాయి!
ప్రాస స్థానంలో కొత్త పదం ప్రారంభమైనప్పుడుండే విరుపులో ఒక సొగసుంటుంది. ముందరి పదంతో సంధి కలిసినప్పుడు మరింత సొగసు! చదివితేనే తెలుస్తుంది. ఇలాటి సొగసులు తెలుగు పద్యలకే సొంతం!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!