_చందమామ కథ :మా అమ్మ పేపరు చదవటం.!

_చందమామ కథ :మా అమ్మ పేపరు చదవటం.!
(చాకిరీ చేసే అమ్మా, ఇంటిల్లిపాదినీ బయటపనులకు తయారు చేసి పంపే అమ్మా, పేపరు చదువుతూ, చదువుతూ అలానే నిద్రపోయే అమ్మా.. నువ్వు చదువుతూనే నిద్రపోవే అమ్మా! ఈ ప్రపంచం ఏమీ మునిగిపోదు.
అమ్మ గొప్పతనాన్ని, అమ్మతనం లోని విలువను మరోసారి గుర్తుకు తెచ్చిన చందమామ అలనాటి కథకు జోహార్లు.)
ఆ అలనాటి అపురూప కథ పూర్తి పాఠాన్ని ఇక్కడ చదవండి.
మా అమ్మ పేపరు చదవటం
మా అమ్మ సాయంత్రం పూట పేపరు ఎలా చదువుతుందో ఎప్పుడైనా చూశారూ? ఏ సంగతి మరిచినా అమ్మ పేపరు చదవడం మాత్రం మరవదు. పాపం, ఇంటిపనంతా ముగించుకుని అమ్మ హాల్లోకి వచ్చేసరికి పేపరు పేజీలన్నీ ఒక్క చోటున ఉండవు. నాలుగు వేపులా నాలుగు కాగితాలూ ఇంట్లో పడి ఉంటాయి. మేడమీద అన్నయ్య చదివి అక్కడే పారేసిన మొదటి పేజీ, అక్కయ్య చదివిన మధ్యపేజీ, ఇవన్నీ ఏరుకుని వచ్చి అమ్మ పడుకుని చదవడానికని ఆసక్తితో పరుపుమీదకు వెళుతుంది.
అమ్మకప్పుడు జ్ఞాపకమొస్తుంంది. తన కళ్లద్దాలు మరచిపోయనట్లు. వాటికోసరం ఇల్లంతా వెతుకుతుంది. ఇటు అటు ఇల్లంతా ఒక పదిహేను నిమిషాలు గాలించిన తర్వాత అమ్మకు అప్పుడు జ్ఞాపకమొస్తుంది ఎక్కడుంచిందీ, ఎలాగో కళ్లద్దాల పెట్టె దొరుకుతుంది. కాని, అది తీసి చూసేసరికి అందులో కళ్లద్దాలు ఉండవు. మళ్లీ ఐదు నిమిషాలు గాలించుతే కళ్లద్దాలు దొరుకుతాయి. ఆఖరుకి పరుపు దగ్గిరికి వెళితే, పేపర్లు ఏవి! ఇక్కడే పెట్టానే అనుకుంటుంది.
కొంత సేవు వెతికిన తర్వాత కళ్లద్దాల కోసం వెళ్లేముందు ఆ పేపర్లు తలగడ కిందనే పెట్టానని అప్పుడు జ్ఞాపకమొస్తుంది. ఇన్ని బాధలు పడి. ఎలాగో పేపరు చదవడానికి మొదలు పెడుతుంది. ఒక్క ఘడియ చదువుతుందో లేదో చేతిలో పేపరూ, ముక్కుమీద కళ్లద్దాలూ పెట్టుకుని హాయిగా నిద్రపోతుంది.
ఇంతలో మానాన్న వస్తారు. మమ్మల్ని అందరినీ పిలిచి, ఒక్కసారిలా వచ్చి చూడండి, అంటారు ఆ దృశ్యం చూసేసరికి మాకు నవ్వాగదు. ఇంతకూ అసలా పేపరు ఆ రోజుదే కాదు. నిన్నటిదో, మొన్నటిదో తారీకు చూడకుండానే అమ్మ అంత ఆసక్తితో పాత పేపర్లే చదివేస్తూ ఉంటుంది.
అన్నిటికంటే ముఖ్యమైన విష యం ఏమిటంటే, ఆ మర్నాడు అమ్మ మాతో పేపర్లో ఉండే వింతలూ, విశేషాలూ, వార్తలూ చక్కా పూసగుచ్చినట్లు చెపుతుంది. మరి ఎలా చెప్పగలుగుతుంమదో ఏమో..!
-లంకలపల్లి లక్ష్మీబాయి – వాల్తేరు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!