కోతికొమ్మచ్చి... ఆడితే అప్పచ్చి..!!




.
                                                            కోతికొమ్మచ్చి... ఆడితే అప్పచ్చి..!!
"పొద్దున్నే ఈ వెధవ ట్యూషన్ కనిపెట్టినవాడిని చంపెయ్యాలి!", అని ఏడ్చుకుంటూ, కాళ్ళీడ్చుకుంటూ బయల్దేరాను. అప్పుడు నా వయస్సు ఆరేడేళ్ళు వుంటాయ్ అనుకుంటా. ఇంటి పక్కనే, మా స్కూలు పంతులమ్మ ఒకావిడ పాఠాలు చెప్పేవారు. చాలా మంచావిడ. కాకపొతే కొంచెం ఆలస్యం ఐనా, మార్కులు తక్కువ వచ్చినా చంపేస్తారు. పొద్దున్నే అమ్మ ఎలాగో తన్ని నిద్ర లేపి పంపిస్తుంది, మళ్ళీ తన్నులు తినాలి అంటేనే కొంచెం బాధ. అది కూడా అమ్మాయిల ముందు! ఛీ.. ఛీ.. పరువు పోతుంది. 'ఏదో చిన్నపిల్లోడు, ఇంత పొద్దున్నే ఎలా వస్తాడు?', అని వదిలెయ్యొచ్చుగా! బాగా తంతారు, దానికి తోడు మిగతా పిల్ల రాక్షసులు పొద్దున్నే తగలెడతారు. వాళ్ళతో పోలిక ఒకటి. బతుకు నరకం అయిపోయింది. తొందరగా పెద్దోళ్ళం అయిపోతే ఈ బాధ నుంచి విముక్తి దొరుకుతుంది.
'ఇలా వారం అంతా గడిచిపోతుంది. పొద్దున్నే లేవటం, ట్యూషన్ కి వెళ్ళటం! అక్కడినుండి రాగానే స్కూలు! ఛీ! వెధవ బ్రతుకు ఎన్నాళ్ళు చదవాలో ఏంటో!', అనుకుంటుంటే వారాంతం వచ్చేది. వుండేది ఒక్క రోజు, కనీసం ఆ రోజు ఆడుకుందాం అంటే వచ్చే వారం నుంచి ఆ వేళ కూడా ట్యూషన్ పెడుతున్నారు. అర్థవార్షిక పరీక్షలు వస్తున్నాయి కదా! లాభం లేదు ఏదో ఒకటి చేసి ఆ వేళ ట్యూషన్ ఎగ్గొట్టాలి అని నిర్ణయించుకున్నా! పైగా ఆ వేళ లవుకాంత్ (నా స్నేహితుడు, వాళ్ళ అమ్మానాన్నల్ది ప్రేమపెళ్ళి గుర్తుగా వాడికి ఆ పేరు పెట్టారు) వాళ్ళతో మ్యాచ్ (కోతికొమ్మచ్చి) ఉంది. పోయినవారం మమ్మల్ని ఓడించి పెద్ద పోసు కొట్టాడు, వెధవ. ఈ వారం వాళ్ళకి చుక్కలు చూపించాలి అనుకున్నానే! ఇప్పుడేమో ఈ ట్యూషన్. ఆ విషయం వాడికి చెప్తే భయపడి, తప్పించుకోవటానికి ఇలా చెప్తున్నాను అనుకుంటాడు. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూనే వారం అంతా అయిపోయింది. వస్తుంది వస్తుంది అనుకుంటున్న ఆదివారం రానే వచ్చింది. అదృష్టవశాత్తూ ఆ వేళ పొద్దున్నే ట్యూషన్. "హిప్ హిప్ హుర్రే!", అనుకుంటూ ఎగిరి గంతేసాను. మొత్తానికి ట్యూషన్ మానటానికి అనవసరంగా అబద్దాలు చెప్పక్కర్లేదు అనుకుంటూ ఆనందంగా ఉదయాన్నే లేచి ట్యూషన్ కి బయల్దేరాను.
ట్యూషన్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురుచూడటం సరిపోయింది. చదువు-సంద్యా లేకుండా అలా అలా సమయం గడిపేశాను. మొత్తానికి ట్యూషన్ అయిపోయింది. ఇంక సంచి బుజాలకెత్తుకొని పరిగెత్తి పరిగెత్తి ఇంటికొచ్చాను. ఏదో రెండు మెతుకులు మెక్కి మ్యాచ్ ఆడటానికి పరిగెత్తాను. ఆడాం.. మళ్ళీ ఓడాం . ఉసూరుమంటూ ఇంటికి వస్తే నా ఖర్మ కొద్దీ రోజూ ఆలస్యంగా వచ్చే నాన్నగారు ఆ వేళ తొందరగా వచ్చారు. "ఎక్కడికి వెళ్ళావు రా ఇంట్లో చెప్పకుండా? నీకు అసలు భయం లేకుండా పోతుంది", అంటూ అప్పుడే కొట్టేసిన సరుకు చెట్టు పుల్లతో ఒళ్ళంతా వాయగొట్టారు. అసలే మ్యాచ్ ఓడిపోయి వస్తే ఇంట్లో కూడా వళ్ళు హూనం అయిపోయింది. అదే మొదటిసారి నాన్నగారు నన్ను కొట్టడం!! ఆ రోజంతా దెబ్బలు బాగా నొప్పిపెట్టాయి. ఇంకా జన్మలో మళ్ళీ కోతికొమ్మచ్చి ఆడకూడదు అని తీర్మానం చేసుకున్నా.
మళ్ళీ వారం అంతా స్కూలు, ఇల్లు, ట్యూషన్, చదువులతో సరిపోయింది. అన్నట్టు చెప్పడం మరిచాను మళ్ళీ ఆదివారం కోతికొమ్మచ్చి మ్యాచ్ ఆడాం. గెలిచాం కూడా. ఈ సారి నాన్నగారికి దొరకలేదు లేండి!!
.
కృతజ్ఞతలు:-బ్లాగ్ తెలుగువారమండీ(దీలిప్.)

Comments

  1. Very native language.Sweet memories of childhood.

    ReplyDelete
  2. Very native language.Sweet memories of childhood.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!