మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకములు 1-!0

మోహముద్గరః (భజ గోవిందం)
రచన: ఆది శంకరాచార్య
శ్లోకములు 1-!0

.

భజగోవిన్దం భజగోవిన్దం గోవిన్దంభజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే॥1॥
గోవిందుని సేవించుము,గోవిందుని సేవించుము, ఓమూఢమానవుడా! గోవిందుని సేవించుము. మరణము సమీపించునప్పుడు " డు కృఞ కరణే" అను వ్యాకరణ సూత్రము నిన్ను రక్షించదు
(గోవిందుని స్మరణతప్ప వేరేవీ రక్షించలేవని భావము).
.
మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్
యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తమ్ || 2 ||
ఓ మూర్ఖుడా! ధనసంపాదనపై ఆశవదులుము. వైరాగ్యభావనను మనసులో నింపుకొనుము.స్వశక్తిచే సంపాదించిన ధనముతో ఆనందించుము.
నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మా గా మోహావేశమ్
ఏతన్మాంసవసాదివికారం మనసి విచింతయ వారం వారమ్ || 3 ||
యువతుల స్తనములను,నాభిని చూచి మోహావేశం పొందకుము.అవన్నీ మాంసపుముద్దలే అని మరల మరల మనసులో తలచుము.
.
నలినీదలగత జలమతితరలం తద్వజ్జీవితమతిశయచపలమ్
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్ || 4 ||
తామరాకుపై నీటిబొట్టువలే జీవితము మిక్కిలి చంచలమైనది.లోకమంతా వ్యాధులతో దురభిమానముతో నిండి శోకించుచున్నదని తెలుసుకొనుము.
.
యావద్విత్తోపార్జన సక్తస్తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే || 5 ||
ధనము సంపాదించునంతవరకే తన వారు ప్రేమ చూపుదురు.శరీరం కృశించినప్పుడు ఇంటిలో ఎవడూ నీ విషయమడుగడు.
.
యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్ఛతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మింకాయే || 6 ||
శరీరంలో ప్రాణములున్నంతవరకే కుశలమునడుగుదురు. ప్రాణములు పోయిన పిదప ఆ శవమును చూచి భార్య కూడా భయపడును.
.
బాలస్తావత్క్రీడాసక్తః తరుణస్తావత్తరుణీసక్తః
వృద్ధస్తావచ్చింతాసక్తః పరే బ్రహ్మణి కోఽపి న సక్తః || 7 ||
బాలుడు ఆటలపై మనస్సు పెట్టును. యువకుడు యువతిపై మనస్సు పెట్టును. ముసలివాడు చింతపై మనస్సు పెట్టును. పరబ్రహ్మపై ఎవడూ మనస్సు పెట్టడు.
.
కా తే కాంతా కస్తే పుత్రః సంసారోఽయమతీవ విచిత్రః
కస్య త్వం కః కుత ఆయాతః తత్త్వం చింతయ తదిహ భ్రాతః || 8 ||
నీ భార్య ఎవరు? నీ పుత్రుడు ఎవరు? ఈ సంసారము చాలా విచిత్రమైనది. నీవెవడివాడవు? ఎవడవు? ఎక్కడినుండి వచ్చావు? ఓ సోదరుడా! తత్త్వమునాలోచింపుము.
.
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః || 9 ||
సత్పురుషసాంగత్యము వలన భవబంధములూ తొలగును.బంధములు తొలగినచో మోహము నశించును.మోహము నశించగా స్థిరమైన జ్ఞానమేర్పడును.స్థిరజ్ఞానమేర్పడగా జీవన్ముక్తి కలుగును.
.
వయసిగతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః
క్షీణేవిత్తే కః పరివారః జ్ఞాతే తత్త్వే కః సంసారః || 10 ||
వయస్సు మళ్ళినచో కామవికారమెక్కడ? నీరెండిపోగా చెరువెక్కడ? సంపదక్షీణించినచో బంధువులెక్కడ? తత్త్వజ్ఞానమేర్పడగా సంసారమెక్కడ?
.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!