మండన మిశ్రుడు. !

మండన మిశ్రుడు. !

శంకరాచార్యుల జీవిత చరిత్రలను తెలిపే గ్రంధాన్ని శంకర విజయం అని వ్యవహరిస్తారు. . ఆది శంకరాచార్యుల జీవితం లోనూ జీవిత చరిత్ర లోనూ ప్రముఖమైన ఘట్టం మండన మిశ్రులకూ ఆది శంకరాచార్యులకూ జరిగిన వాదం. మండన మిశ్రుల వారి పేరు కూడా అక్కడక్కడా కొద్దిగా తేడాలతో వున్నది, అలాగే వారి భార్య పేరు, వారి నివాస స్థలము..కూడా. కుమారిలభట్టు వారు తమ దేహ త్యాగం సందర్భంలో ఆది శంకరాచార్యులవారికి తన శిష్యుడు ఐన విశ్వరూపుడి గురించి చెప్పి అతడు ఆదిశంకరుల దశోపనిషత్తుల పై భాష్యానికి వార్తికం వ్రాయగల సమర్ధుడని చెప్పి, ఆయనను కలుసుకొమ్మని చెప్తే, ఆది శంకరాచార్యుల వారు మాహిష్మతీ పురం వెళ్లి ఆ విశ్వ రూపుడిని కలుసుకుంటారు.

.

ఆ విశ్వరూపుడే మండన మిశ్రుడు. ఆయనయే తరవాతి కాలంలో శంకరాచార్యులవారి అగ్ర శిష్యులలో ఒకరైన సురేశ్వరుడు. ఆది శంకరాచార్యుల తర్వాత ఈయన శంకర పీఠముల నిర్వహణను పర్యవేక్షించారు. ఆది శంకరాచార్యుల నలుగురు ప్రధాన శిష్యులలో ఈయన జ్ఞాన రీత్యా వయసు రీత్యా కూడా వరిష్టులు, గరిష్టులు! 

మాహిష్మతీ పురం చేరుకున్న శంకరాచార్యుల వారు నర్మదా నదిలో స్నానం చేసి వడ్డుకు వచ్చి మండన మిశ్రుల ఇంటికి దారి నడిగితే, నదికి నీరు తీసుకొని పోవడానికి వచ్చిన స్త్రీలు '' ఆ యింటి చావడిలో పెంపుడు చిలుకలు కూడా వేద చర్చ చేస్తుంటాయి..ఆ ఇల్లే ఆయన ఇల్లు..'' అని ధనికులు నివసించే ఒక వీధి గురించి చెప్పి ఆ వీధిలో ఆయన యింటి చిరునామా చెప్పారట. 

ఆ ఇంటికి వెళ్ళిన ఆదిశంకరులు ఆ రోజు మండన మిశ్రులు తమ తండ్రి గారి ఆబ్దికం కనుక..శ్రాద్ధ కర్మలలో..పిత్రు కార్యంలో వుండి..యింటి సింహద్వారం తలుపులు వేసి వుంటే..యోగ మార్గంలో..లోపలి వెళ్లి..మండన మిశ్రుల వారి ఎదుట ప్రత్యక్షం అయ్యారు. సన్యాసులు కర్మ కాండలలో ప్రమేయం, నమ్మకం లేనివారు కనుక, అక్కడ శంకరుడు ప్రత్యక్షం కావడాన్ని మండన మిశ్రుడు హర్షించ లేదుట. 

భిక్ష తీసుకొని వెళ్లి రండి అని అంటే..నేను వాద భిక్ష కోసం వచ్చాను..ఆ భిక్షనే స్వీకరిస్తాను..నాతో శాస్త్ర చర్చ చేయమని ఆది శంకరుడు అడిగితే..

ఈ పిత్రు కార్యం అయిపోయిన తర్వాత వాదం చేద్దాం..మీరు బయట విశ్రమించండి..అని చెప్పి..అదే ప్రకారం ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత మండన మిశ్రుడు అదిశంకరచార్యులతో వాదానికి దిగాడు..

ప్రధానం గా వేద విజ్ఞాన సంబంధ చర్చ జరిగింది. 

వేదాలలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. కర్మకాండ, జ్ఞాన కాండ అనేవి.

యజ్ఞ యాగాదులూ, పూజలూ, హోమాలూ, జప తపాదులు..ఇవన్నీ జ్ఞాన కాండ లో భాగాలూ అయితే..

వేదాంతం అని పిలువబడే జ్ఞాన కాండ ఐన ఉపనిషత్తులు రెండవ భాగం! 

మహా జ్ఞానులు ఐన ఈ ఇద్దరి వాదానికి న్యాయ నిర్ణేతగా ఎవరు వుండాలి అని ప్రశ్న ఉదయించింది. 

మండన మిశ్రుని భార్య, మహా విద్వాంసురాలు, విదుషీ మణి ఐన సరస వాణి 

(ఈమెకే ఉభయ భారతి అని కూడా పేరు) న్యాయ నిర్ణేతగా ఉండాలని అంగీకారం కుదిరింది. మండన మిశ్రుడు సాక్షాత్తూ బ్రహ్మదేవుని అంశా సంభూతులనీ, 

సరస వాణి సరస్వతీ అవతారం అనీ నమ్మకం. ఆది శంకరులు ఎలాగూ 

అపర కైలాస శంకరుడే!

అనేక దినములు ఇరువురికీ శాస్త్ర చర్చ జరిగింది. ముందుగా నిర్ణయించుకున్న షరతు ప్రకారం ఆ చర్చలో వోడిపోయిన వారు, వారు వున్న ఆశ్రమమును వదలి పెట్టి, గెలిచిన వారి శిష్యులై, గెలిచిన వారి ఆశ్రమమును స్వీకరించి అనుసరించాలి. 

మండన మిశ్రుడు గృహస్థాశ్రమంలో వున్న వాడు. ఆది శంకరుడు ఎలాగూ సన్యాసాశ్రమంలో వున్న వారు! 

పర పురుషుడి ఎదురుగా స్త్రీ వుండకూడదు అని ఒక తెరను వేసి..తెర మాటున సరస వాణి కూర్చుని న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుండగా..ఇరువురు కారణజన్ముల మధ్య శాస్త్ర చర్చ జరిగింది. చివరికి..మండన మిశ్రుడి సిద్ధాంతాలనే తనకు అనుకూలంగా తర్కించి..తన వాదం సరి ఐనదని, వేదముల సర్వోత్కృష్ట లక్ష్యం జ్ఞాన కాండయే అని నిరూపించి, ఆది శంకరులు వాదంలో గెలిచారు.

నిబంధన ప్రకారం మండన మిశ్రుడు సన్యాసం స్వీకరించి శంకరుల శిష్యుడైనాడు. అర్ధాంగి ఐన తనను కూడా జయిస్తేనే ఆది శంకరుల జయం సంపూర్ణం అవుతుందని, వాదించి, వొప్పించి, సరస వాణి తను అప్పుడు ఆది శంకరులతో శాస్త్ర చర్చకు దిగిందని కొన్ని శంకర విజయాలు పేర్కొంటాయి.

ఆ వాదంలో కొంత నిజమున్నది కనుక, భార్య భర్త శరీరంలో సగ భాగం కనుక, ఆవిడ సాక్షాత్తూ సరస్వతీ అంశ అని గ్రహించిన వారు కనుక, శాస్త్ర చర్చకు ఆహ్వానిస్తే తిరస్కరించకూడదు కనుక, ఆది శంకరుడు అంగీకరించారు అని భావించడం సమంజసమైనది అనే మనం భావించాలి! 

సరసవాణి కూడా చర్చలో వెనుకబడి పోవడం ప్రారంభం కావడం తో ఆవిడ కామ శాస్త్ర చర్చకు దిగేసరికి.."కామ శాస్త్ర సంబంధ ప్రశ్నలను సంధించడం ప్రారంభించే సరికి శంకరులు అప్రతిభులయారు. సమస్త శాస్త్రములూ ఎవరినుండి ఉద్భవించాయో ఆ దక్షిణామూర్తి ఐన పరమశివుని అవతారమే ఆది శంకరుడు ఐనప్పటికీ..ఈ శరీరంలో ఆది శంకరాచార్యుడిగా ఆయన బ్రహ్మచర్యాశ్రమం ముగిసిన తర్వాత నేరుగా సన్యాసాశ్రమంలో ప్రవేశించిన వారు కనుక, కామ శాస్త్ర విజ్ఞానం "బ్రహ్మచారి కి కానీ, సన్యాసికి కానీ అవగతం అయ్యే అవకాశం లేనందున, 

( ఈ నాటి బ్రహ్మచారులు, సన్యాసులకు ఈ దురదృష్టకర నిబంధన లేదేమో కానీ..) తమకు అవగతం కాని దానిని గురించి, అనుభవంలోకి రాని దానిని గురించి వాదించడం సంప్రదాయం కాదు కనుక, ఏమీ చేయాలో పాలు పోని ఆది శంకరాచార్యుల వారు ఒక మాసం గడువు అడిగి, మాసం తర్వాత మరలా సరసవాణి తో వాదానికి వస్తానని చెప్పి అక్కడి నుండి బయలు దేరారు!

ఏమీ చేయాలా అని ఆలోచిస్తూనే తమ యాత్ర కొనసాగిస్తూ శిష్య బృందంతో సహా..మధ్య భారతం లో ఒక రాజ్యం గుండా వెళ్తున్నప్పుడు..ఆ దేశపు మహారాజు..అమరుకుడు అనే వాడు..రాజ్య భోగాలలో జీవితాన్ని వ్యర్ధం చేసుకుని అకాల మరణం పొంది.. అతని మృత కళేబరం అంత్య క్రియలకు సిద్ధం చేయబడితే..ఆ మార్గం గుండా వెళ్తున్న ఆదిశంకరాచార్యుల వారు ఒక ఆలోచన స్ఫురించి..

పరకాయ ప్రవేశ విద్య ద్వారా ఆ రాజు శరీరం లోకి ప్రవేశించ బోతూ..తాము తిరిగి వచ్చే వరకూ తమ భౌతిక దేహాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండమని శిష్యులకు చెప్పి తాము ఆ రాజు శరీరంలోకి ప్రవేశించే సరికి..చనిపోయిన రాజు లేచి కూర్చున్నాడు. అందరూ సంతోషించారు. అంతః పురానికి చేరుకున్న తర్వాత.

.ఆ కామ భోగాలలో పడి..సమయం గడిచి పోతుంటే..మహారాణి ఇంతకు ముందు లేని అలౌకిక ఆనందాన్ని ఆయనతో గమనించి..వృద్ధుడు, మహా మేధావి ఐన మంత్రి ఆయనలో తేజస్సు, ప్రజ్ఞ, గమనించి.. అనుమానించారు! 

చూచాయగా విషయాన్ని గ్రహించిన వృద్ధ మంత్రి రాజ్యంలో ఏ జ్ఞాని, సన్యాసి..మహానుభావుడి మృత కళేబరం ఐనా దహన సంస్కారాలు లేకుండా వుంటే వెంటనే గమనించి దహనం చేయ వలసిందిగా ఆజ్ఞాపించాడు. 

ఇక్కడ అరణ్యంలో ఒక చెట్టు తొర్రలో ఆది శంకరుల భౌతిక శరీరాన్ని వుంచి కాపలా గాస్తున్న శిష్యులకు నానాటికీ ఆందోళన పెరిగిపోయి..చివరికి రాజ భటులు ఆ దేహాన్ని గమనించే స్థితి వచ్చే సరికి ఇంకా కంగారు పడిపోయి..ప్రధాన శిష్యులు రాజు గారి కోట చుట్టూ డప్పులు మ్రోగిస్తూ..

''తత్త్వమసి.. తత్త్వమసి..తత్త్వమసి..''..(నీవు నీవు కావు..నీవు ఫలానా..అనే సూచనతో..) అనే ఉపనిషత్ వాక్యాలతో..వేద మంత్ర పఠనం తో తిరుగుతుంటే..ఆ వాక్యాలను..మంత్రాలను విన్న రాజు గారి దేహంలోని ఆది శంకరాచార్యులవారు.

.తమ యదార్ధ స్థితికి వచ్చి..పరుగున తమ శరీరాన్ని దాచి వుంచిన స్థలానికి వచ్చేప్పటికే..ఆ సరికి బలవంతంగా ఆ శరీరాన్ని స్వాధీనం చేసుకున్న రాజభటులు ఆ శరీరానికి చితి పేర్చి నిప్పు అంటించారు..మంటలు క్రమ క్రమంగా దేహాన్ని అలుముకుంటుంటే..ఆ శరీరంలోకి ప్రవేశించిన ఆది శంకరులు.. అంత వరకూ..అజ్ఞాని వలె..అంటే బాలునివలె..మాయలో పరిభ్రమించినందుకు..

బాలురను పరి రక్షించడంలో నృసింహుని మించిన దైవం లేనందుకు..దివ్యమైన నృసింహ కరావలంబ స్తోత్రం చేశారు..

ఆ స్తోత్రంలో ఈ ప్రస్తుత స్థితికి సంబంధించిన శ్లోకాలు కూడా వున్నాయి..మనం గమనింప వచ్చు..స్తోత్రం పూర్తి అయ్యేసరికి మంటలు ఆరిపోయి..వాడని పుష్పం వలె ఆది శంకరుడు బయటకు వచ్చి..శిష్య గణం తో మరలా సరస వాణి సన్నిధి కి వచ్చీ రావడంతోనే..ఈయన మొహంలోని తేజస్సును బట్టే ఈయన ఆ శాస్త్ర విజ్ఞానాన్ని కరతలామలకం చేసుకున్నాడని ఆమె గ్రహించిందట. ఇద్దరికీ వాదం జరిగింది. ఆది శంకరుడు జయించాడు. ఆవిడ తన అవతారం చాలించి వెడుతుంటే ఆది శంకరుడు ఆవిడను అభ్యర్ధించి..తాము స్థాపింప బోయే పీఠం లో అధిష్టాన దేవతగా ఉండమని అభ్యర్ధించారు. 

ఆవిడ అంగీకారం మేరకు శృంగేరి శారదాపీఠం లో ఆవిడ మూర్తి ని స్థాపించారు.

మండన మిశ్రుడు ఆయనకు శిష్యుడై, సురేశ్వరుడు అనే సన్యాస నామం స్వీకరించి..ఆయన భాష్యాలకు వార్తికాలు రచించి..ఆయన తర్వాత శంకర మఠముల నిర్వహణ చేశారు! 

ఆది శంకరుల తైత్తిరీయ ఉపనిషత్ భాష్యానికీ, బృహదారణ్యక ఉపనిషత్ భాష్యానికీ వార్తికాలు వ్రాశారు. నైష్కర్మ సిద్ది అనే ఉద్గ్రంధాన్ని వ్రాశారు.

ఆది శంకరులు తమకు అప్పజెప్పిన విధి నిర్వహణ లో అమర గతిని చెందారు! జయ జయ జయ శంకర!


Comments

  1. Vinjamuri gaaru., chaalaa chankkagaa andinchaaru. Meeku dhanyavaadaalu. Pothe naa manavi emanaga older postlani mobile phonelo chanduvukone vidhamugaa.. ante yearwise mariyu monthwise lagaa cheste baguntundhi. Ipuudu unnavidhamugaa atihe scrolling chesukovaali....Sivasubranhmanyam Konduru

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!