శ్రీ వేమన పద్య సారామృతము .!

శ్రీ వేమన పద్య సారామృతము .!

.

శ్లో ||బమ్మ గుడ్డు యనెడు పట్నంబు లోపల 

బమ్మనెరుగలేని బాపడేల ?

తన మనంబు దెలియ దానే పో బ్రహ్మంబు 

విశ్వదాభిరామ వినుర వేమ !

తా :-బ్రహ్మాండం అనే పట్టణంలో ఉన్న బ్రాహ్మణుడికి బ్రహ్మాన్ని గురించి తెలియకపోతే అతడు ఇంకా బ్రాహ్మణుడేమిటి ?తనను తాను తెలుసుకోవడమే బ్రహ్మ .

.....

శ్లో ||అగ్ని శిఖల యందు నమరంగ మమకార 

మభవు మీద ధ్యాస మలర నునిచి 

యాహుతి యగు వెనుక హరున కర్పిత మౌను 

విశ్వదాభిరామ వినుర వేమ !

తా :-ఈశ్వరుని మీద మనస్సును నిలిపి నిలకడగా ఉంచి సుజ్ఞానం అనే అగ్నిలో మమకారాన్ని హోమం చేస్తే అది ఈశ్వరార్పణం అవుతుంది .

.....

శ్లో ||నిజము యేల నెరిగి నిత్యుండు గాడాయె ?

పలుకులోని బిందు పదిల పరచి 

వేడుకైన బిందు వెదబెట్ట కుందురా 

విశ్వదాభిరామ వినుర వేమ !

తా :- నిజాన్ని తెలుసుకుని నిత్యుడు కావడం మంచిది ,మాటలలోని మధురిమను భద్ర పరచు కుంటూ శాశ్వత పదార్ధ బోధ వాక్యాలను మనస్సులో నింపుకుని ఉండడం శ్రేష్టం కదా !

......

శ్లో ||ఆశ విడక కాని పాశ ముక్తుడు గాడు 

ముక్తుడైన గాని మునియు గాడు

మునికి గాని సర్వ మోహంబు లూడవు

విశ్వదాభిరామ వినుర వేమ !

తా :-ఆశలు విడిచినవాడే బంధాల నుంచి విడువబడు తున్నాడు ,అతడే ముక్తుడవుతున్నాడు ,అనంతరం మునిగా మారి అన్ని రకాల మొహాల నుంచీ బయట పడుతున్నాడు .

.....

శ్లో ||సద్గురుకృప జ్ఞానంబున 

సద్గతి దీపింపు చున్న చాలా చదువుల్ 

సద్గతి గలుగగ జేయును 

సద్గురువే దైవమనుచు జాటర వేమ !

తా:- వేదాంత తత్త్వాన్ని విపులంగా చెప్పడానికి లోకంలో ఎన్నో మంచి శాస్త్రాలున్నాయి ,అవన్నీ తెలియాలంటే మంచి గురు కటాక్షం వల్ల లభ్యమవుతోంది ,కనుక మంచి గురువు దైవం లాంటివాడు .

......

శ్లో ||ఎరుకుమాలు జీవి యెంత కాలంబుండి 

చచ్చి పుట్టు చండు సహజముగను 

యెరుక మార్చు చోటు నెరుగుట బ్రహ్మంబువి 

విశ్వదాభిరామ వినుర వేమ !

తా :-కొందరు అజ్ఞానులై పుట్టు చావులను కాల ప్రవాహంలో ఛస్తూ పుడుతూంటారు ,అది వారికి సహజం ,వారా అజ్ఞానంలోంచి బయటపడిన నాడే బ్రహ్మాన్ని చూడగలుగుతారు .

......

శ్లో ||ఈషణ త్రయంబు నెడపండ నేరక 

మోహ రాసి లోన మునిగి యుండు 

జనుల కెట్లు మోక్ష సౌఖ్యంబు గలుగురా ?

విశ్వదాభిరామ వినుర వేమ !

తా :- ధనేషణ ,దారేషణ మరియు పుత్రేషణ అనే ఈ షణ త్రయాన్ని విడువక సర్వదా స్త్రీ లోలురై ఉండే మానవులకి మోక్షం సౌఖ్యం ఎలా తెలుస్తుంది ?

......

శ్లో ||విషయముల బొరలి రోయక 

విషమంటిన గతిని జూచు విధమున ధరలో 

విషసమ మాయా సుఖముల 

విషయములన్ గూడా కుండ్రు వేత్తలు వేమ !

తా :-ఈ లోకంలో విషయ సుఖాల కోసం ప్రాకులాడటం మంచిపని కాదు ,ఇంద్రియ సుఖాలను విషం అంటుకున్న వాటి వలే చూస్తూ వాటి జోలికి పోకుండా ఉంటారు బ్రహ్మ వేత్తలు .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!