మోహముద్గరః (భజ గోవిందం) రచన: ఆది శంకరాచార్య శ్లోకములు 11-20


మోహముద్గరః (భజ గోవిందం)

రచన: ఆది శంకరాచార్య

శ్లోకములు 11-20

"మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వమ్

మాయామయమిదమఖిలం బుధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా "||11 ||

.

ధనము - జనము - యౌవనము చూచి గర్వపడకుము.

వీటన్నిటినీ కాలము ఒక్కక్షణములో హరించును.

మాయామయమయిన ఈ ప్రపంచమును విడిచి జ్ఞానివై బ్రహ్మపదము పొందుము.

.

"దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః

కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః "|| 12 ||

.

పగలు - రాత్రి , సాయంకాలము - ప్రాతఃకాలము , 

శిశిర ఋతువు - వసంత ఋతువు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వచ్చును.

కాలము ఆటలాడుచున్నది.ఆయుష్షు క్షీణించుచున్నది 

అయినా ఆశ విడవకున్నది.

.

"కా తే కాంతా ధన గతచింతా వాతుల కిం తవ నాస్తి నియంతా

త్రిజగతి సజ్జనసం గతిరైకా భవతి భవార్ణవతరణే నౌకా "|| 13 ||

.

ఓ మూర్ఖుడా! నీకు కాంత - ధనములపై చింత ఎందుకు? 

నిన్ను శాసించువాడెవడూ లేడా ఏమి? 

మూడులోకములలోనూ, సత్పురుషసాంగత్యమొక్కటే

సంసారసముద్రము దాటించు నౌక.

.

"జటిలో ముండీ లుంఛితకేశః కాషాయాంబరబహుకృతవేషః

పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదరనిమిత్తం బహుకృతవేషః" ||14 ||

.

జడలు ధరించినవాడై - గుండు కొట్టించుకున్నవాడై - జుట్టు కత్తిరించుకున్నవాడై - 

కాషాయవస్త్రములు ధరించినవాడై పొట్టనింపుకొనుటకు 

వివిధ వేషములు ధరించు మూర్ఖుడు చూస్తూ కూడ చూడనట్లుండును.

.

"అంగం గలితం పలితం ముండం దశనవిహీనం జాతం తుండమ్

వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండమ్ "|| 15 ||

.

శరీరం క్షీణించినది , తలనెరసినది , దంతములు ఊడినవి, 

ముసలివాడై కర్రపట్టుకు నడుచుచున్నాడు.అయినా ఆశ వదులుటలేదు.

.

"అగ్రే వహ్నిః పృష్ఠేభానుః రాత్రౌ చుబుకసమర్పితజానుః

కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః "|| 16 ||

.

ముందు అగ్నిని వెనుక సూర్యుని ఉంచుకొని చలికాచుకొనుచూ,

రాత్రులలో మోకాలుపై గడ్డమునుంచి , చేతులతో భిక్ష స్వీకరించుచూ , 

చెట్టుకింద నివసించువానిని కూడా ఆశాపాశం వదులుటలేదు.

.

"కురుతే గంగాసాగరగమనం వ్రతపరిపాలనమథవా దానమ్

జ్ఞానవిహినః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన" || 17 ||

.

గంగా - సముద్ర సంగమములలో స్నానంచేసినా , 

వ్రతములను ఆచరించినా , దానం చేసినాకూడా 

తత్త్వజ్ఞానం లేనివాడు వంద జన్మలైనా ముక్తి పొందడు.

.

"సుర మందిర తరు మూల నివాసః శయ్యా భూతల మజినం వాసః

సర్వ పరిగ్రహ భోగ త్యాగః కస్య సుఖం న కరోతి విరాగః "|| 18 ||

.

గుడిలో చెట్టుకింద నివాసము , నేలపై నిద్ర, తోలును వస్త్రంగా ధరించుట,

దేనినీ స్వీకరించకపోవుట, భోగముననుభవించకపోవుట అను వైరాగ్యము 

ఎవడికి సుఖమివ్వదు?

.

"యోగరతో వాభోగరతోవా సంగరతో వా సంగవీహినః

యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ "|| 19 ||

.

యోగమును ఆచరించువాడుకానీ - సుఖములననుభవించువాడుకానీ,

బంధములు పెంచుకొనువాడుకానీ - తెంచుకొనువాడుకానీ,

ఎవడిమనస్సు పరబ్రహ్మయందు లగ్నమగునో వాడు ఆనందించుచునే ఉండును.

.

"భగవద్ గీతా కించిదధీతా గంగా జలలవ కణికాపీతా

సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన న చర్చా "|| 20 |

.

కొంచమైనా భగవద్గీత చదివి, ఒక కణమైనా గంగాజలం త్రాగి,

ఒక్కసారైనా విష్ణువును పూజించినవానిని యముడేమి చేయగలడు? 

.

భజగోవిన్దం భజగోవిన్దం గోవిన్దంభజ మూఢమతే

సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!