కవితా చమత్కారం !

వితా చమత్కారం !

-----------------------------

ఉన్నదున్నట్లు చెబితే కవిత్వం యెందుకవుతుంది? యేదో కొత్తదనం ఆమాటలలో జొప్పించాలి. అప్పుడది చమత్కార భాసురమై కవిత్వం అవుతుంది. :" చమత్కార మంజరి "- అనేగ్రంథంలో రెండవ అధ్యాయంలో ఒక చక్కని పద్యం ఉంది. ఒకా నొక చక్రవర్తి గారి చెలికత్తె సౌందర్యాన్ని చూచి ముగ్ధుడై ఓకవి యిలా వర్ణించాడు.

.

మ: " బిగువుం జన్నులు గాంచి , మాను నల జంబీరంబు బీరంబు! క్రొం

జిగి మోముంగని , సిగ్గునన్ వదలు రాజీవంబు జీవంబు ! విం

తగు భ్రూరేఖలు గాంచి , భీతినిడు కోదండంబు దండంబు ! త

జ్జగతీ నాధుని మ్రోలనున్న చెలులం జర్చింపగా పాడియే ? "

జంబీరాది పదాలలో మొదటి యక్షరం లోపించటం ఈపద్యం లోని చమత్కారం! 

.

కథానాయిక బిగువగు వక్షోజములను జూచి, 

జంబీరములు ( గజ నిమ్మ పండ్లు -వానికి స్తనములతో పోలిక కవిసమయము ) బీరమును వదలుచున్నవి .బీరమనగా గర్వము. అందమైన ఆమెముఖాన్ని జూచి రాజీవము (పద్మము) ిగ్గుపడి జీవాన్ని వదలు తున్నది.

( నాయిక ముఖం సహజంగానే గులాబి రంగులోనున్నది. దానిని చూడగానే పద్మం వెలవెలృ బోతోన్నదని ఒక అర్ధం, ప్రాణాన్ని విడుస్తోందని మరోఅర్ధం ) సొగసైన కనుబొమల తీరు జూచి కోదండము (విల్లు ) 

దండం పెడుతున్నదట. కోదండమంటే విల్లు దండం అంటే నమస్కారం .( అందమైన ఆడపిల్లల కనుబొమలను ధనుస్సుతో పోల్చటం కవి సమయం) 

.

అబ్బో! ఇంతటి సుందరాంగు లామహారాజు చెలికత్తెలు. వారి యందాన్ని నే పొగడ గలనా? అని ఆశ్చర్యం ప్రకటిస్సున్నారు కవిగారు.

అజ్ఙాత కర్తృక మైన యీపద్యం ఆకవిగారి కల్పనా చమత్కారానికి నిదర్శన మనటంలో

సందేహం యెంతమాత్రం లేదు గదూ !!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!