ఉత్తినే ఉత్తినే ‘’అంటూ నిజంగానే నిష్క్రమించిన ఏ.వి.ఎస్..!

ఉత్తినే ఉత్తినే ‘’అంటూ నిజంగానే నిష్క్రమించిన ఏ.వి.ఎస్..!


.

తెలుగు హాస్య నటుల్లో ఎవరికి వారు ప్రత్యేకం గా ఉన్నారు ఎవరి శైలి వారిదే .ఎవరి డైలాగ్ డెలివరి తీరు వారిదే .అంతా విలక్షణ నటులే .విడుదలైన మొదటి చిత్రం మిస్టర్ పెళ్ళాం తో తెలుగు ప్రేక్షకుల కు పరిచయమయ్యాడు ఏ.వి.ఎస్. అప్పటి నుంచి దాదాపు అయిదు వందల సినిమాల్లో తన మార్కు హాస్యాన్ని పండించాడు .దేనికదే సాటి గా మేటి గా నటించి మెప్పించాడు .అదో ‘’తుత్తి’’ఆయనకూ ,మనకూ గా మిగిలింది .కిత్తుడు అన్నా ,కిత్నాత్తమి అన్నా ,అతలు అని స బదులు త వాడి కితకితలు పెట్టాడు అరంగేట్రం తోనే .అది అమాయక పాత్రా కాదు తెలివి ఉన్న వాడి డీ కాదు మానవత్వం కూడా మిళితమైన పాత్ర .ఈ పాత్ర సృష్టికర్త ముళ్ళ పూడి అయినా ,దాన్ని నిజ రూపం లో ఆవిష్కరించిన వాడు ఏ.వి.ఎస్ .మాత్రమె. దీన్ని ఇంత గొప్పగా తీసి చూపించిన వాడు సినీ పుంభావ సరస్వతి బాపురే బాపు .

‘’ఉమాపతి’’గా బ్రహ్మానందాన్ని ‘’అదో టైపు ‘’లో చేరువై గిలిగింతలు పెట్టి ,అతనికి సంకటాన్ని మనకు సంభ్రమాన్ని కలిగించాడు .’’మాఅమ్మాయి నిజంగా నీతో చెప్పిందా ? నోటితోనే చెప్పిందా? ప్రామిస్ !’’అని మాటలు రాని కూతురు శ్రీ లక్ష్మి బ్రహ్మానందం ప్రేమించి పెళ్ళికి తొందర చేస్తుంటే వాడు బలైపోతాడని ముందు హెచ్చరిక గా చెప్పి చివరికి అతని ఖర్మానికి వదిలేసిన తండ్రిగా ఏ.వి.ఎస్.నటించి జీవిస్తే బ్రాహ్మి అసలు విషయం తెలిసి షాక్ కు గురైన సన్ని వేశం కడుపుబ్బా నవ్విస్తుంది .ఇదీ ఆయన మార్కు కామెడీ .

ఏం ఎస్.నారాయణ డాన్స్ చేస్తూ హావ భావాలు ఒలికిస్తుంటే ‘ఈడు’ పందికి విగ్గు పెట్టి నట్లున్నాడు .వీడికి డాన్స్ ఏమీ రాదురా ..వాడేడ్చినట్లేదో తీసి ఎడిట్ చేసుకో అని డైరెక్టర్ కు చెప్పే సీన్ లో బయటి మాట అనలేక లోపలి మాటను బయట పెట్టి మనకు అసలు విషయం తెలియ జేస్తాడు .’’ప్రసాదూ !ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా “’అని ఏం ఎస్.మాటి మాటికి అంటూ తనే అన్నిట్లోనూ వేలుపెడుతుంటే ‘’అలాగే బాబూ’’అని ! మమ్మల్ని ఎప్పుడు వేలు పెట్టనిచ్చావు ?’’అని జనం తికం గా అనటం భలే నవ్వించే సీను ..

నెత్తిన టోపీ పెట్టె పాత్ర అయినా పెట్టించుకొనే పాత్ర అయినా అతని నటన రమ్యం గా ఉంటుంది సహజం గా ఉంటుంది .ఏ.వి.ఎస్.అంటే ముందుగా మనకు టోపీతో కనీ పించే రూపమే కనీ పిస్తుంది .యాంకరింగ్ చేసినా అతని స్టైల్ గమ్మత్తుగా వెరైటీ గా ఉంటుంది .తాను దర్శకుడై నిర్మాత కూడా అయి ఇంతటి హాస్య నటుడుసక్సేస్ లేక అపహాస్యం పాల్లవ్వటం మాత్రం ఆయన జీవితం లో విషాదమే ..వినోదం సినిమా లో అతి తెలివిఉన్న ఇంటి యజమానిగా కళ్ళకు గంతలు కట్టుకొని అన్నీ చూస్తున్నట్లు నటిస్తూ అమాయకం గా ఉంటూ బ్రహ్మానందం- ఇంటిని సైలెంట్ గా నోట మాటలేకుండా అంతా నిలువు దోపిడీ చేస్తుంటే,డబ్బు ,నగలు ఎక్కడున్నాయో జాగ్రత్త చేసే నెపం తో భార్యకుచెబుతూ దొంగకు తెలిసేట్లుచేసి సర్వ మంగళం పాడించుకొన్న సీను అదరహో .

నారద వేషం లోను ఏ.వి.ఎస్.తన మార్కు స్టైల్ తోనే నటించాడు ,మెప్పించాడు .పౌరాణికమైనా సాంఘిక మైనా పాత్రోచితం గా నటించి పాత్రలో లీనమై పోయి నటించే నేర్పున్న వాడు .తండ్రిగా, తాతగా కూడా నటించి సామర్ధ్యం చూపాడు .అందులోను హాస్యాన్ని నింపి ఒలికించాడు . శుభాకాంక్షలు సినిమాలో సంగీత సాధకుడు గా కడుపుబ్బా నవ్విస్తాడు .కాని సహృదయం ఉన్న వాడుగా జగపతి బాబుకు సుధాకర్ కు ఆశ్రయం కల్పించి మేలు చేస్తాడు .అలాగే ఇంకో సినిమాలో నాదస్వరం వాయిస్తూ హాస్యాన్నే పిండిస్తాడు .

జర్న లిస్టు గా జీవితాన్ని ప్రారంభించి ,మిమిక్రీతో పైకొచ్చి హాస్య నటుడైస్తిరపడి ,తెలుగు దేశం పార్టీ కి ప్రచార సారధియై .తన శక్తి యుక్తులను వినియోగించి నాయకుల మన్ననల నందుకొని ,రాజకీయ వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ ఆంధ్రజ్యోతి లో ఈ మధ్య దాకా ‘’ఉత్తినే ‘’శీర్స్ధిక లో అనేక కవితలను ప్రాస బద్ధం గా రాసి ,చదువుతూంటేనే గిలిగింతలు పెట్టించి,ఆరోగ్యకర హాస్యాన్నిఅందించి ,సంస్కారం చూపి ఆ నాయకులకు కొరడా దెబ్బలుగా వాటిని రంగరించి హాస్యాన్ని సృష్టించాడు .ఉత్తినే అనిరాసి నిజం ఆనే ఈ జీవిత రంగాస్తలం నుండి నిష్క్రమించిన ’’ఎప్పుడూ విపరీతం గా సెటైర్’’(ఏ.వి.ఎస్.) చిందించే ‘’హాస్య నట చిరంజీవి ఏ.వి.ఎస్.ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!