కొండమీద కనకదుర్గ నవ్వింది .!

కొండమీద కనకదుర్గ నవ్వింది .!

By - Sree Virabhadra Sastri Kalanadhabhatta.. 

ఒకడు నదిమీదకు వంగి వున్న కొమ్మను గొడ్డల్తో కొడుతూవుండగా, గొడ్డలి జారి నదిలో పడింది. వాడు విచారిస్తూవుంటే నది దేవత ప్రత్యక్షమై విషయం తెలుసుకొని, నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. కాదన్నాదు. మళ్ళీ నదిలోకి మునిగి, ఈసారి వెండి గొడ్డలి తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. కాదు అన్నాడు. మూడోసారి మునిగి వాడి గొడ్డలినే తెచ్చి ఇది నీదేనా అని అడిగింది. ఆ! ఇదే నాది అన్నాడు సంబరపడిపోతూ. వాడి నిజాయితీకి మెచ్చుకొని బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా వాడికి ఇచ్చింది. వాడు ఆనందంగా వాటిని తీసుకు ఇంటికి వెళ్ళాడు. 

*** *** ***

రాజు అతని భార్య ఒక చల్లటి సాయంత్రం (బహుశా శీతాకాలం అయివుంటుంది. ఈ వేళ అయితే 46 డిగ్రీలు) విజయవాడ బ్యారేజీమీద షికారుకుచేస్తూ, పల్లీలు కొనుక్కుని నముల్తూ కబుర్లు చెప్పుకుంటు నడుస్తున్నారు. రాజు భార్య బ్యారేజీ ప్రక్కనవున్న రైలింగు మీదనుంచి నదిలోకి తొంగిచూస్తోంది. రాజు ఏదో విట్ వేసాడు. పకపకా నవ్వుతూ హమ్మ అబ్బ అంటూ నవ్వలేక మెలికలు తిరిగిపోతూ ఆవూపులో కృష్ణా నదిలో పడిపోయింది. రాజు లబో దిబో మన్నాడు. ఆసమయంలో బ్యారేజీమీద సంచారం తక్కువగా వుంది. ఇంతలో కృష్ణవేణమ్మ నదిలోంచి పైకి వచ్చి ఏం నాయనా ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగింది. నా భార్య నదిలో పడిపోయింది. నాకు ఈత రాదు. ఆమెను రక్షించడం ఎలాగ అని అఘోరిస్తున్నాను అన్నాడు రాజు.

ఓ అదా సంగతి. వుండు అని నదిలోకి మునిగి తిరిగి ఒక అందమైన యువతితో పైకి వచ్చి చూడు నాయనా ఈమేనా అని అడిగింది.

వెంటనే రాజు ఆ! ఈమే అన్నాడు.

ఛీ ద్రోహీ! నీచుడా ఈమె నీభార్యా! ఇదేనా నీభార్యమీద నీకున్న ప్రేమ? అని కోపంగా అంది అసహ్యంగా మొహం పెట్టి (ముందే అసహ్యంగా మొహం పెట్టిందనుకుంటాను)

అమ్మా! నీవు కృష్ణవేణితల్లి వని నాకు అర్ధమైంది. ఇప్పుడు ఈమెను కాదన్నాననుకో. ఇంకొక అమ్మాయిని చూపిస్తావ్ ఆమెకూడా కాదన్నాననుకో. చివరిసారిగా మా ఆవిడను తీసుకు వచ్చి నాకు అప్పగించి, నా నిజాయితీకి మెచ్చుకొని మొదటి ఇద్దర్నీ కూడా ఇచ్చేస్తావు. నాకు తెలియదాం ఏమిటి ఇప్పుడే శాస్త్రి గారు పైనే వ్రాసారు మూడు గొడ్డళ్ళ కథ. తల్లీ! ఒక భార్యతోనే వేగలేక చస్తున్నాను. నువ్వు ముగ్గుర్ని ఇస్తే వాళ్ళతో ఎలా వేగేది?? అన్నాడు రాజు బేలగా!

కొండమీద కనకదుర్గ నవ్వింది భర్త మల్లిఖార్జునుని, ఆయన నెత్తిమీదవున్న గంగమ్మను చూసి. 

ముగింపు మీ ఇష్టం

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!