చంద్రుణ్ణి చూపించే వేలు.!

చంద్రుణ్ణి చూపించే వేలు.!

(ఇంటర్ నెట్ నుండి.)

.

హైకూ అంటే చంద్రుణ్ణి చూపించే వేలు; ఏరు దాటాక దిగవిడిచే తెప్ప.

చంద్రుణ్ణి చూపించాక వేలు అవసరం లేదు. ఏరు దాటాక తెప్ప అవసరం లేదు. 

.

తనని తాను రద్దు చేసుకుని, తను అదృశ్యమైపోయి, 

స్వతస్సిద్ధ వస్తు తత్వాన్ని (thing-in-itself) ఆవిష్కరించటం

హైకూ అనే కవితా ప్రక్రియ ప్రత్యేక లక్షణం.

ఇదే దీన్ని మిగతా కవితా ప్రక్రియల్నించి వేరుచేస్తుంది.

.

ఉదాహరణకి హైకూ కవితా పితామహుడు, 17వ శతాబ్దంలో జీవించిన జపానీయ కవి ‘బషో’ ప్రసిద్ధ హైకూ

ఎండిపోయిన కొమ్మమీద

కాకి ఒంటరిగా కూచుంది,

చలికాలపు సాయంత్రం.

ఈ పదచిత్రంలో ఇచ్చిన మూడు వస్తువులూ – ఎండిపోయిన కొమ్మా, ఏకాకి కాకీ, చలికాలపు సాయంకాలమూ – ఒకే రకమైన అనుభూతిని ప్రసరిస్తున్నాయి. ఈ మూడింటినించి సమానంగా ఉబికే అనుభూతి గాఢతకు మనం చలించకుండా ఉండలేము. ఈ మూడు మూర్తమైన వస్తువుల ద్వారానే ఆ హైకూలోని చలికాలం సాయంత్రపు ఒంటరితనపు దిగులుని అనుభూతించగలుగుతున్నాం. ఇది వేరే విధంగా, అంటే వట్టి బౌద్ధిక ప్రక్రియలద్వారా సాధ్యం కాదు. ఇది ప్రత్యక్ష ఐంద్రియక అనుభూతి. ఇది ఆత్మాశ్రయం కాదు. మనస్సూ, వస్తువూ, రెంటి కలయిక వల్ల ఉద్భూతమైంది. విశ్వహృదయంలో ప్రవేశించి, దానిలో ఐక్యమవటమంటే ఇదే.

.మిత్రులు ప్రసాద్ గారు ‘నేను హైకూలు రాశాను. చూస్తారా?’ అని అడిగినప్పుడు నాకేమీ విస్మయం కలగలేదు. స్వభావరీత్యా హైకూ రాయగలిగిన చాలా కొద్ది మంది కవుల్లో ఈయనొకరు.

వర్షం

క్షణం పూచే నీటి పూలతో

ఊరు నిండిపోయింది.

అనటంలో చేతనా సౌకుమార్యమూ, సౌందర్యం క్షణికమనే అవగాహనా, దీన్నించి పుట్టిన ఒక విషాదమూ స్ఫురిస్తాయి. సుకుమారమైన అనుభూతిని జెన్ రసజ్ఞులు ‘మియాబీ అంటారు. సౌందర్యపు క్షణికత్వాన్ని తెలుసుకున్నప్పుడు కలిగే దిగులుని ‘అనారే’ అంటారు.

గోడలో పూచిన పూవు

పరిచయం చేసింది

మా గోడను.

ఇంతకాలం ఉపేక్షించిన గోడని ఆకస్మికమైన, క్షణికమైన పూవు పరిచయం చేసింది. హైకూలాగే! కవిత్వానుభూతీ, పదచిత్రాల సమన్వయం ఇక్కడ మీరు గమనిస్తారు. ద్రష్టా, దృశ్యమూ అనుభూతి ఏకతా సాధించాయి.

పూవు లేదు

నేను లేను

సౌందర్యం ఆవరించింది.

ఇదే జెన్ సమాధి!

ఎప్పుడూ విస్మయంతో

పూలని నేను

నన్ను పూలూ

ద్రష్టకీ, దృశ్యానికీ తేడాయేమిటి?

ఈ హైకూ పుస్తకం వానతో మొదలై, చివర్న వానతో ముగుస్తుంది.

వాన వెలిసింది

తీగపై

చిన్నిప్రపంచాలు వేలాడుతున్నాయి.

ఒక జెన్ “కోఅన్” (ప్రహేళిక) ఉంది. శిష్యుడు గురువుగారిని ప్రశ్నించాడు. 

‘స్వామీ, తమరింత స్పష్టంగా ఎలా చూడగలుగుతున్నారు?’ సమాధానం 

: ‘కళ్ళు మూసుకున్నాను కనక.’ బైటి కళ్ళు మూసుకొని,

లోని కళ్ళు తెరిస్తే కాని హైకూ రాయలేరు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!