శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(21/5/15.).

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(21/5/15.).

.

కాలద్వార కవాటబంధనము దుష్కాల ప్రమాణ క్రియా

లీలాచాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్ర జిహ్వాద్భుత

వ్యాళవ్యాళ విరోధి మృత్యుముఖ దంష్ట్రా నాహార్య వజ్రంబు ది

క్చేలాలంకృత! నీదు నామ మరయన్; శ్రీ కాళహస్తీశ్వరా !

.

శ్రీ కాళహస్తీశ్వరా ! దిక్కులనే వస్త్రములుగా ధరించిన వాడా ! దిగంబరా ! శంకరా ! నీ నామము యమధర్మరాజు లోకమున ప్రవేశించుటకు గల తలుపు నకు గడియ వంటిది.యముని విజృంఙణలను లీలగా అడ్డుకో గల్గినది. చిత్రగుప్తుని నోరు అనెడి పుట్టయందు కదలాడెడి నాలుక యనెడి మహాసర్పమునకు గరుత్మంతుని వంటిది . మృత్యుదేవత నోటియందలి కోరలనెడి పర్వతాలకు వజ్రాయుధము వంటిది. నీ నామమును స్మరించి నంతనే మృత్యువు దూరంగా తొలగి మోక్షము లభించును కదా !

“దిక్చేలాలంకృత “ ఎంత అందమైన సంబోధన . మహాకవి ఏకేశ్వరోపాసకుడై మహాశివుని మాత్రమే పరదైవతం గా భావించి ,పూజించాడు . తాను వ్రాసిన రెండు కావ్యాలను ఆ మహాదేవునికే సమర్పించిన పరమభక్తుడు. “ నమశ్శివాయ “ అంటేనే పాపాలు పటాపంచలౌతాయి. “నమశ్శివయ్య” అంటే ఆ స్వామి అక్కున చేర్చుకుంటాడు .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!