ఉత్తర రామాయణంలో సీత.!

ఉత్తర రామాయణంలో సీత.!

.

తే. రమణి మరి కొంత వడి దాఁక రథము జూచు

     దరుణి మరి కొంత సేపు కేతనముఁ జూచు

     గాంత మరి మీద రథ పరాగంబుఁ జూచు

     బడఁతి మరి యంతటను వట్టి బయలు జూచు.

.

పై పద్యం కంకంటి పాపరాజు వ్రాసిన ఉత్తర రామాయణం లోనిది.

.



రాజాజ్ఞ తెలిపి, ఆమెను వదిలివేయడంతో తన పని పూర్తయిన లక్ష్మణుడు “ దుఃఖిస్తూ నమస్కరించి, గంగ ఆవలి తీరంలో వుంచిన రథమెక్కి బయలుదేరిపోతాడు. అప్పుడు ఆ రథాన్ని చూస్తూ అలానే వుండిపోయింది సీత. నింద వలని బాధా, రాముని చర్యపట్ల దుఃఖమూ, హఠాత్తుగా జరిగిన పిడుగుపాటు లాంటి ఆఘాతం వలని దిగ్భ్రమా, భయమూ, ఈ అరణ్య మధ్యంలో ఒక్కసారిగా వదిలేసి పోయినారే దైవమా, అనే నిస్సహాయతా – ఆ నిమిషం వరకూ వున్న లక్ష్మణుడు కూడా వెళ్ళిపోతుండడంతో పై భావాలన్ని ఆమెను ఒక్కసారిగా ముప్పిరిగొనగా నిలువు గుడ్లతో లక్ష్మణుని రథం పోయిన వైపే చూస్తూ ఉండిపోయింది.


రథం దూర దూరంగా వెళ్ళిపోతున్నది. ఆమె రథాన్నే చూస్తున్నది. క్రమక్రమంగా అది కనిపించకుండా పోయింది. ఇప్పుడు రథం పైన ఎగురుతున్న కేతనం మాత్రము కొంచెం కొంచెంగా కనిపిస్తున్నది. ఆమె కేతనము వైపే చూస్తున్నది. కేతనమూ కనుమరుగై పోయింది. గుర్రపు గిట్టలవల్లా, రథచక్రాలవల్లా రేగుతున్న దుమ్ము మాత్రమే కనిపిస్తున్నది. ఆమె ఆ రథ పరాగాన్నే చూస్తున్నది. ఆ ధూళి కూడా మాయమైపోయింది. ఇంకేమున్నది, వట్టి బయలు! ఆమె అలానే చూస్తూ వుండిపోయింది. ఎంత చూస్తే మాత్రం ఏమున్నది. అంతా శూన్యం. వట్టి బయలు. బైటా, మనసు లోపలా కూడా.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!