పోతనామాత్యుని ..భాగవత పద్యాము.!.....(21/5/15.)


పోతనామాత్యుని ..భాగవత పద్యాము.!.....(21/5/15.)
.
మా అమ్మగారికి ఇష్టమైన పద్యం .
( భాగవత దశంస్కంధంలో కనిపిస్తుందీ కమనీయ పద్యం .)
.

"నంద తపఃఫలంబు ,సుగుణంబుల పుంజము , గోపకామినీ
 బృందము నోముపంట ; సిరి విందు ; దయాంబుధి ; యోగి బృందముల్
 డెందములందు గోరెదు కడింది నిధానము సేర వచ్చె నో
 సుందరులార రండు చని చూతము కన్నుల కోర్కి దీరగన్"
.
రోహిణీ నక్షత్రం . గోపాలకృష్ణుని పుట్టిన దినం . కమ్మని కస్తూరి తావులు పుడమి అంతా అల్లుకున్నాయి . మనసు ఆనంద పరవశమయింది . తటాలున మా అమ్మ జ్ఞాపకం వచ్చింది . చిన్నప్పుడు గోరుముద్దలు పెడుతూ నేర్పించిన పద్యం జ్ఞప్తికి వచ్చింది . శ్రీకృష్ణుడు మధురానగరానికి వస్తున్నాడు . సరస సంగీత శృగార చక్రవర్తి , సకల భువనైక చారుమూర్తి తమ నగరానికి వస్తున్నాడని తెలిసిన మధురానగర మనోహారిణుల మనసులు ఆనంద పరిప్లుతాలయినాయి .పరమాత్మ  దర్శనమిస్తే   హృదయం ఝల్లుమనదా !
శ్రీయుతమూర్తియై కరుణ చిందే చూపులతో శ్రీకృష్ణ పరమాత్మ మధురానగరంలో ప్రవేశించాడు . శ్యామలాంగుడు అల్లనల్లన అడుగులిడుతూ కనిపించాడు , ఆ పట్టణంలో నివసించే రమణులకు .  స్వామిని చూచిన ఆ భామినులు ముగ్ధులైపోయారు . తమ స్నేహితులను స్వామిని చూడమని అహ్వానిస్తున్నారు :
.

“నందుడు చేసిన తపస్సుకు ఫలితంగా లభించిన మాధవుడితడు . సుగుణాలకు ఆలవాలం . గోపకామినులు నోచిన నోముల పంట . శ్రీ మహాలక్ష్మికి విందుభోజనం లాంటివాడు . ( ఈ స్వామిని చూడగానే ఆమె కడుపు నిండిపోతుంది . విందు అక్కర లేదు ) . కరుణా సముద్రుడు . యోగులు తమ హృదయాలలో నింపుకోవాలని కోరుకునే పెన్నిధి . రమణీలలామలారా ! పరుగు పరుగున రండి . కనులనిండుగా కృష్ణుని దర్శనం చేసుకుందాం . పునీతుల మవుదాం “.

తమకు కలిగిన భాగ్యాన్ని తమకు కావలసిన వారితో పంచుకోవాలనే మధురానగర మగువల తపన ఈ పద్యంలో కనిపిస్తుంది .   మంచి అందరూ కలిసి అనుభవించాలి . అప్పుడది ద్విగుణీకృతమవుతుంది . ఆ భావన మనలో కలిగించితే ఈ పద్యం సార్థక మవుతుంది .

 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!