మను చరిత్రము.!......--------------.........అల్లసాని పెద్దన్న. ౩/5./15. .

మను చరిత్రము.!......--------------.........అల్లసాని పెద్దన్న. ౩/5./15.

.

(వరూధిని పై కొనఁ బ్రవరుఁడు తిరస్కరించిపోవుట..అగ్నిని బ్రార్థించి ప్రవరుఁ డిలుసేరుట.)

.

మ. వెతలం బెట్టకు మింక న న్ననుచు నీవీబంధ మూడన్‌, రయో

ద్ధతి నూర్పుల్‌ నిగుడన్‌ విరులు చిందం గొప్పు వీడం దనూ

లత తోడ్తోఁ బులకింపఁగా, ననునయాలాపాతిదీనాస్యయై

రతిసంరంభము మీఱ నిర్జరవధూరత్నంబు పై పాటునన్‌. 

.

శా. ప్రాంచద్భూషణ బాహుమూల రుచితోఁ బాలిండ్లు పొంగారఁ బై

యంచుల్‌ మోవఁగఁ గౌఁగిలించి యధరం బాసింప 'హా! శ్రీహరీ'

యంచున్‌ బ్రాహ్మణుఁడోర మోమిడి తదీయాంసద్వయం బంటి పొ

మ్మంచున్‌ ద్రోచెఁ గలంచునే సతుల మాయల్‌ ధీర చిత్తంబులన్‌? 

.

క. త్రోపువడి నిలిచి ఘన ల

జ్జా పరవశ యగుచుఁ గొప్పు సవరించి, యొడల్‌

దీపింప నతనిఁ జుఱచుఱఁ

గోపమునన్‌ జూచి క్రేఁటుకొనుచున్‌ బలికెన్‌. 

.

ఉ. పాటున కింతు లోర్తురె కృపారహితాత్మక! నీవు త్రోవ ని

చ్చోట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొనుమంచుఁ జూపి య

ప్పాటలగంధి వేదననెపం బిడి యేడ్చెఁ, గలస్వనంబుతో

మీటిన విచ్చు గుబ్బచనుమిట్టల నశ్రులు చిందువందఁగన్‌.

.

క. ఈ విధమున నతికరుణము

గా వనరుహనేత్ర కన్నుఁగవ ధవళరుచుల్‌

గావిగొన నేడ్చి, వెండియు

నా విప్రకుమారుఁ జూచి యలమటఁ బల్కెన్‌.

.

ఉ. చేసితి జన్నముల్‌ దపము చేసితి నంటి, దయావిహీనతన్‌

జేసిన పుణ్యముల్‌ ఫలము సెందునె? పుణ్యము లెన్ని యేనియున్‌

జేసినవాని సద్గతియె చేకుఱు భూతదయార్ద్రబుద్ధి, కో

భూసురవర్య! యింత దలపోయవు నీ చదు వేల? చెప్పుమా! 

.

సీ. వెలివెట్టిరే బాదములు పరాశరుఁ బట్టి, దాశకన్యాకేళిఁ దప్పుఁజేసి?

కులములో వన్నె తక్కువయయ్యెనే గాధి, పట్టికి మేనక చుట్టఱికము?

ననుపుకాఁడై వేల్పు నాగవాసముఁ గూడి, మహిమ గోల్పడియెనే మాందకర్ణి?

స్వారాజ్య మేలంగ నీరైరె సుర లహ, ల్యాజారుఁ డైన జంభాసురారి? 

.

తే. వారికంటెను నీ మహత్త్వంబు ఘనమె?

పవన పర్ణాంబు భక్షులై నవసి, యినుప

కచ్చడాల్‌ గట్టుకొను ముని మ్రుచ్చు లెల్లఁ

దామరసనేత్ర లిండ్ల బందాలు గారె?

అగ్నిని బ్రార్థించి ప్రవరుఁ డిలుసేరుట.

తే. అనిన నేమియు ననక యవ్వనజగంధి

మేని జవ్వాదిపస కదంబించు నొడలు

గడిగికొని వార్చి, ప్రవరుండు గార్హపత్య

వహ్ని ని ట్లని పొగడె భావమునఁ దలఁచి. .

మ. దివిషద్వర్గము నీ ముఖంబునన తృప్తిం గాంచు, నిన్నీశుఁగా

స్తవముల్‌ సేయు శ్రుతుల్‌, సమస్త జగదంతర్యామివిన్‌ నీవ, యా

హవనీయంబును దక్షిణాగ్నియును నీయం దుద్భవించున్‌, గ్రతూ

త్సవసంధాయక! నన్నుఁ గావఁగదవే! స్వాహావధూవల్లభా! 

.

ఉ. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుఁడనేని, భవత్పజాంబుజ

ధ్యాన రతుండనేనిఁ, బరదార ధనాదులఁ గోరనేని, స

న్మానముతోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాం

భోనిధిలోనఁ గ్రుంకకయమున్న రయంబున హవ్యవాహనా! 

.

వ. అని సంస్తుతించిన నగ్నిదేవుం దమ్మహీదేవు దేహంబున సన్ని

హితుం డగుటయు నమ్మహాభాగుండు గండు మీఱి పొడుపుఁగొండ

నఖండ సంధ్యారాగప్రభా మండలాంతర్గతుండగు పుండరీక వన

బంధుండునుంబోలె నుత్తప్త కనకద్రవధారా గౌరంబగు తనుచ్ఛా

యావూరంబున నక్కాన వెలింగించుచు నిజగమన నిరోధిని యగు

నవ్వరూధిని హృదయకంజమున రంజిల్లు నమందానురాగరస

మకరందంబు నందంద పొంగంజేయుచుఁ బావకప్రసాద లబ్ధంబగు

పవనజవంబున నిజమందిరంబున కరిగి నిత్యకృత్య సత్కర్మ

కలాపంబులు నిర్వర్తించె ను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!